అంతం తప్పదా : భూమిపై గ్రహశకలాల విధ్వంసం

stephen-hawking-earthభూమిని గ్రహశకలం ఢీ కొట్టడం ఖాయమని, దీనిని తప్పించలేమని హెచ్చరిస్తున్నారు ఖగోళ పరిశోధకులు. విశ్వంలో లెక్కలేనన్ని గ్రహశకలాలు తిరుగుతున్నాయి.. అందులో చాలా వరకు ప్రమాదరహితమైనవే ఉన్నాయి.. అయినా అకస్మాత్తుగా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీ కొడితే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అనుకోకుండా జరిగే ఇలాంటి ప్రమాదాలతో భూమిపై నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను ఖగోళ పరిశోధకులు ఉదహరించారు. సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో 1908 జూన్‌ 30న ఓ గ్రహశకలం భూమిని ఢీ కొట్టింది. దీంతో రెండు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తుడిచిపెట్టుకుపోయింది. ఈ విధ్వంసం కారణంగానే జూన్‌ 30ని ప్రపంచ ఆస్ట్రాయిడ్‌ డే గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మరోవైపు కాలంచెల్లిన ఉపగ్రహాలను తొలగించేందుకు అయస్కాంత శక్తిని ఉపయోగించుకోనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సదరు ఉపగ్రహాన్ని ఆకర్షించి దారి మళ్లించడమో లేక ఎడారి ప్రాంతాల్లో పడేయడమో చేయాలని నిపుణులు భావిస్తున్నారు. అంతరిక్షంలో ప్రమాదకర రీతిలో పెరిగిపోతున్న వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఈ విధానాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ టొలస్సీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవ జాతి మనుగడ కొనసాగించాలంటే భవిష్యత్తులో గ్రహాంతరాలకు వలస వెళ్లాల్సిందేనని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మరోసారి స్పష్టంచేశారు. ఇందుకోసం విశ్వాంతరాలలో ఇప్పటినుంచే అన్వేషించాలని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో అంటే 2020 నాటికి చంద్రుడిపైకి, 2025 నాటికి అంగారకుడిపైకి వ్యోమగాములను పంపించాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో భూమి మీద జీవ మనుగడ సాధ్యం కాదని, మరో పది లక్షల సంవత్సరాల తర్వాత భూగ్రహంపై జీవం అనేదే ఉండదన్నారు. గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్లనో లేక సూర్యుడిలో కలిసి పోవడం ద్వారానో భూగ్రహం రూపు కోల్పోతుందని వివరించారు ఖగోళ శాస్త్రవేత్తలు. మనల్ని మనం కాపాడుకోవాలంటే కొత్త గ్రహాలను కనుగొని, వలస వెళ్లక తప్పదని తెలిపారు. ఈ క్రమంలో పరిశోధనలలో వేగం పెంచి రాబోయే 30 ఏళ్లలో చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయాలని హాకింగ్‌ సూచించారు. ఖగోళ పరిశోధకులు ఇదే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy