అకున్ సార్.. నెక్స్ట్ ఏంటీ..?

Drugs-akun12 మంది.. 96 గంటలు.. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో ఫస్ట్ ఆఫ్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసుపై తెగ ప్రచారం జరిగింది. వీళ్లున్నారు… వాళ్లున్నారు అంటూ మీడియాలోనూ నానా హంగామా చేశారు. ఇంతకూ సిట్ విచారణలో ఏం తేలింది అంటే ప్రశ్నలే మిగులుతున్నాయి తప్ప.. జవాబులు దొరకడం లేదు. ఓ బడా నిర్మాత ఉన్నాడంటూ.. సాక్షాత్  సిట్ విచారణాధికారి అకున్ సభర్వాల్ చెప్పినా… ఇప్పటి వరకు అతనెవరో చెప్పకుండా నెట్టుకొచ్చేశారు. సెకండాఫ్ ఉందటూ లీకులైతే ఇస్తున్నారు కానీ.. ఇదంతా డ్రామాలాగే కనిపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సాక్షాత్ సీఎం కేసీఆర్ రివ్యూ చేసి.. ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు.. మీ పని మీరు చెయ్యండి అని చెప్పినా… ఇంకా ఏదో దాస్తున్నారన్న అనుమాను ప్రజల్లో కలుగుతున్నాయి. డ్రగ్స్ ఉచ్చులో ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ స్కూళ్ల విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్పారు. కానీ ఆయా కాలేజీలు, స్కూళ్లు, ఐటీ కంపెనీల పేర్లు ఒక్కటీ బయటకు రాలేదు. వాళ్లను ప్రశ్నిస్తారా.. వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది. నోటీసుల విషయంలో కూడా ఐటీ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు కానీ .. కాలేజీలకు, స్కూళ్లకు మాత్రం ఇవ్వలేదు.

పూరీ జగన్నాథ్ మొదలుకొని నందు వరకు 12 మంది టాలీవుడ్ ప్రముఖులను 96 గంటల పాటు విచారించింది సిట్. విచారణలో ఏం తేల్చారు అన్నది అందరిలోను మెదులుతున్న ప్రశ్న. అయితే వీళ్లు బాధితులా, నిందితులా, సాక్షులా… అన్నది కూడా డౌటే. రక్తనమూనాలు వచ్చిన తర్వాత అసలైన కథ మొదలవుతుందని అంటున్నారు. ఇంతకూ కోర్టుకు ఆ రిపోర్టులను సమర్పిస్తారా..? లేదా అన్నది కూడా తేలాలి.

మరోవైపు మూడు తరాలుగా పాతుకుపోయిన టాలీవుడ్ పెద్దల్లోని కొంతమందికి డ్రగ్స్ గేమ్ లో పెద్ద పాత్రే ఉందని అంటున్నారు.. మరి వాళ్లను అలాగే వదిలేస్తారా.. అన్నది కూడా క్వశ్చన్ మార్కే. 67NDPS యాక్ట్ కింద ఎవరినైనా విచారించొచ్చు అంటున్న సిట్ కు.. పెద్దవాళ్లను పిలవడానికి వచ్చే అడ్డంకులు ఏంటి..?

ఇంత వరకు స్పీడ్ గా వెళ్లిన సిట్ కు స్మాల్ బ్రేక్ పడింది.. అది బ్లాస్ట్ అవుతుందా.. లేక తుస్ మంటుందా.. అన్నది సెకండాఫ్ లో తేలనుంది. అప్పటి వరకు పై ప్రశ్నలకు సమాధానాలు ఊహాగానాలుగానే ఉంటాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy