అడవిలోనే ప్రసవం

LADYఓ నిండుగర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తూ మధ్యలోనే అడవిలో ప్రసవించిన ఉదంతమిది. అడవిబిడ్డలకు వైద్యం ఇంకా అందనిమావిగానే మిగిలిందనడానికి నిదర్శనంగా నిలుస్తోందీ సంఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎర్రంపాడు గ్రామం మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన గర్భిణి మడకం బిందు (26)కు నెలలు నిండాయి. మంగళవారం(ఆగస్టు-15) అనుకోకుండా నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం ఇచ్చారు.

దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఎర్రంపాడు నుంచి రహదారి సౌకర్యం ఉన్న చెన్నాపురం వరకు 5 కి.మీ మేర కాలి నడకన వెళితే అక్కడికి 108 వాహనం వచ్చే వీలుంటుంది. భర్త, ఆమె సోదరుడు కలిసి ఓ మంచాన్ని తిరగేసి కావడిలా కట్టిన జెట్టీలో గ్రామం నుంచి బిందును మోసుకువెళ్లడానికి సిద్ధపడ్డారు. కాని వారి శ్రమ ఫలించలేదు. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె అడవిలోనే ప్రసవించింది. బంధువైన ఓ మహిళ వెంట ఉండడంతో అక్కడే కాన్పు జరిపింది. అంతటితో ఆమె కష్టాలు తీరలేదు.. అక్కడిదాకా జెట్టీలో తీసుకువచ్చినా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రసవించాక తల్లీబిడ్డలను అలా జెట్టీలో తీసుకువెళ్లడానికి ఇష్టపడరు. అప్పుడే ప్రసవించిన పచ్చి బాలింత అయినా అడవిలో నడవక తప్పలేదు. కాలికి చెప్పులు కూడా లేకుండా 3 కిమీ మేర ఆమె అడవిలో నడిచి 108 వాహనం వద్దకు చేరాల్సి వచ్చింది. అప్పటికే అడవిలో కొంతదూరం ఎదురు వచ్చిన 108 పైలెట్‌ రవీందర్‌, ఈఎంటీలు ఆ బాలింతకు, బాబుకు ప్రాథమిక వైద్యం అందించి ఆసుపత్రికి తరలించారు. ఇవీ అడవిబిడ్డల కష్టాలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy