కేంద్ర ప్రభుత్వం అణు విద్యుదుత్పత్తిపై దృష్టి సారించింది. కొత్తగా పది అణువిద్యుత్ కేంద్రాలు నెలకొల్పేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం (మే 17) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో అణువిద్యుత్ కేంద్రాన్ని 700 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్నట్టు తెలిపారు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. రాజస్థాన్‌లోని మాహీ భాన్స్వాడా, మధ్యప్రదేశ్‌లోని చుట్కా, కర్ణాటకలోని కైగా, హర్యానాలోని గోరఖ్‌పూర్ లో నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇవి పూర్తయితే 7వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకోసం రూ.70వేల కోట్లు వ్యయం చేయనున్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో భారత్‌లో అణువిద్యుత్ ఉత్పత్తి ఒక పరిశ్రమగా ఎదుగనుందన్నారు. ఈ ప్లాంట్లతో 33వేల 400 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పర్యావరణరహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 22 రియాక్టర్ల ద్వారా 6వేల 780 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడులో 6వేల 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి రాబోయే ఐదేళ్లలో అందుబాటులోకి వస్తాయి.