అదుపు తప్పిన ‘రోబో’లు.. అయోమయంలో శాస్త్రవేత్తలు

robaరోబోలను తయారుచేసిన శాస్త్రవేత్తలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎంతో టెక్నాలజీతో శాస్త్రవేత్తలు రకరకాల పనులకు ఉపయోగ పడే రోబోలను తయారు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రోబోలు శాస్త్రవేత్తల అదుపుతప్పి, సొంత భాషతో ప్రపంచాన్ని సృష్టించుకున్న ఘటన చోటుచేసుకోవడంతో నిపుణులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ చేపట్టిన కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాజెక్టులోనే చోటుచేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు ఏఐ గురించి చాలా పరిమిత అవగాహనే ఉందని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఫేస్‌బుక్‌ ఏఐ పరిశోధక ప్రయోగశాల (ఫెయిర్‌) ఏఐబోట్‌లనే మాట్లాడే రోబోలను తయారుచేసింది. జూన్‌లో ఈ సంస్థకు చెందిన పరిశోధకులు.. ఈ యంత్రాలను మెరుగుపరచేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాల్లో మునిగిపోయారు. యంత్ర అభ్యాస ఆల్గోరిథమ్‌లను ఉపయోగించి స్వేచ్ఛగా అవి సంభాషించుకునేలా చేశారు. వాటి సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచే ఉద్దేశంతో వారు ఈ ప్రయత్నాన్ని చేశారు. అయితే చర్చించడాన్ని నేర్చుకున్న ఈ యంత్రాలు ప్లేటు ఫిరాయించాయి. అదుపు తప్పి.. సొంత భాషను అభివృద్ధి చేసుకున్నాయి. మానవ ప్రమేయం లేకుండానే దీన్ని సాధించడంపై నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. మానవులకు అర్థంకాని ఆ భాషలోనే అవి సంభాషించుకోవడం మొదలుపెట్టాయి. నిపుణులు ఇచ్చిన కోడ్‌లను ధిక్కరించాయి. ‘‘ఈ ఏఐ బోట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను షట్‌డౌన్‌ చేయడం లాంటి విపరీత చర్యలేమీ మొదలుపెట్టలేదు. అయితే ఆంగ్ల భాష వాడకాన్ని నిలిపివేశాయి. తాము సొంతంగా సృష్టించుకున్న భాషను వాడటం మొదలుపెట్టాయి. తద్వారా వాటి రూపకల్పన వెనుక ఉన్న లక్ష్యాన్ని ధిక్కరించాయి’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కృత్రిమ మేధస్సు రంగంలో ఇదో పెద్ద పురోగతిలా అనిపిస్తున్నప్పటికీ.. దానితో పొంచి ఉన్న ప్రమాదాలను ఇది కళ్లకు కడుతోంది. దీనిపై ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. మందగమనంలో సాగే జీవ పరిణామక్రమానికి లోబడే మానవజాతిని.. కృత్రిమ మేధస్సు అధిగమించేస్తుందని హెచ్చరించారు. ఎలాన్‌ మస్క్‌, వితరణశీలి బిల్‌ గేట్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ అంశంపై ట్విటర్‌లో మస్క్‌కు, జుకర్‌బర్గ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కృత్రిమ మేధస్సుకు సంబంధించి నియంత్రణ, రక్షణ చర్యలు అవసరమని మస్క్‌ తెలుపగా.. దానికి జుకర్‌బర్గ్‌ ఘాటుగా బదులిచ్చారు. పెను వినాశనం జరుగుతుందని భయాందోళనలు రేకెత్తించడం బాధ్యతారహిత్యమన్నారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. కృత్రిమ మేధస్సుపై జుకర్‌బర్గ్‌కు చాలా పరిమిత అవగాహనే ఉందని చెప్పారు.

ఒక శాస్త్రవేత్త సృష్టించిన చిట్టి అనే మరమనిషి.. కట్టుతప్పి, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవడం, మానవజాతికి పెను ప్రమాదకారిగా పరిణమించడం ‘రోబో’ సినిమాలో మనం చూశాం. ఆ స్థాయిలో కాకపోయినా.. ఇంచుమించుగా అలాంటి పోకడే ఇప్పుడు వాస్తవంగా చోటుచేసుకుంది కదూ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy