అద్భుత పథకం: రోజూ 42 వేల గొర్రెల పంపిణీ

Sheepరాష్ట్రంలో గొల్ల, కుర్మలను లక్షాధికారులను చేసే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనుంది. మొదటగా సీఎం కేసీఆర్ గజ్వేల్‌ నియోజకవర్గం కొండపాకలో మంగళ వారం (జూన్20) ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 62 వేల గొర్రెల పంపిణికి ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం ఈ పథకం ప్రారంభం కానుంది. స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.

లబ్ధిదారులు 3.60 లక్షల మంది ఉన్నారని తెలిపారు మంత్రి తలసాని. ప్రభుత్వం కొని పంపిణీ చేయాల్సిన గొర్రెలు 75.60 లక్షలు. అంటే సగటున రోజుకు కొని పంపిణీ చేయాల్సిన గొర్రెలు.. 42 వేలు. ఇదీ ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం. గ్రేస్‌ పీరియడ్‌ మరో రెండు నెలలు కలుపుకొన్నా.. రోజుకు కొని పంపిణీ చేయాల్సిన గొర్రెల సంఖ్య.. 31,500గా ఉంది. గొర్రెల పథకానికి అనూహ్య స్పందన రావడంతో దానికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు

ఏడాదికి 2 లక్షల చొప్పున రెండేళ్లలో 4 లక్షల మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎన్సీడీసీ రూ. 4వేల కోట్ల రుణం మంజూరుచేసింది. తొలి విడతగా రూ. 700 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వేలో ఈ పథకానికి 7.18 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. లాటరీ నిర్వహించి ఈ ఏడాది 3.60 లక్షల మందికి, వచ్చే ఏడాది 3.58 లక్షల మందికి గొర్రెల యూనిట్లు ఇస్తారు. యూనిట్‌కు ఒక పొట్టేలు, 20 గొర్రెలను ఇస్తారు.

గొర్రెల పెంపకం ద్వారా రాబోయే కాలంలో రూ. 20వేల కోట్ల  GSDP సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ పథకంలో గొర్రెల రీసైక్లింగ్‌, అంతర కొనుగోళ్లకు తావులేకుండా చర్యలు చేపట్టింది. గొర్రెలన్నింటినీ బయటి రాష్ట్రాల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ ఏ అధికారులు కొనుగోలు చేపట్టాలో నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున 30 జిల్లాల నుంచి 30 బృందాలను ఇతర రాష్ట్రాల్లోని అమ్మకందార్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు నియమించింది.

ఈ బృందాలు గొర్రెలను గుర్తించి ఒప్పందాలు చేసుకున్న తర్వాత.. మండల బృందాలకు సమాచారం ఇస్తాయి. మండల బృందాలు వెళ్లి చెక్కులిచ్చి బీమా తదితర కార్యక్రమాలు పూర్తిచేస్తారు. అక్కడి నుంచి తెలంగాణకు గొర్రెల రవాణా జరుగుతుంది. గొర్రెలయూనిట్‌ ధరలో ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన 25% లబ్ధిదారుడు భరించాలి. గొర్రెల కొనుగోళ్లకు వారం ముందే.. లబ్ధిదారుడు తన వాటా కింద రూ. 31,250 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణకు గొర్రెలు కావాలని తెలిసి.. కర్ణాటకలో ఇప్పటికే ధర పెంచేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆడ గొర్రెను రూ. 5,200, మగ గొర్రెను రూ. 7వేలతో కొనుగోలు చేయాలి. కానీ కర్ణాటకలోని రాయచూరు, కొప్పల్‌ జిల్లాల్లో గొర్రెల పెంపకందారులు అమాంతం ధర పెంచారు. బక్కగా, అంతగా బరువులేని గొర్రెలను కూడా రూ. 6,500 వరకు చెబుతున్నారు.

లబ్ధిదారులు తమ చేతికి గొర్రెలు రాగానే వాటిని అమ్మేసుకోకుండా.. సోషల్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లుచేస్తోంది. గొర్రెల పంపిణీ జరిగిన నెల తర్వాత ఒకసారి, ఆర్నెల్లకు మరోసారి పశుసంవర్థకశాఖ సోషల్‌ ఆడిట్‌లను నిర్వహించనుంది. సోషల్‌ ఆడిట్‌లో ఒప్పందాల మేరకు వ్యవహరిస్తున్నారా.. గొర్రెలను అమ్ముకున్నారా అన్న విషయాన్ని తనిఖీ చేస్తారు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy