అధికారులు వసూలు చేశారు : ఈ గుడిసెకి రూ.500 ఆస్తిపన్ను.. బతికేది పెన్షన్ తో

house-taxవారు నిరుపేదలు.. అందులోనూ వృద్ధులు.. వారి జీవనాధారం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్.. ఆ డబ్బుతోనే బతుకుతున్నారు.. అలాంటి వారి నుంచి అక్షరాల రూ.500 ఆస్తి పన్ను వసూలు చేసి.. తమ ఘనత చాటుకున్నారు ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఆశ్చర్యకరమైన.. అవాక్కయ్యే సంఘటన కుముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కార్జవెల్లి గ్రామంలో జరిగింది. పంగిడి చీకటి అనే గిరిజన దంపతులు కొన్నేళ్లుగా గ్రామంలోనే ఓ గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. వారి వయస్సు కూడా 70 ఏళ్లు పైనే. పనులు కూడా చేసుకోలేని వీరికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పై ఆధారపడి నాలుగు మెతుకులు తింటారు. అనుకోకుండా వారికి ఓ రోజు.. గ్రామ పంచాయతీ నుంచి ఆస్తి పన్ను నోటీసు వచ్చింది. రూ.500 కట్టాలని అల్టిమేటం ఇచ్చారు పంచాయతీ అధికారులు.

ఎప్పుడూ ఇలాంటి నోటీసు చూడని, వినని ఆ గిరిజన దంపతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పెద్దాయనే పంచాయతీ ఆఫీసు వెళ్లి నోటీసు సంగతి చెప్పాడు. పదేళ్లుగా కట్టటం లేదని.. కట్టాలని గట్టిగా చెప్పాడు. డబ్బులు లేవంటూ తన నిస్సాహాయతను పంచాయతీ కార్యదర్శి నర్మినేని సునీల్ దగ్గర వ్యక్తం చేశాడు ఆ గిరిజన వృద్ధుడు. అప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయిన పంచాయతీ కార్యదర్శి సునీల్ కు మనస్సు కరగలేదు.. నీకు ఆసరా పెన్షన్ వస్తుంది కదా.. అందులో నుంచి తీసుకుంటాను అన్నాడు. అయ్యా.. ఆ పెన్షన్ తోనే నేను.. నా ముసలావిడా బతకాలి.. మీరు 500 తీసుకుంటే ఎలా అంటూ మరీ వేడుకున్నాడు ఆ గిరిజన వృద్దుడు పంగిడి చీకటి. కనీసం మానవత్వం అనేది ఆలోచించకుండా ఆసరా పెన్షన్ నుంచి నిర్ధాక్షణ్యంగా రూ.500 ఆస్తి పన్ను కింద కట్ చేసుకున్నాడు కార్యదర్శి.

ఈ విషయం గ్రామంలోని ఓ టీఆర్ఎస్ కార్యకర్త జలగం సుధీర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆ గుడిసె ఫొటో, వృద్ధ దంపతుల జీవితం, వారి పెన్షన్ తో కట్టించుకున్న ఆస్తి పన్ను వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పంచాయితీ అధికారి గంగాధర్ స్పందించారు. పంచాయతీ కార్యదర్శిని పిలిచి వివరణ కోరారు. దీనికి సమాధానంగా పదేళ్లుగా వాళ్లు ఆస్తి పన్ను కట్టటం లేదని.. ఇన్ని సంవత్సరాలకు గాను రూ.500 వసూలు చేశానని చెప్పాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారంట డీపీవో గంగాధర్ గౌడ్. నిరుపేద గిరిజన వృద్ధ దంపతులు.. పెన్షన్ పైనే ఆధార పడి జీవిస్తున్నారు.. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ణానం లేదా అంటూ పంచాయతీ కార్యదర్శి సునీల్ ను మందలించాడు. ఇలాంటివి రిపీట్ అయితే పద్దతిగా ఉండదని హెచ్చరించి వదిలేరు. సోషల్ మీడియాలోకి ఎక్కిన ఈ పోస్ట్.. మంత్రి ఇంద్రకరణ్, ఎంపీ కవిత ద్వారా ఏకంగా సీఎం కేసీఆర్ వరకు చేరింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy