అధికారుల అలసత్వం: పక్కదారి పడుతున్న గొర్రెల పంపిణీ పథకం


మహబూబ్ నగర్ జిల్లాలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. లబ్దిదారులకు ఇచ్చిన గొర్రెలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేస్తున్నారు. కడప నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్న దళారులు… పశు సంవర్ధక శాఖ అధికారుల అండదండలతో మారు బేరాలు చేస్తున్నారు. జిల్లాలో గొర్రెల పెంపక అభివృద్ధి పథకంలో భాగంగా మొత్తం 54 వేల మంది లబ్దిదారులు ఎంపికయ్యారు. 27 వేల మందికి మొదటి ఏడాది ఒక్కో యూనిట్ చొప్పున అందజేసారు. కర్ణాటకలోని కొప్పల్, రాయిచూరు జిల్లాల నుంచి దిగుమతి చేసి అందించేలా చర్యలు తీసుకున్నారు. డిమాండ్ తో సప్లై లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా కొనుగోలు చేశారు. అయితే ఈ సారి లోకల్ గానే సమకూరుస్తున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది లభ్యమవుతున్న గొర్రెల చెవులన్నీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు కుట్టి ఉన్నాయి. గొర్రెలు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదని జియో ట్యాగింగ్ చేశారు. అధికార ముద్రతో కూడిన నెంబర్ ను ఒక్కో గొర్రెకు అలాట్ చేశారు. జియో ట్యాగింగ్ తో ఎక్కడికి వెళ్లినా గుర్తించాలన్నది జియో ట్యాగింగ్ ఉద్దేశం. కానీ అలాంటి నెంబర్ గల ప్లేట్లన్నింటినీ తీసేసి.. చెవులకు రంధ్రాలే కనబడకుండా.. మొత్తానికే చెవులు కోస్తున్నారు.

ప్రతీ గ్రామంలోని లబ్దిదారులకు అలా గొర్రెలు అందాయో లేదో.. దళారులు ఎంటరవుతారు. లబ్దిదారుల చెల్లించిన 31 వేలకు మరో 20 – 30 వేలు ఎక్కువ ఇచ్చి.. గొర్రెలను తీసుకెళ్తారు. ఒక్కో యూనిట్లో 21 ఆడ గొర్రెలు.. ఒక పొటేలు ఉండాలి. కానీ చాలా గ్రామాల్లో ఇచ్చిన యూనిట్లలో పొటేలు లేదని చెప్తున్నారు లబ్దిదారులు. గొర్రెలకు రీ సైక్లింగ్ పై అధికారులకు సమాచారమున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమాలను అరికట్టి ప్రక్షాళన చేయకపోతే.. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకానికి అర్థం లేకుండా పోతుందంటున్నారు యాదవులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy