అనుమానాస్పద స్థితిలో యువతీ, యువకుడు మృతి

DEATH YOUNGERSఅనుమానాస్పద స్థితిలో యువతీయువకులు మరణించిన ఈ ఘటన శుక్రవారం (ఏప్రిల్-20) హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ లో చోటు చేసుకుంది. వీరిద్దరూ స్నేహితులని, ఇద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే యువకుడిది హత్యేనని అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కొన ఊపిరితో ఉన్నట్టు ఘటనాస్థలికి వచ్చిన 108 సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరికి తనువు చాలించింది.

వివరాలు ఇలా ఉన్నాయి..ఖైరతాబాద్‌ న్యూ CBI క్వార్టర్స్‌ కు చెందిన ఆకుల శ్రీనివాస్‌ BSNL ఉద్యోగి. తెల్లవారుజామున న్యూస్‌ పేపర్‌ హాకర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈయన భార్య అనిత గృహిణి. వీరికి వెంకట సుమన్, వర్షశ్రీ(22) సంతానం. గురువారం నల్లకుంటలోని సమీప బంధువు ఇంట్లో పెళ్లి ఉండటంతో అంతా వెళ్లారు. శ్రీనివాస్‌ తల్లి శంకరమ్మ(80) ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వర్షశ్రీ, శ్రీనివాస్‌ ఇంటికి వచ్చేశారు. ఉదయం 10:30కి శ్రీనివాస్‌ డ్యూటీకి వెళ్లగా.. వర్షశ్రీ, శంకరమ్మ ఇంట్లో ఉన్నారు. వర్షశ్రీకి పరిచయస్తుడైన బడంగ్‌పేటకు చెందిన మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:15కి ఆమె ఇంటికి వచ్చాడు. మహేశ్వర్‌ రెడ్డి స్వీట్‌ బాక్స్‌తో పాటు మద్యం బాటిల్‌ తీసుకువచ్చాడు. అతడు ఇంట్లోకి వస్తున్న సమయంలో ముందు గదిలో ఉన్న శంకరమ్మ అలికిడి గమనించింది. కంటి చూపు సరిగా లేక ఎవరు వచ్చారని వర్షను అడగ్గా.. పని మనిషి వచ్చిందని చెప్పింది. 2:30కి మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ క్రమంలో శంకరమ్మ మరోసారి ఎవరని ప్రశ్నించినా వర్షశ్రీ బదులివ్వలేదు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్షశ్రీ సోదరుడికి ఫోన్‌ చేసి ఏడుస్తూ అస్పష్టంగా మాట్లాడింది. సుమన్‌ హుటాహుటిన నల్లకుంట నుంచి ఇంటికి చేరుకున్నాడు.

ఇంట్లోకి ప్రవేశించిన సుమన్‌ మొదటి బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌ కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న మహేశ్వర్‌రెడ్డిని గమనించాడు. వర్షశ్రీ ఆచూకీ లేకపోవడం, మరో బెడ్‌రూమ్‌ లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులను గట్టినా తన్నడంతో గడియ విరిగి అవి తెరుచుకున్నాయి. అక్కడ బెడ్‌పై వర్షశ్రీ పడి ఉండటాన్ని గమనించాడు. మంచం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌కు చీర కట్టి… అది ఆమె మెడకు చుట్టి ఉంది. ముక్కులో నుంచి రక్తం కారడంతో పాటు నుదుటిపై కమిలిన గాయాలున్నాయి. ఇద్దరి మెడలకు ఉన్న చీరల్ని కట్‌ చేసిన సుమన్‌ 108కి సమాచారం ఇచ్చాడు. 3.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి వచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీలను పరిశీలించి ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వర్షశ్రీని ఓ దుప్పటిలో పెట్టి మొదటి అంతస్తు నుంచి కిందికి తీసుకువస్తుండగా.. ఆమెలో కదలికల్ని కుటుంబీకులు గుర్తించారు. అప్రమత్తమైన వారు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూసింది.

మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేప్పుడు వర్షశ్రీ ఏం చేస్తోంది? ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనేది అంతుచిక్కట్లేదు. వర్షశ్రీపై మహేశ్వర్‌రెడ్డి చేయి చేసుకున్నాడా? ఈ కారణంగానే ఆమె ఉన్న గదిలోంచి బయటకు వచ్చి మరో గదిలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలను పోలీసులు వెలిబుచ్చుతున్నారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకొచ్చిన స్వీట్స్‌ లో ఏమైనా కలిపాడా.. అనే అనుమానంతో వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఈ ఉదంతంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy