అన్నింటికీ ఉండాల్సిందే : ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ‘ఆధార్‌’

aadhar-land-registrationభూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇక నుంచి ‘ఆధార్‌’తప్పనిసరిగా ఉండాల్సిందే. క్రయ, విక్రయ లావాదేవీలకు గాను ఇరు పార్టీలూ ఆధార్‌ వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్న నిబంధన వచ్చేనెల నుంచి అమల్లోకి వస్తుంది. ఇటీవల భారీగా రిజిస్ట్రేషన్‌ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ‘ఆధార్‌’లింకును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొంత జాప్యం జరిగినా ఆగస్టు నుంచి కచ్చితంగా ఈ నిబంధన అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు.
పారదర్శకత కోసమే..

ప్రస్తుతానికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వ్యక్తిగత ధ్రువీకరణతో సరిపెడుతున్నారు. క్రయ, విక్రయాలు జరిపే ఇరు పార్టీల ధ్రువీకరణ కార్డులతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలతో రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. కానీ ఆధార్‌ నిబంధన అమల్లోకి వస్తే ఇరు పార్టీలు కచ్చితంగా తమ ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు కూడా తీసుకుంటారు. సాక్షుల ఆధార్‌ వివరాలు కూడా తీసుకోవాలని యోచిస్తున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు. తద్వారా సంబంధిత లావాదేవీ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, ఏదైనా అక్రమం జరిగినా కచ్చితంగా తేలుతుందనే భావిస్తున్నారు. సాక్షుల ఆధార్‌ విషయంగా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికైనా ఒకవేళ ఆధార్‌ లేనిపక్షంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకోవాలనే నిబంధన విధిస్తున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు అధికారులు.
న్యాయపరంగా చిక్కులుండవు…

వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు మినహా ఇతరాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం ఏ మేరకు అమల్లోకి వస్తుందన్న దానిపై అస్పష్టత ఉంది. రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ తప్పనిసరి చేస్తే.. కోర్టుపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నదిశగా ఆలోచన చేస్తున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు. అయితే పాన్‌కార్డును ఆధార్‌తో లింకు చేయడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భూ అక్రమాల నియంత్రణ కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నందున రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ తప్పనిసరి చేయడానికి న్యాయపరంగా ఇబ్బందులు రావని భావిస్తున్నారు రిజిస్ట్రేషన్ల అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy