అభివృద్ధికి నోచుకోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం..!!

kmmజాలువారే జలపాతం.. చుట్టూ కనువిందు చేసే అటవీ ప్రాంతం. ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య కొలువై ఉంది గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. వేలాది మంది భక్తులు.. లక్షల రూపాయల ఆదాయం వచ్చే ఈ ఆలయానికి ఆదరణ కరువైంది.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న మహిమ గల తల్లి సన్నిధి అభివృద్దికి నోచుకోవడం లేదు. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా.. ఇష్టదైవంగా..పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. స్వయంభుగా వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లిని ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట మండలం గోగులపూడి అటవీ ప్రాంతానికి, ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని కన్నాపురం అటవీ ప్రాంతానికి మధ్యలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఆది, మంగళ, గురువారాల్లో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడే రోజంతా గడిపి అటవీ అందాలను అస్వాదిస్తూ అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తారు. గుబ్బల మంగమ్మ తల్లిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు భక్తులు.

అయితే ఇక్కడ అమ్మవారికి ఆలయం అంటూ ఏమీ ఉండదు. తనకు తానుగా ఏర్పడ్డ ఓ గుహా ఉంటుంది. ఆ గుహా పై నుంచి ఏడాది పొడవునా నీరు జాలువారుతూనే ఉంటుంది. ఈ నీటితోనే భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. దాదాపు 5 అడుగుల ఎత్తు నుంచి జారిపడే జలపాతం అందాలను చూసి పరవసించి పోతారు  భక్తులు. గుహ పైకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాని ఎన్ని నీళ్ళు వచ్చిన మోకాలు లోతును మించదు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా ప్రసిధ్ధి చెందిన ఈ ఆలయానికి కొండరెడ్లే పూజారులు.  గోగులపూడి కొండరెడ్లే మొదటగా అమ్మవారికి పూజలు చేయడంతో అదే ఆనవాయితీ కొనసాగుతోంది.  అమ్మవారికి వెళ్లి సారె, చీర, గాజులు, కుంకుమ సమర్పిస్తారు భక్తులు. తమకు నచ్చిన జంతుబలి ఇచ్చి..మొక్కులు తీర్చుకుంటారు. రోజు రోజుకు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

అడవిలో మధ్య నుంచే ఆలయానికి వెళ్ళాలి.  కొంత దూరం గ్రామాలు.. మరికొంత దూరం అటవీ ప్రాంతం ఉంటుంది. దాదాపు 20 కిలో మీటర్లు  వరకు దట్టమైన అడవి ఉంటుంది. మార్గమధ్యంలో ఎత్తైన కొండల మధ్య ప్రయాణం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కొండలను ఆనుకొని రోడ్డు సౌకర్యం ఉండడంతో పాటు పచ్చని చెట్లు, పక్షుల కిలాకిలా రాగాల మధ్య.. వాగులు వంకలు కనువిందు చేస్తాయి. కొండల మధ్యలో ప్రకృతి సిధ్ధంగా ఏర్పడిన గుహాలో అమ్మవారి విగ్రహాలు.. గుహాకు ఉండే గుబ్బలు భక్తులను కట్టి పడేస్తాయి. అశ్వారావు పేట నుంచి టెంపుల్ దాదాపు 45 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి 2 గంటల్లో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దొంతికుంట, వాగొడ్డు గూడెం, రామన్న గూడెం, పూచికపాడు నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

అయితే రోడ్డు మలుపులుగా ఎక్కువగా ఉండడం మట్టి రోడ్డు కావడంతో జర్నీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అటు టెంపుల్ కు 10 కిలో మీటర్ల దూరం నుంచే సెల్  సిగ్నల్స్ ఉండవు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి పచ్చని అటవీ ప్రాంతంలో ఉంటుంది. గీత గీసినట్లు అమ్మ కొలువైన గుట్ట ఇటు కాలు పెడితే తెలంగాణ..అటు కాలు పెడితే ఆంద్రా ప్రాంతం. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న దేవాలయాన్ని అభివృద్ది చేస్తే పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారడం ఖాయమంటున్నారు స్థానికులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy