‘అమరావతి’ వేదికపై ఇద్దరు చంద్రులు

6015_18ఇన్నాళ్లూ ఇద్దరు తెలుగు సీఎంలు పోటాపోటీగా మాటలనుకున్నారు. సీరియస్ గా విమర్శలు చేసుకున్నారు. ఇదంతా వేర్వేరు చోట్ల. ఇప్పుడు ఇద్దరు సీఎంలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వారి వాళ్లేం మాట్లాడబోతున్నారు? ఆంధ్రా కొత్త రాజధాని శంకుస్థాపన వేదికపై తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడిదే రెండు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి రేపుతోంది..

ఇద్దరు సీఎంలు. ఎవరి రూటు వారిదే. ఎవరి స్టైల్ వారిదే. ఏడాదిన్నర పాటు చంద్రబాబు విభజన నష్టాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రతిసారీ హైదరాబాద్ అభివ్రుద్ధి నేనే చేశానని చెప్పుకున్నారు. మరోవైపు విద్యుత్, నీరు లాంటి అంశాల్లో తెలంగాణను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీని గురించే పలు సందర్భాల్లో కేసీఆర్ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా కనిపించిన సీన్ ఇదే.

కానీ అమరావతి సభలో చంద్రబాబు స్పీచ్ ఎలా ఉండబోతోందన్నదే హాట్ టాపిక్ గా మారింది. వేదికపై దగ్గరలోనే కేసీఆర్ ఉంటారు. అందరి దృష్టీ ఇద్దరిపైనే ఉంటుంది. వాళ్లేం చెబుతారా అన్న ఆసక్తి ఉంటుంది. రాజకీయ విభేదాల్ని పక్కనబెట్టి… చంద్రబాబు సానుకూలంగా మాట్లాడతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంచి సందర్భం కావడం, అంతమంది అతిథులు ఉండే సమయం కాబట్టి… రాజకీయ అంశాల జోలికి పోకుండా మాట్లాడతారని భావిస్తున్నారు.

శంకుస్థాపన వేదికపై ఐదుగురికి మించి మాట్లాడే అవకాశం లేదని తెలుస్తోంది. అందులో చంద్రబాబు ప్రసంగం 15 నిమిషాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరగంట మాట్లాడే అవకాశం ఉంది. ఇక సీఎం కేసీఆర్ కూడా మాట్లాడే చాన్సుంది. తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాలు బాగుండాలని చెబుతూ శుభాకాంక్షలు చెప్పే స్థాయిలోనే ఆయన ప్రసంగం ఉండొచ్చు.

ఇద్దరు సీఎంలు ముఖాముఖి కలుసుకుని మాట్లాడుకున్నది చాలా తక్కువసార్లే అయినా పలు అంశాలపై చంద్రబాబుకు కేసీఆర్ సలహాలు, సూచనలిచ్చారు. మొన్నటి భేటీలో కూడా అమరావతికి మంచి వాస్తు ఉందని చెప్పారు. అందులో దిశల గురించి కూడా సూచనలిచ్చారు. గతంలో కలిసినప్పుడూ యోగక్షేమాలతో పాటు పేరు బలాలు, పాలన అంశాల గురించి మాట్లాడుకున్నారు.  అమరావతి సభ తెలుగు రాజకీయాల్లో హిస్టారికల్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇద్దరు సీఎంలూ కలిసి పంచుకునే వేదిక తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలకు వేదిక కావాలని జనం కోరుకుంటున్నారు. తెలుగు నాయకుల హుందాతనాన్ని చూపిస్తున్న ఈ సందర్భం భవిష్యత్ లో అభివృద్ధి రాజకీయానికి స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy