అర్థరాత్రి అలజడి: హైదరాబాద్ లో వడగళ్ల వాన

r5ainహైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి పదకొండు గంటలకు ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు దంచికొట్టింది. భారీ గాలులతోపాటు వడగండ్లు కూడా పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. నాలాలు పొంగిపొర్లాయి. 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన ఈదురుగాలులకు రోడ్లమీద చెట్లు  విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.

ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాగోలు, పంజాగుట్ట, కాప్రా, అల్వాల్, రామంతపూర్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, మొయినాబాద్, బోయినపల్లి, రాజేంద్రనగర్, గచ్చబౌలిలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతో జనం ఇబ్బందులుపడ్డారు. ఈదురుగాలులు, వడగండ్లతో చాలాప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. యూసుఫ్ గూడలో పెద్దసైజులో వడగండ్లు పడ్డాయి. భారీ వర్షంతో సిటీలోని చాలాప్రాంతాల్లో కరెంటు సరఫరా బంద్ కావటంతో అర్ధరాత్రి దాటేవరకు జనం చీకట్లోనే గడపాల్సి వచ్చింది.

ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమీర్ పేట నుంచి కూకట్ పల్లి మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. బీకేగూడ, సనత్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్  ప్రాంతాల్లో చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎర్రమంజిల్, తాజ్ కృష్ణ రూట్ లో కరెంట్ పోల్స్ పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. వడగండ్లకు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఇక మేడ్చల్ జిల్లాలోని కీసర, నాగారం, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్ రావు నగర్, నేరేడ్ మెట్ లలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీళ్లు చేరటంతో జనం ఇబ్బందులుపడ్డారు.

వర్ష బీభత్సంతో ఎదురైన ఇబ్బందులను మంత్రి కేటీఆర్ కు స్థానికులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర చెట్టు కూలి.. ట్రాఫిక్ స్తంభించిందంటూ.. వచ్చిన ట్వీట్ కు వెంటనే స్పందించారు మంత్రి . చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సిటీలో పరిస్థితి చక్కదిద్దేందుకు విద్యుత్, మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీములు రంగంలోకి దిగాలని సూచించారు. ప్రజలు తమ ఇబ్బందులను హండ్రెడ్ నెంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు.  ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేయాలని సిటీ కమిషనర్ కు మంత్రి సూచించారు. కేటీఆర్ ఆదేశాలతోని  సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy