అలిశెట్టి కవితలు.. అక్షరాగ్నులు

Alishettyతెలుగు సాహిత్యంలో పరిచయం అక్కర లేని కవి అలిశెట్టి ప్రభాకర్. మినీ కవితలతో  సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన  కలం యోధుడు. చిన్న పదాలతో గొప్ప అర్థాలు చెప్పిన మేధావి. దోపిడీ సమాజంపై  అక్షరాయుధాలు ఎక్కుపెట్టాడు. సాహితీ చీకటిని చీల్చిన ప్రభాకరుడు.  ఆయన  జయంతి, వర్ధంతి ఒకే రోజు రావడం యాదృచ్ఛికమై అయినా.. తరలిరాద తనే వసంతం అన్నట్టు.. కవితై, చిత్రమై మన చెంతకు వచ్చిన అలిశెట్టి ప్రభాకర్ రచనా శైలిపై వీ6 ప్రత్యేక కథనం….

తెలుగు కవితా వనంలో క్షిపణులు పూయించిన యోధుడు అలిశెట్టి ప్రభాకర్. పొట్టి కవితలతో అనంత అర్థాలను చెప్పిన గట్టి కవి.  డిగ్రీలు, పట్టాలు లేకున్నా  సమాజాన్ని బాగా చదివిన కలం వీరుడు. అందుకే తెలుగు సాహిత్యంలో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు అలిశెట్టి. పుట్టిన రోజు చనిపోయిన రోజు ఒక్కటే అయిన కొద్దిమందిలో ఈయన ఒకరు.

పోరాటాల భూమే ఆయన జన్మభూమి

1954 జనవరి 12 న కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చినరాజం,లక్ష్మీ దంపతులకు జన్మించాడు అలిశెట్టి ప్రభాకర్. కరీంనగర్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ప్రభాకర్.. ఇంటర్ కోసం సిద్ధిపేటలో ఉన్న అక్కా, బావ ఇంటికెళ్లాడు. అప్పటికే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోశాడు. పెన్సిల్ తో బొమ్మలు గీసే హాబీ, ప్రభాకర్ జీవితానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది. అలా 18 ఏళ్ల వయసులోనే బూర్జువా దోపిడి దారులపై కవిత్వాన్ని రాశాడు. 1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది.

ప్రభాకర్ గుండె లోతుల్లో అణిచివేయబడ్డ బడబాగ్ని 1978 జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. దీంతో ఆయనపై ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు కక్షకట్టారు. నిర్బంధం పెరగడంతో జగిత్యాల నుంచి కరీంనగర్ కు షిఫ్ట్ అయ్యాడు. బతకడం కోసం శిల్పి స్టూడియో ప్రారంభించాడు. 1979లో ‘మంటల జెండాలు’ సంకలనాన్ని వెలువరించాడు. అందులో వచ్చిన దోపిడీ చిహ్నం, దశ, పింజర లాంటి ఎన్నో కవితలకు ఇండియన్ ఇంక్ తో అద్భుతమైన చిత్రాలు గీశాడు.

ప్రజా జీవితమే నా కవిత

ఓ వైపు ఫోటోలు తీస్తూనే.. ఇంకోవైపు కవితలు రాశాడు. మరోవైపు బొమ్మలు కూడా గీశాడు. తనలోని భావాలకు చిత్రరూపమిచ్చి వాటితోనే చిత్రకవితలు రాశాడు. ఆ ప్రక్రియ అప్పట్లో పెద్ద సంచలనం. 1981లో ‘చురకలు’ కవితా సంకలనం వచ్చింది. ప్రజల బతుకులు బాగు చేయడానికి, వారి బాధలు ప్రపంచానికి తెలియచేయడానికే కవిత్వమని నమ్మాడు ప్రభాకర్. 1982లో భార్య,ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఆయన రాసిన రక్తరేఖ, సంక్షోభ గీతాలు కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి.

అలిశెట్టికి వచ్చిన పేరు చూసి కొందరు రచయితలు అతనికి దీర్ఘ కవితలు రాయడం చేతకాదని వెక్కిరించారు. దీంతో 1983లో నిజ రూపమనే దీర్ఘ కవిత రాసి సాహితీలోకంలో సంచలనం సృష్టించాడు. 1985లో ప్రభాకర్ రక్తరేఖ మార్కెట్లోకి విడుదలయింది. ఆ కవితా చిత్రాలు చూసిన ఎందరో ఎగబడి కొనుక్కున్నారు. 4000 కాపీలు అమ్మడయి ఇప్పటికీ ఓ రికార్డ్ గా మిగిలింది. ఈ సమయంలోనే ప్రభాకర్ ను క్షయ చుట్టుముట్టింది. ఎడ తెరిపి లేని దగ్గు,అడుగు కదలనివ్వని ఆయాసం,రక్తం ముద్దలుగా పడుతున్నరోజుల్లోనూ.. ఆయన కవిత్వాన్ని రాయడం ఆపలేదు.. ఓ దినపత్రికలో సిటీ లైఫ్ పేరుతో ప్రభాకర్ రాసిన కాలమ్ కు ఆనాటి హైదరాబాదీలు ఫిదా అయ్యారు.

అభినవ పోతన ‘అలిశెట్టి’

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్… కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. అందుకే పర్సనల్ పోయెం అనే కవితలో తెర వెనక లీలగా మృత్యువు కదలాడినట్టు.. తెరలుతెరలుగా దగ్గొస్తుంది.. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని రాసుకున్నాడు. చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్.. పైసల కోసం దారి తప్పలేదు. ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశమొచ్చినా ఒప్పుకోలేదు. సినిమాకవిగా మారి ఉంటే ఎంతో డబ్బు,పేరు సంపాదించేవాడు. సమాజం కోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాసవరకు కట్టుబడి ఉన్నాడు. టీబీకి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక 1993 జనవరి 12 న హైదరాబాద్ లో చనిపోయాడు.. మృత్యువు దాడి చేసిన రోజు కూడా అక్షరాలకు జీవం పోశాడు అలిశెట్టి. విప్లవకవులెందరున్నా..వారెంత మేధావులైనా..జనసామాన్యం గుండెలకు హత్తుకునేలా రచనలు చేయడంలో చెరబండరాజు, శివసాగర్,అలిశెట్టి ప్రభాకర్ దరిదాపుల్లోకి వచ్చేవారెవరూ లేరు.

చివరి మాట

ఆయన కవిత ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు పాఠమయ్యింది. నగర జీవితం అనే పేరుతో బడిపిల్లలకు చేరువయ్యాడు అలిశెట్టి. నిప్పుకణికల్లాంటి అక్షరాలతో… ఉషోదయపు భానుడిలా నవ్యపథానికి మార్గదర్శి అయ్యాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy