అలుపెరగని కమల యోధుడు : ప్రొఫైల్

1924  డిసెంబర్  25న.. మధ్యప్రదేశ్ లోని  గ్వాలియర్ లో  పుట్టారు అటల్ బిహారీ  వాజ్ పేయి. ఆయన  తండ్రి  కృష్ణ  బిహారీ  వాజ్ పెయి,  తల్లి  కృష్ణాదేవీ. గ్వాలియర్ లోని  విక్టోరియా  కాలేజీ, కాన్పూర్ లోని  DAV కాలేజీలో పొలిటికల్  సైన్స్ లో  MA చదివారు.  మహాత్మాగాంధీ  పిలుపుతో  స్వాతంత్ర్య పోరాటంలో  పాల్గొన్నారు. క్విట్ ఇండియా  ఉద్యమంలో  చురుకైన పాత్ర  పోషించారు. చిన్నతనం  నుంచి  RSS  అనుబంధం పెంచుకున్నారు  వాజ్ పెయి.

1948  జనవరి 30న…. మహాత్మాగాంధీ  హత్య అనంతర  పరిణామాలు …. అటల్  బిహారీ వాజ్ పెయి  జీవితానికి  కొత్త దిశను  చూపించాయి.  పత్రికను  ప్రారంభించిన RSS.. . మంచి కవి,  భావుకత ఉన్న  వాజ్ పెయికి  ఎడిటర్  బాధ్యతలు  అప్పగించింది. రాష్ట్రధర్మ మాసపత్రిక,  పాంచజన్య  వారపత్రిక,  స్వదేశ,  వీరార్జున  దినపత్రికలకు ఆయన సంపాదకత్వం  వహించారు. 1951 అక్టోబర్ లో ….డాక్టర్  శ్యామా ప్రసాద్  ముఖర్జీ  నేతృత్వంలో భారతీయ  జన సంఘ్  ఆవిర్భవించింది. కాన్పూర్ లో  జరిగిన  జన సంఘ్  వ్యవస్థాపక  సదస్సులో  పండిట్  దీన్ దయాల్  ఉపాధ్యాయ,  వాజ్ పెయి  పాల్గొన్నారు. తన సలహాదారుడిగా  వాజ్ పెయిని  నియమించుకున్నారు  శ్యామాప్రసాద్  ముఖర్జీ.

1953లో  కశ్మీర్ స్వతంత్ర  ప్రతిపత్తికి  వ్యతిరేకంగా…. శ్యామా ప్రసాద్ ముఖర్జీ  నేతృత్వంలో  జరిగిన పోరాటంలో  వాజ్ పెయి  కీలక పాత్ర  పోషించారు. జైలుకు వెళ్లారు. 1953  జూన్ 23న …. శ్రీనగర్  జైళ్లో శ్యామాప్రసాద్  ముఖర్జీ  అనుమానాస్పద  స్థితిలో  చనిపోవడంతో.. జనసంఘ్  బాధ్యతలను  భుజాలకు  ఎత్తుకున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ…. పార్లమెంట్ లో  పార్టీ వాయిస్  వినిపించే అవకాశాన్ని వాజ్ పేయికి ఇచ్చారు. 1957 లో  బలరాంపూర్  నియోజవకర్గం  నుంచి లోక్ సభకు  ఎన్నికయ్యారు  వాజ్ పేయి. అలా  31 ఏళ్ల  వయసులో ….2వ లోక్ సభలో  అడుగుపెట్టారు. జన సంఘ్  పార్లమెంటరీ పార్టీ  నేతగా పనిచేశారు.  తన వాగ్ధాటి,  ప్రజా సమస్యల  పట్ల  తనకున్న అవగాహనతో…  నాటి నెహ్రూ  ప్రభుత్వానికి  చెమటలు  పట్టించారు. వాజ్ పెయి  భవిష్యత్ లో  భారత ప్రధానమంత్రి  అవుతారని  నెహ్రూ  ఆనాడే ఊహించారు.  1962లో  అటల్ బిహారీ వాజ్ పేయి రాజ్యసభకు  ఎన్నికయ్యారు. 1968లో దీన్ దయాళ్  ఉపాధ్యాయ హత్యతో  జనసంఘ్ జాతీయ  అధ్యక్షుడయ్యారు  వాజ్ పేయి. నానాజీ  దేశ్ ముఖ్,  మల్రాజ్  మాధోక్,  లాల్ కృష్ణ  అద్వానీ  లాంటి వారి సాహచర్యంతో  జనసంఘ్ ను  దేశ రాజకీయాల్లో  ప్రముఖంగా తీర్చిదిద్దారు.

1975  జూన్ 25న…. నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ  పరిణామాల్లో వాజ్ పేయి  అరెస్ట్ అయ్యారు. లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ్  నేతృత్వంలో  ఎమర్జెన్సీ వ్యతిరేక  ఉద్యమం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం  బతకాలంటే ప్రతిపక్షాలు…  ఒక్కటి  కాక తప్పదని  గ్రహించారు  వాజ్ పెయి. జయప్రకాశ్  నారాయణ్  పిలుపుతో  ఏర్పడిన  జనతా పార్టీలో  జనసంఘ్ ను  విలీనం చేశారు.  1977  మార్చి 21న…. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత  జరిగిన  ఎన్నికల్లో  జనతా పార్టీ  ప్రభుత్వం  ఏర్పడి ….మొరార్జీ దేశాయ్  ప్రధానమంత్రి  అయ్యారు. మెరార్జీ   కేబినెట్ లో  వాజ్ పెయి  విదేశాంగ మంత్రి  అయ్యారు. 1977లోనే   ఐక్యరాజ్యసమితి  జనరల్ అసెంబ్లీ  మీటింగ్ లో  విదేశాంగ మంత్రి  హోదాలో  హిందీలో మాట్లాడారు.  అయితే  జనతా పార్టీ  ప్రభుత్వం ఎంతోకాలం  నిలువలేదు.

అద్వానీ,  బైరాన్ సింగ్  షెకావత్  లాంటివారితో  కలసి …. జనతా పార్టీ  శకలాల  నుంచి భారతీయ  జనతా  పార్టీని ఏర్పాటు  చేశారు వాజ్ పెయి.  BJP మొదటి  అధ్యక్షుడు  అయ్యారు. ఇందిరాగాంధీ హత్య  తర్వాత  1984లో  జరిగిన  ఎన్నికల్లో  దేశవ్యాప్తంగా  BJP రెండు  సీట్లలో  మాత్రమే గెలిచింది. ఆ తర్వాత.. కాంగ్రెస్ కు అన్ని రకాలుగా బీజేపీనే ప్రత్యామ్నాయం అనేంతగా  పార్టీని  తీర్చిదిద్దారు  వాజ్ పేయి.

లోక్ సభ  ఎంపీగా  పదిసార్లు  గెలిచారు వాజ్ పేయి. 1996 లోక్ సభ  ఎన్నికల్లో  బీజేపీ సింగిల్  లార్జెస్ట్  పార్టీగా  ఆవిర్భవించడంతో.. దేశ  10వ  ప్రధానమంత్రిగా  వాజ్  పెయి  ప్రమాణం చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గలేక.. 13రోజుల్లోనే ప్రభుత్వం పడిపోయిన సందర్బంలో.. వాజ్ పేయి చేసిన  ప్రసంగం  దేశంలో  ప్రతీ ఒక్కరిని  ఆలోచింపచేసింది.

1998 ఎన్నికల తర్వాత నేషనల్ డెమోక్రటిక్  అలయన్స్  ఏర్పాటు చేశారు  వాజ్ పేయి. ఆయన హయాంలోనే 1998  చివర్లో  పోఖ్రాన్ లో 5 అణుపరీక్షలు  నిర్వహించింది  భారత్. 1999  ఫిబ్రవరిలో  పాకిస్థాన్ తో  సంబంధాలు  మెరుగు  పరుచుకునేందుకు  లాహోర్ కు  బస్సు యాత్ర  చేపట్టారు. కశ్మీర్  సమస్య  పరిష్కారానికి  నాటి  పాకిస్థాన్  ప్రధానమంత్రి  నవాజ్ షరీఫ్ తో  కలసి లాహోర్  డిక్లరేషన్ పై  సంతకం చేశారు.  కార్గిల్  యుద్ధంలో  పాకిస్థాన్  చావుదెబ్బ తింది.

1999  అక్టోబర్  13న  మూడోసారి  ప్రధానమంత్రిగా  ప్రమాణం చేశారు  వాజ్ పెయి. పాలనలో  అనేక సంస్కరణలు  తెచ్చారు.  PV .నరసింహారావు  ప్రభుత్వం  చేపట్టిన  ఆర్థిక సంస్కరణలు  కొనసాగించారు.  దేశంలో రోడ్డు,  నేషనల్  హైవేల అభివృద్ధికి  కృషి చేశారు. ప్రధానమంత్రి  గ్రామ్ సడక్  యోజన  ద్వారా  ప్రతీ పల్లెకు  రోడ్డు సౌకర్యం  కల్పించారు.  పాకిస్థాన్ కు  సన్నిహిత  దేశంగా  ఉన్న అమెరికాను  భారత్ వైపు  తిప్పుకునేలా  చేశారు వాజ్ పేయి.  రష్యాతోనూ  మంచి సంబంధాలు  కొనసాగించారు. వాజ్ పెయి

2004 లోక్ సభ ఎన్నికలకు  ముందే  అనారోగ్యానికి  గురయ్యారు వాజ్ పేయి.  వయోభారం  ఇబ్బంది పెడుతుండడంతో  ఒక్కో బాధ్యతను  అద్వానీకి  బదలాయించారు వాజ్ పెయి. 2005 డిసెంబర్ లో  ముంబయిలోని  శివాజీ పార్క్ లో  జరిగిన  బీజేపీ  సిల్వర్ జూబ్లీ  ర్యాలీలో రాజకీయాలకు  రిటైర్మెంట్  ప్రకటించారు  వాజ్ పేయి.  అద్వానీ,  ప్రమోద్ మహాజన్ లు  పార్టీని నడుపుతారని  ప్రకటించారు. 2009లో  చెస్ట్ ఇన్ఫెక్షన్  కారణంగా  ఎయిమ్స్ లో  జాయినయ్యారు.  2015లో వాజ్ పేయికి  మోడీ ప్రభుత్వం  భారతరత్న అవార్డును ప్రకటించింది. నాటి రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ  స్వయంగా  వాజ్ పెయి  ఇంటికి  వెళ్లి  పురస్కారం ప్రదానం చేశారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy