అవినీతి సామ్రాట్.. రఘు ఇల్లంతా బంగారమే

ACB-ap-raghuఏపీలో ఓ భారీ అవినీతి అధికారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మరో మూడు రోజుల్లో రిటైర్డ్ అవుతుండగా.. అవినీతి నిరోధక అధికారులకు దొరికిపోయారు. మరో విశేషం ఏంటంటే.. ఆయన తన పదవీ విరమణ వేడుకలను సింగపూర్, హాంకాంగ్, మలేషియాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు, మిత్రులకు టికెట్లు బుక్ చేసుకున్నారు. అంతలోనే ఊహించని షాకిచ్చారు ఏసీబీ అధికారులు.

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి గొల్లవెంకట రఘు.. అతని బినామీ ఇళ్లపై దాడులు చేసిన ACB అధికారులు… కోట్ల విలువైన ఆస్తులతో పాటు కళ్లు చెదిరే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 23 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు.. మాసిన బట్టల మధ్య, వాషింగ్ మెషీన్ లో, మంచం బీరువాల కింద ఎక్కడ చూసినా పెద్దఎత్తున బంగారం పట్టుకున్నారు. వజ్రాలతో చేసిన 7వారాల నగలతోపాటు.. 8 కిలోల బంగారం, 10 కిలోల వెండి, 43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో ఈ స్థాయిలో బంగారం దొరకలేదంటున్నారు ఏసీబీ అధికారులు.

లక్ష్మీహారం, వడ్డాణాలు, బంగారు జడలు, ఎన్నో వెరైటీల్లో గాజులు, బంగారు దేవుళ్ల ప్రతిమలు, వజ్రాలు పొదిగిన హారాలు, నవరత్న హారం, పచ్చల హారం చూస్తుంటేనే కళ్లు జిగేల్  మంటున్నాయి. ఇవే కాదు.. ఓ జువెల్లరీ షాపులో కూడా లేనన్ని వెరైటీల్లో చెవి దిద్దులు, పసిడి పూజా సామాగ్రి. పదుల సంఖ్యలో చిన్న గొలుసులు. ఇవన్నీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆభరణాలు కావు… భద్రాద్రి సీతారాముడికి చేయించిన నగలు అంతకంటే కావు. ఇదంతా ఓ అవినీతి అధికారి సంపాదన.

బినామీ నల్లూరి వెంకట శివప్రసాద్  ఇంట్లో…

ఆంధ్రప్రదేశ్  టౌన్  అండ్  కంట్రీ ప్లానింగ్  డైరెక్టర్ గొల్ల వెంకట రఘు.. బినామీ అయిన నల్లూరి వెంకట శివప్రసాద్  అలియాస్  శివప్రసాద్. శివప్రసాద్‌ ఓ చిరుద్యోగి. నెల వేతనం రూ. 32 వేలు. ఆయన భార్య గాయత్రి రెండేళ్ల క్రితం వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. వారి ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలివి. కృష్ణా జిల్లా గన్నవరంలోని శివప్రసాద్  ఇంట్లో  వెతికిన కొద్దీ దొరికిన ఈ ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. గన్నవరంలోని వారి ఇంటి తలుపు తట్టిన ఏసీబీకి.. ఏకంగా జువెల్లరీ షోరూమే కళ్లపడింది. మాసిన బట్టలు వేసే వాషింగ్‌ మిషన్‌ తెరిస్తే బంగారం, వెండి బిస్కెట్లు! మంచం కింద సొరుగుల్లో వడ్డాణాలు, హారాలు, నెక్లెస్‌లు! బీరువా తెరిస్తే వజ్రఖచిత జడలు, ముత్యాల ఆభరణాలు!.. పూజగదిలో దేవుడి బంగారు ప్రతిమలు, ప్రమిదలు, ఇతరత్రా స్వర్ణ పూజా సామగ్రి! బాబాకు ప్రసాదం కోసం బంగారు కంచం, భోజనానికి వెండి పళ్లేలు, వెండి గ్లాసులు! అన్నీ కలిపి లెక్క కడితే.. బంగారం, వెండి, వజ్రాల నగలు, వస్తువుల విలువే రూ.100 కోట్లు తూగింది. స్థలాలు, ఫ్లాట్లు కలుపుకొంటే మరో రూ.50 కోట్లు! మొత్తం 23 చోట్ల జరిగిన సోదాల్లో రఘు దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను వెనకేసినట్లు ఏసీబీ గుర్తించింది.

23చోట్ల ఏక కాలంలో ఏసీబీ దాడులు

టౌన్ ప్లానింగ్  డైరెక్టర్  రఘుతో పాటు.. అతని బంధువుల ఇళ్లపై మొత్తం 23చోట్ల ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

.. విజయవాడలో ఐదు ప్రాంతాల్లో, విశాఖలోని మూడు చోట్ల ఏసీబీ సోదాలు

.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, నెల్లూరు, తిరుపతిలతో పాటు.. షిరిడీలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు

ఇల్లంతా బంగారమే..

శివప్రసాద్  ఆఫీసు, బంధువుల ఇళ్లు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఎటాక్  చేశారు ఏసీబీ అధికారులు. మాసిన బట్టల మధ్య, వాషింగ్ మెషీన్ లో, మంచం బీరువాల కింద ఎక్కడ చూసినా పెద్దఎత్తున బంగారం దొరికింది. వజ్రాలతో చేసిన 7వారాల నగలతోపాటు.. 8 కిలోల బంగారం, 10 కిలోల వెండి, 43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో ఈ స్థాయిలో బంగారం దొరకలేదంటున్నారు ఏసీబీ అధికారులు.

 వెంకటసుబ్బారావు పేరుతో రియల్ ఎస్టేట్

వెంకట రఘు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వెంకటసుబ్బారావు అనే పేరుతో రియల్  ఎస్టేట్  వెంచర్ కూడా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. గన్నవరం రాఫిన్  కాలనీలో 8 ఫ్లాట్లు, 2 ఎకరాల్లో కల్యాణ మండపం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. గొల్లవెంకట రఘు పేరిట నాలుగు కోట్ల 60 లక్షల విలువచేసే ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 40 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

పలు చోట్ల స్థలాలు ఉన్న డాక్యుమెంట్లు

.. గన్నవరం మండలం బొమ్ములూరులో 1033 చదరపు అడుగుల భూమి

.. మంగళగిరి దగ్గర 220 గజాల స్థలం

.. రఘు భార్య పేరిట గన్నవరంలో 1033 గజాల స్థలం

.. కృష్ణా జిల్లా వేల్పూర్ లో 2.6 ఎకరాల పొలం

.. కూతురు పేరిట చిత్తూరు జిల్లాలో 428 గజాల స్థలం

.. రఘు అక్క పేరుతో విశాఖలో 167 గజాల ఇంటి స్థలం డాక్యుమెంట్లు

11 ఎకరాల మామిడితోట

.. శివప్రసాద్ కుటుంబ సభ్యుల పేరుతో గన్నవరంలో 11 ఎకరాల మామిడితోట

.. విజయవాడలో రెండు డుప్లెక్స్  ఇళ్లు, హైదరాబాద్  మాదాపూర్ లో ఓ ప్లాటు

.. తూ.గో జిల్లా రాజానగరంలోని రావుఫిన్  వెంచర్ లో 8 ప్లాట్లు

.. 70 బ్యాంకులకు చెందిన పాస్ పుస్తకాలు

.. విశాఖ ఆర్కేబీచ్ రోడ్డులో ఎన్.వి. రఘ భార్య పేరిట క్లోవ్ మెజిస్టిక్ ఆపార్ట్మెంట్ లో 80.26 లక్షల విలువ చేసే ఫ్లాట్ డాక్యుమెంట్లు

.. స్నేహితుడైన ప్రయివేట్ సర్వేయర్ గోవిందరాజులు కార్యాలయంలో 2.5 లక్షల నగదు, 3 హార్డ్ డిస్క్ లు, 2 ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.

దొరికిన పత్రాలపై దర్యాప్తు

దొరికిన పత్రాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు డీజీ. వారికున్న లింకులపై విచారణ చేస్తున్నామన్నారు. రఘు నెల జీతం లక్ష రూపాయలు, శివప్రసాద్ జీతం 30 వేలని.. అయినా కోట్ల ఆస్తులు బయటపడ్డాయని చెప్పారు. ఇంకా బ్యాంకు లాకర్లు గురించి ఎటువంటి సమాచారం లేదని.. లాకర్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నామని చెప్పారు. దొరికిన వందల కోట్ల ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామన్నారు డీజీ.

షిరిడీలో ఒక డ్లూప్లెక్స్, లాడ్జ్

షిరిడీలో ఒక డ్లూప్లెక్స్  హౌస్ తోపాటు.. సాయి సూరజ్  కుంజ్  లాడ్జ్  ఉందని డాక్యుమెంట్ల ద్వారా గుర్తించారు.  ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కదారి పట్టించాడు రఘు. వచ్చిన వేతనంతో సరిపెట్టుకోకుండా.. ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డాడు. తన చేతికి మట్టి అంటకుండా బినామీలను వాడుకున్నాడు. కానీ.. అతని పాపం పండింది. వారం రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన వెంకట రఘు బండారం బట్టబయలైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy