అవిభక్త కవలలకు తొలిదశ ఆపరేషన్ సక్సెస్

odisha-twinsరెండోదశ చికిత్సకు అమెరికా నిపుణుడు

అవిభక్త కవలలను విడదీసే అరుదైన ఆపరేషన్ తొలిదశను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన వైద్యబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాకు చెందిన రెండేండ్ల వయసున్న తలవద్ద కలిసి పుట్టిన కవలలను విడదీసేందుకు మొదటిమెట్టుగా భావించే శస్త్రచికిత్సను సుమారు 20 గంటల పాటు అవిశ్రాంతంగా జరిపారు. తల నుంచి గుండెకు రక్తాన్ని తిరిగి చేరవేసే కీలకమైన రక్తనాళాలను విడదీసే బైపాస్ శస్త్రచికిత్స అనుకున్నట్టుగా జరుగడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన శస్త్రచికిత్స మంగళవారం ఉదయం ఐదు గంటలకు పూర్తయింది. చిన్నారుల తలలను పాక్షికంగా మాత్రమే విడదీశారు. పూర్తిగా విడదీసేందుకు మరో విడుత శస్త్రచికిత్స అక్టోబర్‌లోగానీ, నవంబర్‌లోగానీ జరుగుతుందని చెప్పారు వైద్యులు. ఒడిశాలోని కాంధమాల్ జిల్లాలో జగన్నాథ్, బలరాం అనే పేర్లున్న కవలలు తలభాగం కలిసి ఉండే అరుదైన స్థితిలో జన్మించారు. దీనిని వైద్య పరిభాషలో క్రేనియోపాగస్ అంటారు. వీరిని విడదీసేందుకు 20 మంది వైద్య నిపుణుల బృందం ఏర్పాటైంది. ఎయిమ్స్ వైద్యబృందానికి అదనంగా జపాన్ శస్త్రచికిత్స నిపుణుడిని కూడా రప్పించారు. మెదడులో కలిసి ఉన్న రక్తనాళాలను విడదీయడం సాధ్యమేనా? అనేది నిర్ధారించుకునేందుకు పలుదఫాలుగా ఎమ్మారైలు, సీటీస్కాన్‌లు, యాంజియోగ్రామ్‌లు, ఇతర పరీక్షలు నిర్వహించారు. గతనెల 13న అవిభక్త కవలలను ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారు బాగానే కోలుకుంటున్నారని, రెండోదశ శస్త్ర చికిత్స నిమిత్తం అమెరికా నుంచి వైద్యనిఫుణుడిని పిలిపిస్తామని ఒడిశా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి పీకే జనా మీడియాకు చెప్పారు.

పిల్లలకోసం ఒడిశా సీఎం ప్రార్థన

జగ-బాలయ్య అని ముద్దుగా పిల్చుకునే ఆ పిల్లల ఆరోగ్యానికి ఒడిశా ప్రజలతోపాటు నేనూ దేవుణ్ని ప్రార్థిస్తున్నా.. జై జగన్నాథ్ అని సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్‌లో సోమవారం పేర్కొన్నారు. వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు ఆయన. పిల్లలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అవిభక్త కవలల తల్లిదండ్రులు పుష్పాంజలి, భూయా కన్హారా చెప్పారు. 30లక్షల మందిలో ఒకరు ఇలా జన్మిస్తారని, అయితే శస్త్రచికిత్సల్లో 20శాతం మాత్రమే విజయవంతం అవుతాయని న్యూరోసర్జన్ దీపక్ గుప్తా వివరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy