అసెంబ్లీ సెంటర్.. సింగిల్ హాండ్… నాగం!

naga

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి నిన్న ఒంటి చేత్తో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పీచ్ ను అడ్డుకుని అసెంబ్లీని స్తంభింప చేశారు. విజువల్స్ లో ఆయనను చూపించ లేదు కాని… ఒకవేళ చూపిస్తే నాగంది పిల్ల చేష్ట అనిపించేదేమో. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలాగా సీఎం కు అడుగడుగునా అడ్డుతగిలారు నాగం.

అసలు ఏం జరిగిందంటే…

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన స్పీచ్ లో భాగంగా…. కృష్ణానదిపై ప్రాజెక్టులు, నిళ్ల కేటాయింపుల గురించి చెబుతూ సమైక్య రాష్ట్రంలోనే సస్యశ్యామలం సాధ్యమైందన్నారు. ఇంకేముంది నాగం లేచి తనకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. అయనా అవకాశం రాలేదు. సీఎం స్పీచ్ కొనసాగుతూనే ఉంది. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే, తనకు అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వాలని వెల్ లోకి వచ్చి నాగం స్పీకర్ ను కోరారు. స్పీకర్ పట్టించుకోలేదు… పోడియం దగ్గరకు వెళ్లి నాగం లొల్లి చేశారు. ఆయనకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఇద్దరూ కలిసి కాస్సేపు స్పీకర్ పోడియం పక్కనే ఉన్న మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు.  అయినా స్పీకర్ స్పందించలేదు. చివరికి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు. అయినా నాగం జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. వెల్ లో నిలబడి అరుస్తూనే ఉన్నారు. సీఎం వైపు వేలు చూపిస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. చివరికి ఆయనకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వెల్ లోకి వెళ్లారు. వీళ్లద్దరిని చూసి మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నం మళ్లీ వెల్ లోకి వెళ్లారు. ఆ తర్వాత మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లకు జతకలిశారు. అందరూ వెల్ లోకి వెళ్లి సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారు, వాటిని సరి చేసేందుకు తమ పక్ష నేతలకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సీఎం స్పీచ్ ముగిసేవరకు మైక్ ఇచ్చేది లేదని స్పీకర్ తేల్చిచెప్పారు. ఆయినా టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు  వెనక్కి తగ్గలేదు. ఇంకేముంది… చేసేదేమి లేక స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

అంతకు ముందు సీఎం కిరణ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును చేతులు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇస్తే… నాగం జనార్ధన్ రెడ్డి సీఎం ప్రసంగానికి అడ్డుతగిలి వాయిదా వేయించారని సభలో చిట్ చాట్ జరిగింది. కాని సీమాంధ్ర సభ్యులు మాత్రం నాగంవి పిల్ల చేష్టలు అన్నారు. ఎవరేమంటేనేం తాను మాత్రం అబద్ధాలు చెబుతున్న సీఎం నోరు మూయించానంటున్నారు నాగం…

from Assembly Gallery,

Sangappa Jenawade

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy