ఆదివాసీల ఆగ్రహం.. ఉట్నూరులో రిజర్వేషన్ల వివాదం

Utnoorరాష్ట్రంలో ఆదివాసీల ఆందోళన రోజురోజుకూ ఉధృతమౌతోంది. ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య మొదలైన రిజర్వేషన్ల వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. దాడులు, పోటాపోటీ సభలతో ఆందోళన వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి రెచ్చిపోయారు. పరస్పర దాడులతో ఏజెన్సీ భగ్గుమంది.

ఆదివాసీలు, లంబాడీల మధ్య చెలరేగిన రిజర్వేషన్ల వివాదం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రస్థాయికి చేరుకుంది. ఉట్నూరు మండలంలో గోండులు, లంబాడీల మధ్య ఘర్షణ జరిగింది. రెండువర్గాల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉట్నూర్ ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్ గూడలో.. కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయటం వివాదానికి కారణమైంది. కారకులపై చర్యలు తీసుకోవాలంటూ.. ఉట్టూర్, హస్నాపూర్ లో గోండులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో లంబాడీలు అక్కడికి రావటంతో ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు.

ఆందోళనకారులు షాపులను మూయిస్తూ నిరసనకు దిగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల దాడుల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి. హుస్నాపూర్ లో వైన్ షాప్ కు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  రెండు వర్గాల గొడవలు రాత్రికి మారుమూల గ్రామాలు, తండాలకు పాకాయి. సిర్పూర్ లో లంబాడీలకు చెందిన రామారావు మహరాజ్ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఏజెన్సీలో మూడురోజులపాటు 144 సెక్షన్ పెట్టారు పోలీసులు. గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు అదనపు బలగాలను పంపామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ముగ్గురు ఐజీ స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని.. సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దని చెప్పారు.

పరిస్థితిని ఆదిలాబాద్, మంచిర్యాల కలెక్టర్లు సమీక్షించారు. ప్రచారం జరుగుతున్నట్లుగా గొడవల్లో ఎవరూ చనిపోలేదని.. వేరే యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారని చెప్పారు ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు. రాళ్లదాడిలో ఇద్దరు పౌరులకు, పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయటానికి నిరసనగా… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy