ఆధునిక భగీరథుడు

hanumanthaప్రపంచంలో నీటి యుద్ధాల్లేని ప్రాంతాలున్నాయా ? హైలీ ఇంపాజిబుల్. అసాధ్యం. నీటి కోసం జరుగుతున్న యుద్ధాల గురించి చూస్తూనే ఉన్నాం. ఆధునిక మానవుడి నీటిదాహం గురించి తెలిసిందే కదా. కరువుకాటకాల మధ్య చుక్కనీటి కోసం నదులపై భారీ ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. లక్షల ఎకరాలకు సాగునీరందించాలంటే వేల కోట్లు ఖర్చుపెట్టాల్సిందే అన్న ముద్రపడిపోయింది. కానీ ప్రస్తుత నీటి అవసరాలకు వాటర్ షెడ్స్ అల్టిమేట్ సొల్యుషన్ అని చెప్పిన వ్యక్తి ఆయన. ఆధునిక సమాజానికి నీటికొరత తీర్చే ఫార్ములాను కనిపెట్టిన వ్యక్తి టి. హనుమంతరావు. ఆయనిక లేరు. హనుమంతరావు సేవలను గుర్తుచేస్తూ V6 ప్రత్యేక కథనం..

నీటిని ఒడిసిపట్టేందుకు ప్రాజెక్టులు కట్టేవాళ్లు భగీరుథులైతే… ఆయన అపర భగీరథుడు. వాననీటిని పెద్దగా ఖర్చులేకుండా భూగర్భంలోకి పంపి.. పాతాళ గంగను మళ్లీ పైకి తీసుకొచ్చే కిటుకును సింపుల్ గా చెప్పిన ఆధునిక భగీరథుడు. ఆయనే హనుమంతరావు. ప్రాజెక్టుల అంచనాలు వందల కోట్ల దాటి వేలకోట్లకు చేరిన టైంలో… ఎకరాకు 5 వేల ఖర్చుతో సస్యశ్యామలం చెయ్యొచ్చని చెప్పిన మేధావి హనుమంతరావు.

ప్రముఖ రిటైర్డ్ ఇంజినీర్ హనుమంతరావు కన్నమూశారు. బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్ గా సేవలందించారు. రిటైర్ అయ్యాక… ప్రపంచబ్యాంక్ కి నీటిపారుదల సలహాదారుగా పనిచేశారు హనుమంతరావు.

వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నీటి పారుదల రంగంలో ఆయన అనేక సేవలు చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో 1988లో సాగునీటి శాఖ ENCగా బాధ్యతలు నిర్వర్తించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలొచ్చేలా.. చతుర్విధ జల ప్రక్రియను అభివృద్ధి చేశారు. చతుర్విధ జల ప్రక్రియను తన మానస పుత్రికగా భావించేవారు.

2000-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జల సంరక్షణ మిషన్ సాంకేతిక కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు హనుమంత రావు. వాటర్ షెడ్ లో చతుర్విధ జలప్రక్రిను వివిధ ప్రాంతాల్లో అమలు చేసి విజయవంతం చేశారు.
హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో పుట్టినా… నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారాయన. అందుకే తెలంగాణ సమాజానికి ఆయనంటే గౌరవం, గుర్తింపు. రాజకీయాలతో సంబంధం లేకుండా.. పార్టీలకు అంటకాగకుండా తన వాదనలు వినిపించేవారాయన.

ఆంధ్రప్రదేశ్ కు చెందినా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ… ఎన్నో స్పీచ్ లిచ్చారు హనుమంతరావు. పోలవరం డిజైన్ మార్చాలంటూనే… దానికి బదులు ఐదు చిన్న చిన్న బ్యారేజీలు కడితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయని.. ఖర్చు తగ్గుతుందని సూచించారు. నీళ్లు వృథా కాకుండా గోదావరిపై బ్యారేజీలు నిర్మించాలని సూచించారు.

ఇక కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలోనూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు హనుమంతరావు. దీంతో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు… హనుమంతరావు సూచనలు తీసుకున్నారు.

తన సేవలకు గుర్తుగా జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు హనుమంతరావు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విశిష్ట సేవాపత్రం అందుకున్నారు. 1987లో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును అందుకున్నారు. జలవనరుల్లో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసినందుకు 1989లో కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్, పవర్ అవార్డులతో సత్కరించింది. పదవి నుంచి రిటైర్డ్ అయ్యాక… ఐక్యరాజ్యసమితితో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. కొన్ని ఆఫ్రికా దేశాల దుర్భిక్ష్యానికి తన విలువైన సూచనలు, సలహాలిచ్చారు.

హన్మంతరావు ఫార్ములా.. వాటర్ షెడ్

తడారే గొంతులు. బీడువారిన భూములు. బిందుడె నీళ్ల కోసం మైళ్ల దూరం నడక. రెండుమూడేళ్లకోసారి పలకరించే కరువు. సాగునీటి సంగతి దేవుడెరుగు. తాగునీటి కోసం… గొంతులు తడుపుకునేందుకే రైళ్లలో నీటి సరఫరాను చూసిన దేశం మనది. ఇక సాగుభూములకు నీళ్లు సప్లై చేయాలంటే ? నదుల్నే ఎత్తిపోయాలేమో ? అందుకే ఖర్చు ఎక్కువైనా.. నీటిని ఒడిసిపట్టుకునేందుకు.. భారీ ప్రాజెక్టులు కడుతున్నాయి ప్రభుత్వాలు. పదివేల ఎకరాలకు మించి నీరివ్వాలంటే భారీ ప్రాజెక్టులే ఆప్షన్ అన్న ముద్రపడిపోయింది. కానీ అది ఔట్ డేటెడ్ టెక్నాలజీ అని చెప్పి… చతుర్విధ జల ప్రక్రియను తెరపైకి తెచ్చారు హనుమంతరావు. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉన్న రాష్ట్రానికి హనుమంతరావు సూచించిన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తేనే పొలాలకు నీరందించడం సాధ్యమా ? తక్కువ ఖర్చుతో రైతులకు మూడు పంటలకు నీరివ్వడం సాధ్యం కాదా ? మండువేసవిలో సైతం భూగర్బజలాలు అడుగంటకూడదంటే ఏం చెయ్యాలి ? ప్రతి వాన నీటిబొట్టును ఒడిసిపట్టే మార్గం లేదా ? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక్క సమాధానం వాటర్ షెడ్ పథకం. దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి టి.హనుమంతరావు.

నీటిపారుదల రంగ నిపుణులు పరిభాష ప్రకారం 2 వేల ఎకరాల లోపు భూములకు నీరందిస్తే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగా, 2 వేల నుంచి 10 వేల ఎకరాల వరకు నీరందించే ప్రాజెక్టులను మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులుగా వ్యవహరిస్తారు. 10 వేల ఎకరాలకు పైగా సాగు నీరిచ్చే ప్రాజెక్టులను భారీ నీటి పారుదల ప్రాజెక్టులంటారు.  నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాదు… వాటికి ఎన్నో ఇబ్బందులున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో ఎక్కడో ఓ చోట ముంపు ప్రాంతం ఉండక తప్పదు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఇబ్బందులు ఒక కోణమైతే…. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవుతున్న ఖర్చు, కన్ స్ట్రక్షన్ కు, ఎత్తిపోతలకైతే విద్యుత్ ఖర్చు అన్నీ కలిపి తడిసిమోపవడం చూస్తూనే ఉన్నాం.  తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి లో ఉండడంతో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి మరింత ఎక్కువ ఖర్చు అవుతోంది. మైదాన ప్రాంతాల్లో అయితే గ్రావిటీ ద్వారా నీటిని అందివ్వచ్చు. కానీ తెలంగాణలో చాలా వరకు భూబాగం సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంది. అందుకే  మన రాష్ట్రంలో ఎక్కువగా ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరందించడానికి అవకాశం ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల ప్రాజెక్టుల ఖర్చు విపరీతంగా పెరగడమే కాదు, నీటిని లిఫ్ట్ చేయడానికి చాలా ఎక్కువగా పవర్ ఖర్చవుతుంది.

ప్రాణహిత – చేవెళ్ల, కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసారు. ఈ ప్రాజెక్టులలో ఒక్క హెక్టారు ఆయకట్టుకు నీరందించాలంటే దాదాపు 10 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. పాలమూరు ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టు నిర్మించి సగటున ఒక్క హెక్టారుకు నీరందించాలంటే అయ్యే ఖర్చు 5 లక్షలని అంచనా.

కానీ వాటర్ షెడ్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే కేవలం ఎకరానికి 5 వేల రూపాయల ఖర్చుతో మూడు పంటలకు నీరందించవచ్చని సూచించారు హనుమంతరావు. పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఒక పంటకు మాత్రమే నీరందించవచ్చని, అదే వాటర్ షెడ్ పథకాల ద్వారా అయితే మూడు పంటలకు సమృద్ధిగా సాగు నీరివ్వవచ్చని సూచించారు.

వాటర్ షెడ్ పథకాలను చేపట్టడమే తెలంగాణ ముందున్న మంచి ఆప్షన్ అని గతంలోనే సూచించారు హన్మంతరావు. తెలంగాణలో భారీ, మద్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కంటే బోరు బావుల ద్వారానే ఎక్కువ ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అర్థ గణాంక శాఖ లెక్కల ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి భారీ, మద్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగు అవుతున్న భూమి 2.92 లక్షల హెక్టార్లు. పంపుసెట్ల ద్వారా సాగు అవుతున్న విస్తీర్ణం ఏకంగా 17 లక్షల హెక్టార్లు. సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా చేస్తున్న సాగు కంటే దాదాపు 6 రేట్లు ఎక్కువగా వ్యవసాయ పంపుసెట్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారని లెక్కల చెప్తున్నాయి.
అందుకే తెలంగాణకు వాటర్ షెడ్ పథకం బెస్ట్ ఆప్షన్ అని సూచించారు హనుమంతరావు. ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేయడమే వాటర్ షెడ్ పథకాల లక్ష్యం. ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన ఉద్దేశం.

1960 నుంచే కేంద్ర ప్రభుత్వం “డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్ మెంట్ వర్క్స్” పేరుతో వాటర్ షెడ్ కార్యక్రమాల అమలు చేస్తున్నా.. వాటి అమలు అంతంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2001-04 మధ్య హనుమంతరావు సూచనతో అప్పటి సీఎం చంద్రబాబు వాటర్ షెడ్ పథకాల అమలుపై కొంత ఆసక్తి చూపించారు. నీరు-మీరు పథకం కింద మెదక్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాలు శాశ్వంతంగా కరువును జయించాయి. మెదక్ జిల్లాలో గొట్టివారి పల్లి వాటర్ షెడ్ తో జలసిరులు పొంగాయి. ఈ పదేళ్ల కాలంలో ఆ ఊరికి కరువన్నదే తెలీదంటే వాటర్ షెడ్ పథకం ఎంతలా సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

వైఎస్ హయాంలో జలవనరులపై ప్రాధాన్యాలు మారాయి. వాటర్ షెడ్ పథకాలకు బదులు  భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపైనే కాన్సన్ ట్రేట్ చేసాయి. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం వరకు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై ఖర్చు చేసినా..  ఇప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు.

ఇసుక నేలల్లో … పచ్చని పంటలు

ఎడారిలో జలసిరులు పొంగుతున్నాయి. కరువు నేల కలకళలాడుతోంది. బీడుభూములు సస్యశ్యామలమయ్యాయి. నమ్మడం లేదా ? అయితే రాజస్థాన్ వెళ్లాల్సిందే. హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియను అమలు చేసి వసుంధర సర్కారు అద్భుతాలే చేస్తోంది. మూడేళ్ల క్రితం మొదలైన ఫోర్ వాటర్ కాన్సెప్ట్ తో రాజస్థాన్ లో వేలాది గ్రామాలు సస్యశ్యామలమయ్యాయి. 

వాటర్ షెడ్ పథకాలపై హన్మంతరావు కనిపెట్టిన ఫార్ములాను చతుర్విద జల ప్రక్రియగా.. హన్మంతరావు ఫార్ములాగా వ్యవహరిస్తుంటారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో దీనిని పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. వాటర్ షెడ్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నాలుగు ముఖ్య ఫలితాలు కనబడుతాయి… కాబట్టి దీనికి చతుర్విద జల ప్రక్రియగా పేరు పెట్టారు.

వాటర్ షెడ్ పథకాల అమలుతో కనిపించే నాలుగు లక్ష్యాల్లో ఒకటి వాగుల ప్రవాహానికి అనుగుణంగా వాటర్ షెడ్స్ నిర్మించడం. వాగుల ప్రవాహం వర్షాలు నిలిచిపోయిన తర్వాత కూడా ఉంటుంది. నీటి ప్రవాహం వర్షాకాలంతో పాటు ఫిబ్రవరి దాకా ఉంటుంది. అందుకే వాగులపై చిన్న చిన్న వాటర్ షెడ్స్ కట్టి నీళ్లు మళ్లించుకునే వీలుంటుంది. వాటర్ షెడ్స్ ద్వారా భూగర్భ జల వనరులు బాగా పెంచడం రెండో లక్ష్యం. వాటర్ షెడ్స్ ఉన్న గ్రామాల్లో దుర్బిక్షంలోనూ ఎండాకాలంలోనూ తాగునీటికి ఇబ్బంది లేకుండా.. పశుగ్రాసానికి కొదవలేకుండా, పండ్ల తోటలకు వాడుకునేలా చేయడం మూడో లక్ష్యం.

ఇక వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం బురద లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అడవుల్లో వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షం కురిసినప్పుడు నేల కోతకు గురై నీటి ప్రవాహంలో బురద ఉంటోంది. నేలకోతకు గురవడం వల్ల టాప్ సాయిల్ లో ఉండే పోషకాలు కొట్టుకుపోతున్నాయి. నిజానికి ఆ పోషకాలు సహజ ఎరువులుగా పనిచేస్తాయి. ఈ పోషకాలు కొట్టుకుపోవడం వల్ల కృత్రిమ ఎరువుల వాడకం ఎక్కువైంది. కొట్టుకుపోయిన టాప్ సాయిల్ మళ్లీ తయారు కావాలంటే వెయ్యేళ్లు పడుతుందని అంచనా. కానీ వాటర్ షెడ్స్ ద్వారా కొన్నేళ్లలోనే టాప్ సాయిల్ ని తయారుచేయడం నాలుగో లక్ష్యం.

హనుమంతరావు ప్రతిపాదించిన చతుర్విద జల ప్రక్రియను… రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా విజయవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జలస్వావలంబన్ అభియాన్ MJSA పేరుతో చేపట్టిన కార్యక్రమంతో రాజస్థాన్ లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు థార్ ఎడారిలో భాగంగా ఉన్న 5 వేల గ్రామాల్లో ఇపుడు జలసిరులు కురుస్తున్నాయి. దక్షిణ, తూర్పు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్, ఝలావర్ లాంటి ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలను రెండేళ్ల క్రితం ప్రారంభించింది వసుంధర సర్కారు.

రాజస్థాన్ లో రెండేళ్లలోనే గ్రౌండ్ వాటర్ లెవల్ బాగా పెరగడం హైలైట్. నిజానికి మూడేళ్ల క్రితం సింధియా సర్కారుకు ఫోర్ వాటర్ కాన్సెప్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు హనుమంతరావు. దాన్ని రాజస్థాన్ జల సంఘం సలహాదారు శ్రీరామ్ వెదిరే అధ్వర్యంలో చిత్తశుద్ధితో అమలు చేశారు. దాంతో ఫలితాలొచ్చాయి. 500 ఎకరాలకు 9 వాటర్ షెడ్స్ చొప్పున తక్కువ ఖర్చుతో… ఆధునిక పద్ధతుల్లో నిర్మించారు. రాజస్థాన్ లో 42 వేలకు పైగా గ్రామాలున్నాయి. ఇప్పటికే 5 వేల గ్రామాలకుపైగా ఫలితాలొచ్చాయి. ఇదే జోష్ తో 2019 నాటికి 22 వేల గ్రామాల్లో వాటర్ షెడ్ స్కీమ్స్ ని అమలు చేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది వసుంధర సర్కారు.

రాజస్థాన్ తో తెలంగాణకు పోలిక ఉంది. వాతావరణం నుంచి భూ స్వరూపం దాకా ఎన్నో పోలికలున్నాయని.. అక్కడ సక్సెస్ అయిన ఫార్ములాను రాష్ట్రంలో అమలు చేస్తే ఫలితాలొస్తాయని చాలారోజుల క్రితమే సలహా ఇచ్చారు హనుమంతరావు. కానీ దీనిపై ఇంకా ముందడుగు పడలేదు.

వాటర్ షెడ్ నిర్మాణాన్ని పూర్తిగా మట్టి సిమెంట్ తో చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ నిధులతో గ్రామస్థుల భాగస్వామ్యంతో చాలా ఈజీగా నిర్మించొచ్చని సూచించారు.

హనుమంత రావు సూచనలు దుర్భిక్ష్యానికి మారుపేరైన ఆఫ్రికన్ కంట్రీస్ లోనూ అమలవుతున్నాయి. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలూ అమలు చేస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం ముందడుగు వేయకపోవడం విచిత్రం.

ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు ఖర్చుచేయడమంటే.. మబ్బులను చూసి ముంత ఒలకబోసుకోవడమే అన్నది నీటిరంగ నిపుణుల మాట. వలసల నిరోధానికి.. రైతాంగం బాగు కోసం.. గ్రామ స్వరాజ్యం కోసం. ఆశయం ఏదైనా సరే… హనుమంతరావు సూచనలు, సలహాలు అమలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలొస్తాయంటున్నారు నిపుణులు. ఏమైనా హనుమంత రావు ప్రతిపాదించిన ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ఆచరణీయం, ఆమోదయోగ్యం. ఆధునిక ప్రపంచానికి విలువైన సూచనలిచ్చిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది వీసిక్స్.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy