ఆపరేషన్ బ్లూస్టార్ కు 30 ఏళ్లు పూర్తి..


operation-blue-star-golden-temple840612_2a m_id_117263_indira_gandhiఆపరేషన్ బ్లూస్టార్ కు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1984లో సిక్కు అల్లర్లను అదుపు చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్య రాజకీయాల్లోనే మాయని మచ్చగా మిగిలి పోయింది. స్వర్ణ దేవాలయంపై జరిగిన ఈ దాడిలో దాదాపు 400 మంది మృతి చెందారు. ఎంతో మంది అమాయకులు గాయపడ్డారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఇంత మందిని బలితీసుకోవాలా అంటూ అప్పట్లో రాజకీయ దుమారమే రేగింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడమే ఆపరేషన్ బ్లూస్టార్ కు దారి తీసింది. స్వర్ణ దేవాలయంలో మారణాయుధాలతో మాటు వేసిన జర్నైల్ సింగ్ గ్యాంగ్ ను చెదరగొట్టేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ఆపరేషన్ కు ఆదేశించారు. ప్రధాని అనుమతితో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. స్వర్ణ దేవాలయాన్ని చుట్టు ముట్టి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జర్నైల్ సింగ్ తో పాటు ఎంతోమంది మృతి చెందారు.

1970 వ దశాబ్దంలో మొదలైన ఖలిస్తాన్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. 1984 కు వచ్చే సరికి మిలిటెంట్ తరహా ఉద్యమాలకు దారి తీసింది. వీటిని అణచేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల స్వర్ణ మందిరం దెబ్బ తినడమే కాకుండా చాలా మంది అసువులు బాసారు. దీని పర్యావసానంగానే అదే ఏడాది ప్రధాని ఇందిరా గాంధీ సిక్కులైన అంగరక్షకుల చేతిలో హత్యకు గురికావడం జరిగింది. దీంతో సిక్కులపై మరిన్ని దాడులు జరిగాయి. ప్రధానంగా దిల్లీలో జరిగిన ఈ 1984 దాడుల్లో దాదాపు 3 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ తర్వాత 90వ దశకంనుండి ఖలిస్తాన్ డిమాండ్ మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ప్రతీ యానివర్సరీ రోజు మాత్రం ఈ డిమాండ్ మళ్ళీ తెరపైకి వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ డిమాండ్ పంజాబ్ లో కన్నా కెనడా, యుఎస్ లలో వలస జీవితం గడుపుతున్న సిక్కు లద్వారా వినిపిస్తూనే ఉంది. అక్కడున్న సిక్కులు పంజాబ్ తో రహస్య సంబంధాలు పెంచుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. మొత్తం మీద సిక్కు ప్రత్యేక ఖలిస్తాన్ రాష్ట్ర డిమాండ్ తగ్గినా.. ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట జరిగిన విధ్వంసం ప్రతి సిఖ్ఖు మదిలోనూ, దేశ చరిత్రలో కూడా మెదులుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఎంతో మంది అమాయకులు బలి కావడం చర్చనీయాంశమైంది. భారత చరిత్రలో మాయని మచ్చగా మారిన ఈ ఉదంతాన్ని చూసి నేర్చుకోవాల్సిన పాఠం.. తొందర పాటు చర్యలకు పాల్పడకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy