ఆయనో గాన గంధర్వుడు..!!

spb-musical-journeyఆయన గానం అమృతం. సుస్వరాల సామ్రాజ్యానికి సామ్రాటాయన. ఆయన పలుకు భాషకు పట్టాభిషేకం. వందల సినిమాలు, వేల పాటలు. రికార్డులకు, అవార్డులు ఆయన కేరాఫ్ అడ్రస్. ఆయనే శ్రీపతి పండిరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. భారతీయ సినీ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలు బర్త్ డే ఇవాళ…

నవరసాలూరంచే గాత్రం, తేనెలూరో పాట. కోయిల కూడా చెవులు రిక్కించే వినేలా పాడడం ఆయన స్పెషాలిటీ. 50 ఏళ్లుగా ఆయన స్వరం పాడుతూనే ఉంది. సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. బాలు పాట అమృతం కన్నా తీయగా ఉంటుంది. అతని పలుకులు భాషకు పట్టాభిషేకం చేస్తాయి. ఎంతోమంది సంగీత దర్శకులకు ఆయన పాట ప్రయోగశాల. బాలు పాడితే ఎన్నో సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. అలసు బాలూ పాటే ఓ రికార్డు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన సింగర్ గా ఆయన గిన్నిస్ రికార్డులకెక్కారు. తరాలు మారినా, స్వరాలు మారినా తెలుగు వారికి బాలు పాట నిత్యనూతనమే. అమరగాయకుడు ఘంటసాల మాస్టారు తర్వాత ఎవరు పాడతారన్నా ప్రశ్నకు బాలు సమాధానంగా దొరికాడు. ఘంటసాల తర్వాత తెలుగు సినిమా సంగీతాన్ని దశాబ్దాల పాటు శాసించారు బాలు. కళకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కళాతపస్వి కె. విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాల్లో బాలు స్వరం ఉండితీరుతుంది.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో చిన్న చిన్న హీరోలకు పాడిన బాలు …. అతి కొద్ది కాలంలోనే అగ్రహీరోలందరికీ స్వరాలు అందించారు. ఎన్టీఆర్, ANR, శోభన్ బాబు, చిరంజీవి, అల్లు రామలింగయ్య ఇలా నటుడెవరైనా సినిమా ఏదైనా అందులో బాలు పాట ఉండి తీరాల్సిందే. 1946 జూన్ 4 న పుట్టిన బాలు మర్యాద రామన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విరహాన్ని అద్భుతంగా పలికిస్తాడు. వయ్యారాలను గొంతులో ఒలికిస్తాడు. ఏ హీరోకి తగినట్టుగా వాయిస్ చేంజ్ చేసి గమ్మత్తుగా పాడడం ఆయనకే సాటి. ప్రతీ సంగీత దర్శకుడు తమ సినిమాలో బాలు పాటలు పాడించుకోవాలనుకుంటాడు. ప్రతీ నటుడు తమకు బాలు గాత్రమే కావాలంటారు. సంగీతానికి, సాహిత్యానికి, సన్నివేశానికి న్యాయం చేయగల దిట్ట బాలు. ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాది భాషలన్నింటిలో ఆయన ఎన్నో వేల పాటలు పాడారు. సినిమా సంగీతానికి ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న బాలు మొత్తం 11 భాషల్లో అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో పేరున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఆయనతో ఒక్క పాటైనా పాడించుకున్నారంటే అది బాలు స్వర గొప్పతనం.

గళం విప్పినా, స్వరం కూర్చినా ఆయనకు ఆయనే సాటి. బాలు పాటకు ఎన్నో అవార్డులు, రివార్డులు దాసోహమన్నాయి. మొత్తం 6 జాతీయ అవార్డులతో పాటు తెలుగులో 20 నంది అవార్డులు అందుకున్నారు బాలు. ఇప్పుడు అడపాదడపా బాలు పాటలు వినిపిస్తున్నా సందర్భానుచితంగా కావాలంటే బాలు పాట ఉండితీరాల్సిందే. ఒక్క పాటలే కాదు ఆయన గొప్ప నటుడు కూడా. చాలా సినిమాల్లో ఆయన గెస్ట్ రోల్ చేసి అదుర్స్ అనిపించారు. ఇంకా ఎంతో మంది నటులకు తన అద్భుతమైన గొంతును దానం చేశారు. ఆధ్యాత్మిక చిత్రాల్లో దేవుళ్ల పాత్రకు బాలు వాయిస్ చక్కగా సరిపోతుంది. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్ లతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. నభూతో నభవిష్యతి అన్నట్టుగా పాడే సుస్వరాల బాలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy