ఆరోగ్యశ్రీ బంద్ : 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత


హైదరాబాద్‌ :  పేదల ఆరోగ్యానికి వరమైన ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకం సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి ఓపీ, డయాగ్నోస్టిక్, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్‌పేషెంట్‌ సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. రూ. 1,200 కోట్ల మేరకు బకాయిలు తీర్చడంలోనూ, చర్చలు జరపడంలోనూ సర్కారు విఫలం కావడంతో మంగళవారం ఉదయం నుంచి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు అనేక ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. దీనితో 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేశారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవలు అందించేందుకు 236 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. దీనికితోడు మరో 67 డెంటల్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ ఆసుపత్రులు సైతం ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్‌ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్‌ఎస్‌ రోగులకు మాత్రమే డెంటల్‌ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో మంగళవారం 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అందులో హైదరాబాద్‌లో 66, వరంగల్‌ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 27, నిజామాబాద్‌లో 14, కరీంనగర్‌ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్‌లో 8, నల్లగొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్‌లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25 వేల మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలు అందిస్తాయి. ప్రతి రోజు 10 వేల మంది ఔట్‌పేషెంట్లు, 3 వేల మంది ఇన్‌ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు ఔట్‌ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్‌ పడింది. ఇక ఉద్యోగులు వెల్‌నెస్‌ సెంటర్లకు వెళ్లగా, అక్కడ చికిత్సకాని వారికి ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేయడం కూడా నిలిపి వేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy