ఆర్భాటం లేకుండానే.. డెలిగేట్లతో హైదరాబాద్‌కు ఇవాంకా

westirn-ivankaఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా పెద్ద ఆర్భాటమేమీ లేకుండా అమెరికన్‌ డెలిగేట్లతో కలసి హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడించాయి నిఘా వర్గాలు. 27వ తేదీ అర్ధరాత్రి సుమారు 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో కలసి ప్రత్యేక విమానంలో  శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారామె. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు అధికారులు. ఇవాంకా పర్యటనలో భాగంగా చార్మినార్‌ను, గోల్కొండ కోటను సందర్శించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

రోడ్డు మార్గంలోనే ఆమె ప్రయాణం..

అమెరికన్‌ డెలిగేట్లతో కలసి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ఇవాంకా అక్కడి నుంచి 36.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్టిన్‌ హోటల్‌కు, దాని నుంచి 3.7 కిలోమీటర్ల దూరంలోని హెచ్‌ఐసీసీకి, అక్కడి నుంచి విందుకోసం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌కు పూర్తిగా రోడ్డు మార్గంలోనే ప్రయాణించనున్నారు ఇవాంకా. వాస్తవానికి ప్రధాని మోడీ, ఇవాంకాల కోసం హెచ్‌ఐసీసీ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు హెలికాప్టర్‌ ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడ హెలిప్యాడ్స్‌ లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే విందు రాత్రివేళ జరుగనుండడం, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉండడంతో.. రోడ్డు మార్గంలోనే ప్రయాణించాలని భద్రతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇవాంకా కాన్వాయ్‌ అత్యంత వేగంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రహదారుల అభివృద్ధి, అడ్డంకుల తొలగింపు, బందోబస్తును సిద్ధం చేస్తున్నారు.

సీక్రెట్‌ సర్వీస్‌ బృందం

ఇక ఇవాంకా ఏ ప్రాంతానికి వెళ్లనున్నా.. కనీసం రెండు గంటల ముందే సీక్రెట్‌ సర్వీస్‌ బృందం అక్కడికి చేరుకుంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రత్యేక పరికరాల ద్వారా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, కాలుష్యం స్థాయి తదితరాలనూ గుర్తిస్తారని పేర్కొంటున్నారు. వీటి ఆధారంగా ఇవాంకా పాల్గొనే కార్యక్రమాల సమయాలను మారుస్తుంటారు. ఇందుకోసం ఇవాంకా షెడ్యూల్‌లో అవసరమైన సమయాన్ని రిజర్వ్‌లో ఉంచుతున్నారు.

భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

ఇవాంకా పర్యటన కోసం అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, రాష్ట్ర పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆమెను కలిసే.. బస సమీపంలో ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆమెకు అందించనున్న బహుమతుల జాబితాలనూ పరిశీలిస్తున్నారు. ఇక వెస్టిన్‌ హోటల్‌లో 28 నుంచి 30వ తేదీ వరకు ఎవరికీ బుకింగ్స్‌ ఉండకూడదని ఆదేశించారు. ఈ మేరకు హోటల్‌ యాజమాన్యం ఆ మూడు రోజులు రూమ్స్‌ బుకింగ్‌ లేవని వెబ్‌సైట్లో పొందుపరిచింది. మరోవైపు అధికారిక విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. కొత్తవారు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఇక ప్రధాని మోడీ, ఇవాంకా పర్యటనల నేపథ్యంలో ఏలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ట్రాఫిక్‌ విభాగం అధికారులు.

26 వాహనాల కాన్వాయ్‌లో వెస్టిన్‌ హోటల్‌కు చేరుకోనున్నఇవాంకా

హెచ్‌ఐసీసీలో 28వ తేదీ నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొనడానికే వస్తున్నారు ఇవాంకా.  దానికి కొన్ని గంటల ముందే.. అంటే 27న అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఇవాంకా, అమెరికన్‌ డెలిగేట్లు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపాయి నిఘావర్గాలు. ఇవాంకాతో పాటు వచ్చే డెలిగేట్ల పూర్తి వివరాలను సీక్రెట్‌ సర్వీస్‌ ఇప్పటికే తనిఖీ చేసుకుందని.. తర్వాతే వారితో కలసి ప్రయాణించే ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నాయి. ఇవాంకా తన భద్రతాధికారులు ఏర్పాటు చేసిన 26 వాహనాల కాన్వాయ్‌లో వెస్టిన్‌ హోటల్‌కు చేరుకోనున్నారు. ఆమెతో పాటు వస్తున్న డెలిగేట్లకు శంషాబాద్‌లోని నోవాటెల్, రాడిసన్‌ తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారంతా 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు.

వెస్టిన్‌లో స్పెషల్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ సిద్ధం

ఇవాంకా బస కోసం మాదాపూర్‌లోని ది వెస్టిన్‌ హోటల్‌లో స్పెషల్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అధికారులు సిద్ధం చేశారు. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ సూట్‌ను గురువారం మరోసారి పరిశీలించిన అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌) ఏజెంట్లు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సూట్‌కు అన్నివైపులా ఉన్న అద్దాలకు అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలను ఏర్పాటు చేశారు.ఈ స్పెషల్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో సాధారణ సమయంలో ఎవరైనా బస చేయాలంటే రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక వెస్టిన్‌ హోటల్‌ పైభాగంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలపై అమెరికన్‌ సాయుధ సిబ్బంది ప్రత్యేక ఆయుధాలతో కాపలా కాస్తారు. హోటల్‌ కింది భాగంలో ఇవాంకా వాహనాలను ఆపడం కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు వేల మందితో భద్రత

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 28న రాత్రి జరిగే విందుకు ప్రధాని మోడీ, ఇవాంకాతోపాటు రెండు వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు. మరుసటి రోజు గోల్కొండ కోటలో జరుగనున్న విందులో అతిథులు పాల్గొంటారు. అయితే ఆ విందుకు ప్రముఖుల రాకపై ఎలాంటి సమాచారం లేదు. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల్లో రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు. ఎస్పీజీ, నీతి ఆయోగ్, అమెరికన్‌ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారాయన.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy