కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న మలేసియా విమానం సముద్ర ప్రాంతంలో మాయమైపోయి మూడురోజులైంది. ఆ విమానం ఎక్కడో కూలిపోయినట్టు అనిపిస్తున్నా దాని శకలాలు ఎక్కడా దొరకడంలేదు. అమెరికా నేవీ, మలేసియా నేవీ, చైనా నేవీ, వియత్నాం నేవీ దళాలు ఒకపక్కన….ఎన్నో విమానాలు, హెలికాప్టర్లు, షిప్ లు మరోపక్కన సముద్రాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అయితే ఎక్కడా విమానానికి సంబంధించిన శకలాలు కనిపించనేలేదు. దీనితో, అసలీ విమానం కూలిపోయిందా? లేకపోతే….ఎవరైనా హైజాక్ చేశారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. విమానం కూలిపోయే ముందు కానీ, కూలిపోయే సమయంలో కానీ అందులోనుంచి ‘కాపాడమనే’ సిగ్నల్ రాలేదు. పోనీ, విమానం క్రాష్ అయిందనుకుంటే, పడిపోయిన చోటునుంచి ఏదో రకమైన సిగ్నల్ రావాలి. అదీ లేదు. దీన్నిబట్టి ఎవరో టెర్రరిస్టులు ప్లేన్ ను హైజాక్ చేశారనే థియరీ తెరమీదకి వచ్చింది. దొంగిలించిన పాస్ పోర్టులతో ఇద్దరు ప్లేన్ ఎక్కారని లేటెస్ట్ గా తెలియడంతో ఇంటర్ పోల్ సంస్థ, గూఢచార ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. విమానం హైజాక్ అయి ఉంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఉండాలి? పోనీ హైజాక్ చేశారనే అనుకున్నా, హైజాకర్లు ఇప్పటివరకు డిమాండ్లు పెట్టకపోవడమేంటి? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అందుకే, విద్రోహ కోణంలో విచారణ మొదలుపెట్టారు.