హక్కుల గళం మూగబోయి ఆరేళ్లు

vlcsnap-30613హక్కు ఆయన ఊపిరి. హక్కు ఆయన జీవితం. హక్కు ఆయన జీవిక. బతికింది…నడిచింది…పోరాడింది….ఆ హక్కు కోసమే. హక్కుల పిడికిలై…ఆదివాసీల ఆత్మబంధువై పరిపూర్ణ మానవుడనిపించుకున్న బాలగోపాల్ మనకు దూరమై ఆరేళ్లు గడిచిపోయాయి. ఆయన సంస్మరణలో ఇది ఏడో ఏడాది.

బాలగోపాల్… గొంతులేనోళ్లకు గొంతుక. గిరిజనుడి చేతిలో ఆయుధం. రైతు చేతిలో నాగలి. కార్మిక ఉద్యమాల్లో సైరన్. విప్లవోద్యమంలో అలుపెరగని బాటసారి. పౌర హక్కుల నుంచి మానవ హక్కుల దాకా సాగిన మహా ప్రయాణం. ఆ ప్రయాణం ఆగి ఆరేళ్లయ్యింది. హక్కుల స్వరం మూగవోయిన రోజివాళ.

1952లో అనంతపురం జిల్లాలో జన్మించిన బాలగోపాల్…తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, వరంగల్ ఆర్ఈసీలో  27 ఏళ్లకే గణితంలో పీహెచ్డీ కంప్లీట్ చేసిన మేధావి. 1980 నుంచి 85 కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా…అటు నుంచి హక్కుల ఉద్యమల వైపు మళ్లారు. ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ వాలిపోయారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… కాలికి పలపం కట్టుకొని దేశాన్ని చుట్టివచ్చారు. హక్కుల కోసం తపించారు. హక్కుల కోసం పోరాడారు. ఆ హక్కుల కోసమే జీవితాన్ని త్యజించిన మానవతామూర్తి బాలగోపాల్. ఒక్క మాటలో చెప్పాలంటే బాలగోపాల్ పేరులేని దేశ హక్కుల చరిత్రను చదవలేం. అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు, హక్కుల హననం ఎక్కడ జరిగితే…క్షణాల్లో అక్కడ ప్రత్యక్షయ్యారు బాలగోపాల్. ఆదివాసీలకు ఆత్మబంధువయ్యాడు. ఆదివాసీ గొంతుకై…న్యాయస్థానాల్లో నినదించారు. కూలీ పోరాటం నుంచి భూపోరాటం దాకా…. విప్లవోద్యమం నుంచి హక్కులోద్యమం దాకా…ఆయన చూపించిన తెగువ అసమానమైంది. ఆయన నడిచేది ముళ్ల బాటని తెలిసినా… మార్గం వీడలేదు. ప్రయాణం ఆపలేదు. భౌతిక దాడులు, బెదిరింపులు…చిరునవ్వుతో స్వీకరించారేగానీ… ఎంచుకున్న కర్తవ్యాన్ని వదులుకోలేదు. అందుకే బాలగోపాల్ అంటే హక్కుల పర్యాయపదంగా మారారు.

balagopal-sez1హింస హింసే. హింస ఎవరు చేసినా హింసే. ఇందుకు ఎవరూ అతీతులు కారనేది  బాలగోపాల్ నమ్మిన సిద్ధాంతం. రాజ్యహింసతో పాటు ప్రతిహింసను వ్యతిరేకించి…పౌరహక్కుల సంఘం నుంచి బయటికొచ్చిన బాలగోపాల్….మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేశారు. ఎమ్.ఎల్ పార్టీలను విమర్శిస్తూ…ఆయన రాసిన నక్సల్బరీ ఉద్యమం  గమ్యం – గమనం, చీకటి కోణాలు పుస్తకాల్లో అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఎన్నో విమర్శలకు తావిచ్చాయి. ఐనా తన పంథా వీడని ధీరత్వం ఆయనది. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని గట్టిగా వాదించి విజయం సాదించారు.  తెలుగుగడ్డ మీద ఆయన కాలు మోపని ప్రాంతంలేదు. హక్కుల ఉద్యమాలు, గిరిజన సమస్యలు, సెజ్ లు, ప్రాజెక్టుల నిర్వాసితులు, విద్యావ్యాపారం, కాలుష్యం, మురికివాడలు, మైనార్టీల సంక్షేమం, మహిళల హక్కులు, పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాలు….ఇలా చెప్పినా అన్నింట్లోనూ బాలగోపాల్ ఉంటాడు.

హక్కుల ఉద్యమ నేతగా అంతర్జాతీయ ఖ్యాతి పొందినా…నిరాడంబరం జీవితం గడిపారు. ఇంటి నిండా పుస్తకాలే ఆయన ఆస్తి. హక్కు అనే పదాన్ని ఇంటిపేరుగా….హక్కులే ఉఛ్చాసనిచ్ఛాస్వగా బతికిన బాలగోపాల్ మరణం హక్కుల ఉద్యమాలేకాదు… సమాజానికే తీరనిలోటు. ఆయన లేని లోటు ఈ ఆరేళ్ల కాలంలో చాలానే కనిపించింది. ఇప్పుడాయనలేడు. ఆయన స్ఫూర్తి అలాగే ఉంది. మిగిల్చిన ఆశయాలు కొనసాగించాల్సి ఉంది.  అదే ఆయనకు మనమిచ్చే నివాళి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy