అవే కన్నీళ్ళు…అదే ఆవేదన…

himachal-pradesh-river-accidentఏడు రోజులు అవుతున్నా తల్లిదండ్రుల శోకం తీరలేదు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల జాడ తెలియలేదు. అవే కన్నీళ్లు, అదే వేదన . ఆధునిక టెక్నాలజితో సెర్చ్ చేస్తున్నా అనుకున్న ఫలితాలు రాలేదు. ఆర్మీ, నేవీ, ఐటీబీపీతో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిన గజ ఈతగాళ్లు, వందలాదిమంది సిబ్బంది గాలిస్తున్నారు. మానవ రహిత యంత్రాలు రంగంలోకి దిగాయి. వాటర్ లో కెమెరాలు అణువణువూ రికార్డ్ చేస్తున్నాయి. అయినా విద్యార్థుల ఆచూకీ దొరకడం లేదు. ఈరోజు మూడు గంటలపాటు డ్యామ్ లోని నీరు వదలకుండా స్పెషల్ ఆపరేషన్ లో గజఈతగాళ్ళతో వెతికే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.

అయితే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన విద్యార్థులు ఇన్ని రోజులు బతికుంటారన్న నమ్మకం లేదు. అయినా ఏదో ఆశ. కనీసం చివరి చూపైనా దొరుకుతుందనే తల్లిదండ్రుల ప్రేమే… సెర్చింగ్ చేయిస్తోంది. 24 మందిని పొట్టనబెట్టుకున్న బియాస్ నదిలో ఇప్పటివరకు  8 మృతదేహాలు దొరికాయి. మొన్న దొరికిన రెండు డెడ్ బాడీలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే  ఆ ప్రాంతమంతా శోక సంద్రమైంది.  ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఉపేంద్ర, వనస్థలిపురానికి చెందిన అరవింద్ మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ప్రమాద స్థలంలో సర్చింగ్ ఆపరేషన్ కి అప్పుడప్పుడూ బ్రేక్ పడుతోంది. నీళ్లలోకి దిగిన జవాన్లు వణికిపోతున్నారు. గడ్డకట్టేంత చలి ఉన్న నీళ్లలో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు. బురద, రాళ్లు మరో అడ్డంకి. రాష్ట్రం నుంచి వెళ్లిన IPS అధికారి రాజీవ్ త్రివేది కూడా ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

ఇవాళ ఉదయం లార్జి ప్రాజెక్టు గేట్లను గంటసేపు మూసి వేసి మరీ విద్యార్ధుల కోసం వెతికే ప్రయత్నం చేశారు. గేట్లు మూసేసిన తర్వాత డ్యాం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఐదు వందల మందితో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు నుంచి నీటి  ప్రవాహాన్ని కనీసం మూడు గంటలు ఆపగలిగితే మూడు కిలీమీటర్లు నీరు తగ్గినా…విద్యార్ధుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy