ఇండియాకు డేంజర్ బెల్స్.. భారీగా పెరుగుతున్న జనాభా

మనదేశంలో జనాభా పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. త్వరలోనే చైనాను దాటేసి నంబర్ వన్ ప్లేస్ లో చేరేందుకు ఉరుకుతోంది. ఈ పరిణామం దేశానికి పెను సవాల్ విసరబోతోంది. 2050 కల్లా ప్రపంచ దేశాల్లో ఎంత జనాభా ఉండబోతోంది… ఇప్పటికే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నదానిపై వాషింగ్టన్ సంస్థ పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో(పీఆర్బీ) ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2050నాటికి.. చైనాకంటే భారత్ లో దాదాపు 25శాతం ఎక్కువ జనాభా ఉండబోతోంది. 2030 నాటికే.. చైనా కంటే 8శాతం ఎక్కువ జనాభా భారతదేశంలో ఉంటుంది.

2018 జూన్ వరకు ఇండియాలో ఉన్న జనాభా దాదాపు 137 కోట్లు. చైనా పాపులేషన్ 139 కోట్ల మంది. 2030నాటికి అంటే రాబోయే 12 ఏళ్లలో.. ఇండియాలో జనాభా 153కోట్లకు పెరగనుంది. అప్పటికి చైనాలో జనాభా 142 కోట్లకు మాత్రమే పెరుగుతుంది. 2050 నాటికి భారత్ లో జనాభా 168 కోట్లకు పెరిగిపోనుంది. ఆ సమయానికి చైనాలో జనాభా విచిత్రంగా 134 కోట్లకు తగ్గనుంది. ఇండియాలో జనాభా నియంత్రణకు సరైన పద్ధతులు, విధివిధానాలు అమలులో లేవు. అదే చైనాలో… జనాభా నియంత్రణకు నిర్దిష్టమైన ప్రణాళికను అక్కడి ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. చైనాలో జనాభా నియంత్రణ పద్ధతులు భవిష్యత్తులో ఫలించి… అక్కడి జనాభా ప్రమాదకరస్థాయిలో పెరగకుండా.. తగ్గిపోతుందని పీఆర్బీ అంచనా వేస్తోంది.

ఒక్క చైనానే కాదు.. 2050 కల్లా జపాన్, రష్యా, ఉక్రెయిన్, రుమేనియా, పోలండ్, జర్మనీ, థాయ్ లాండ్ లాంటి దేశాల్లో జనాభా ఇప్పుడున్న దానికంటే తగ్గే సూచనలున్నాయి. రానున్న 30 ఏళ్లలో ఇండియాలో 30కోట్లకు పైగానే జనాభా పెరగబోతోంది. నైజీరియా, కాంగో, పాకిస్థాన్, ఇథియోపియా, టాంజానియా, ఈజిప్ట్ లలో జనాభా ఎక్కువగా పెరగనుంది. అమెరికాలో ఇప్పడున్న జనాభా.. 2050 నాటికి కేవలం 0.16శాతం మాత్రమే పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 760కోట్లు ఉంటే… 2050 నాటికి 990కోట్లకు చేరనుంది. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల ఇండియాను ఇబ్బందిపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చని అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy