
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ దాకా ఏ సేవ అయినా… ఇక ఆన్ లైన్ లోనే జరగనున్నాయి. దీంతో దళారుల దందాకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది సర్కార్.
వరంగల్ ఆర్టీఏ ఆఫీసులో మొత్తం 59 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 723 మందికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. వీటిలో లైసెన్స్ లు 152, LLRలు 127, పర్మినెంట్ లైసెన్స్ లు, ఇతరాలు 57, కొత్త వాహన రిజిస్ట్రేషన్లు 271, ఫిట్ నెస్ లు 66, పర్మిట్లు 49 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో జనగాం ఆఫీస్ లో 95, మహబూబాబాద్ లో 125 మందికి ఆన్ లైన్ లో సేవలు అందుతాయి. 2008 నుంచి ఇప్పటి వరకూ ఆర్టీఏలోని 59 సర్వీసులను ఆన్ లైన్ లో పొందుపర్చారు. వాహనదారులు ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాల్లో నుంచి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చంటున్నారు ఆర్టీఏ అధికారులు.
ఈ-సేవా, మీ-సేవా సెంటర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న పేపర్లను చూపిస్తే.. ఆర్టీఏ ఆఫీసులో వేలిముద్ర, ఫొటో తీసుకుంటారు. దానికి సంబంధించిన టెస్ట్ నిర్వహిస్తారు. వాటిల్లో ఉత్తీర్ణత అయితే వెంటనే సర్టిఫికెట్ అందిస్తారు. గతంలో చలానా కట్టి దరఖాస్తులు ఇచ్చే వరకూ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఆన్ లైన్ సేవలతో ఆ పరిస్థితి ఉండబోదంటున్నారు అధికారులు. ఆన్ లైన్ కు సంబంధించి ఈ సేవా, మీ సేవా ప్రతినిధులకు ట్రైనింగ్ ఇచ్చామంటున్నారు.
ఆర్టీఏ సేవలను ఆన్ లైన్ లోకి మార్చడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. నగదు రహిత కార్యాలయంగా ఆర్టీఏను మార్చడంతో అవినీతి, అక్రమాలు, దళారీ వ్యవస్థ తగ్గిపోతుందంటున్నారు. ఆన్ లైన్ విధానంలో వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలని కోరుతున్నారు.
ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ పెట్టడంతో పాటు.. సిబ్బందికి పని ఒత్తిడి తగ్గుతుంది. వాహనదారుడికి టైమ్ కూడా సేవ్ అవుతుంది.