ఇక ఆటలు సాగవు : స్పాట్ లోనే డ్రగ్స్‌ ను పసిగట్టే కిట్స్‌

drugsడ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల తరహాలోనే డ్రగ్స్‌ బానిసలను స్పాట్‌లోనే పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. డ్రగ్స్‌ ఎవరు తీసుకున్నది… ఎంత మోతాదులో తీసుకున్నారు…తీసుకున్న డ్రగ్స్‌ పేర్లు ఏమిటి వంటి విషయాలను నిమిషాల్లో పసిగట్టగలిగే పరికరాల (కిట్స్‌)ను అందుబాటులోకి తీసుకురావడానికి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి పోలీసు, ఎక్సైజ్‌శాఖలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నేతృత్వంలో రాష్ట్రంలో డ్రగ్స్‌ మూలాలను ఛేదించడానికి సమాయత్తమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనితోపాటు హైదరాబాద్‌లో డ్రగ్‌ పెడ్లర్లను నియంత్రించాలని భావిస్తున్నాయి పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు. ఇందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించినట్టుగానే అనుమానాస్పద వ్యక్తులపై డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాయి. ఎన్‌సీబీ ఆధ్వర్యంలో బెంగళూరులో ఇటీవల జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొంది రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారుల బృందం. శిక్షణ కార్యక్రమంలో నే ఎన్‌సీబీ అధికారులు స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కిట్స్‌ను అమెరికా, లండన్, జర్మనీ, ఇజ్రాయెల్‌లలో తయారు చేయిస్తున్నట్టు అధికారులకు ఎన్‌సీబీ వివరించింది. వాటిని త్వరలోనే అన్ని రాష్ట్రా ల ఎక్సైజ్, పోలీసు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఎన్‌సీబీ అధికారులు.

 ఆరు రకాల డ్రగ్స్‌ తోపాటు.. మత్తు తీవ్రతను గుర్తించొచ్చు

ఎన్‌సీబీ వివిధ దేశాల్లో తయారు చేయిస్తున్న స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా ఆరు రకాల డ్రగ్స్‌ను ఇట్టే గుర్తించవచ్చంటున్నారు అధికారులు. గంజాయి, కొకైన్, హెరాయిన్, సెకోట్రోఫిక్‌ డ్రగ్స్, ఎండీఎంఏ తదితర మత్తు పదార్థాలను స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా గుర్తించవచ్చన్నారు. ప్రత్యేకమైన బ్రీత్‌ అనలైజర్‌ రూపంలో ఉండే పరికరాలతో డ్రగ్స్‌ వాడిన వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ సెంటర్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేసే ఆలోచన ఉందని చెపుతున్నారు అధికారులు.  డ్రగ్స్‌ తీసుకున్న వారితోపాటు పెడ్లర్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకునే మాదక ద్రవ్యాల రకం, మత్తు తీవ్రతను కూడా స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా తేల్చవచ్చని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఒక డ్రగ్‌ పెడ్లర్‌ను అరెస్టు చేసిన సందర్భంలో ఆ డ్రగ్‌ ఎలాంటిది? దాని తీవ్రత ఎంత ఉంటుంది? ఎలాంటి కారకాలు అందులో కలిశాయన్న దానిపైనా పక్కగా తేల్చేందుకు ఎన్‌సీబీ రూపొందిస్తున్న కెమికల్‌ కిట్స్‌ ద్వారా గుర్తించవచ్చు. ఏ1, ఏ2, ఏ3, బీ1, బీ2, బీ3, సీ1, సీ2, సీ3 కెమికల్‌ టెస్టింగ్‌ ద్వారా ఏ డ్రగ్‌ అన్నది తేల్చవచ్చు. సంబంధిత డ్రగ్‌పై రసాయన చుక్క వేయగానే అది మారే రంగును బట్టి అది ఏ రకమైన మాదక ద్రవ్యమో తెలుసుకోవడంతోపాటు దాని తీవ్రతను కూడా గుర్తించొచ్చు అంటున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy