ఇక దోమలపై పోరాటం

mosquitoes-blood-attack

..విద్యార్థులకు అవగాహన తరగతులు

నగరంలోని మురికివాడల్లో దోమల బెడద కొత్తేమీ కాదు.. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లోనూ దోమల సమస్య తీవ్రంగా ఉంటోంది. అధికార యంత్రాంగంతోపాటు ప్రజలు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు చేపడితేనే వాటి విజృంభణను అడ్డుకోగలం. లేకుంటే వ్యాధులతో సతమతం కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, ఉద్యోగుల్లో దోమల నివారణ చర్యలపై అవగాహనకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నగరవ్యాప్తంగా సుమారు వెయ్యి పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు.

..స్వీయ జాగ్రతలపై దృష్టి

నగరంలో సుమారు 1,500 మురికివాడలు, వేలాది సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. వాటిలో సుమారు 80 శాతం ప్రాంతాల్లో దోమల వృద్ధి తీవ్రంగా ఉందంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ‘‘ఒకసారి మందు చల్లితే.. అక్కడ పూర్తిగా నశించవు. నివారణ చర్యలు నిర్విరామంగా కొనసాగాలి. అప్పుడే ఆయా ప్రాంతాలు ఉపశమనం పొందుతాయి. సంహారక మందు పదేపదే ఉపయోగించినప్పుడు అవి ఆ ప్రభావాన్ని తట్టుకునే స్థాయికి చేరతాయి. వాటి జన్యువుల్లో మార్పులు వస్తుంటాయి. జీవ పరిణామక్రమంలో ఇదో భాగం. అందువల్ల సాధ్యమైనంత వరకు స్థానికులే జాగ్రతలు తీసుకోవాలి. దోమల నివారణపై చైతన్యవంతం కావాలి. వారు తీసుకునే చర్యలు సక్రమంగా ఉన్నట్లయితే సహజంగానే అదుపులోకి వస్తాయి.’’ అని బల్దియా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

..సూచనలు పాటించండి

సెప్టిక్‌ ట్యాంకులు, టాయిలెట్లపై ఉండే గొట్టాలకు ప్రత్యేకంగా మెష్‌లు ఏర్పాటు చేయాలి. ఇళ్లలో ఉన్న పాత టైర్లు, కుండలు, ఖాళీ కొబ్బరిబోండాలు, చిప్పలు, కూలర్ల వంటి వాటిలో నీరు లేకుండా చూడాలి. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం, రోడ్లపై గుంతల్లో మురుగునీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బల్దియా తన యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించడంతోపాటుగా.. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకొంటే ఈ వర్షాకాలంలో నగరవాసులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.

*దోమల తీవ్రత ఎక్కువగా ఉంటే బల్దియాకు ఫిర్యాదు చేయాల్సిన నంబరు: 040-21111111
వాట్సాప్‌: 7702304800
యాప్‌: మైజీహెచ్‌ఎంసీ

ఈ ప్రాంతాల్లో…

మురికివాడల్లో ఏటా మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది అంబర్‌పేట్‌లో అత్యధికంగా 9 మలేరియా కేసులు వెలుగుచూశాయి. జియాగూడ, దత్తాత్రేయనగర్‌, ఆసిఫ్‌నగర్‌, ఖైరతాబాద్‌, బర్కత్‌పుర, కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లోనూ మలేరియా జ్వరాల బెడద ఎక్కువే. గ్రేటర్‌ మొత్తం మీద 2015లో 335 డెంగీ, 139 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2013లో డెంగీ కేసులు 95 కాగా 2014లో 93 మాత్రమే కావడం గమనార్హం. ఇవి జీహెచ్‌ఎంసీ చెబుతున్న అధికారిక లెక్కలు. వాస్తవానికి అంతకన్నా ఎక్కువ మొత్తంలో బాధితులు ఉంటారు.

బల్దియా వద్ద

ఫాగింగ్‌ యంత్రాలు: 115
డివిజన్‌కు ఒకటి చొప్పున ఉండాలంటే ఇంకా అవసరం: 35
నాప్‌శాక్‌ స్ప్రేయర్లు: 784 పవర్‌ స్ప్రేయర్లు: 50
ఆటోలో వెళ్తూ వీధుల్లో పొగ చిమ్మే దోమల నివారణ యంత్రాలు: 10
వీటన్నింటినీ వినియోగించేందుకు ఉన్న పూర్తిస్థాయి ఉద్యోగులు: 81
పొరుగుసేవల సిబ్బంది: 2,398

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy