ఇతని సంకల్పానికి విధి సైతం తలవంచింది : కాళ్లతో టైలరింగ్ చేస్తున్నాడు

legs-taiorకృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని విన్నాం. అది సంపూర్ణ మానవుడి గురించి. కానీ రెండు చేతులు లేకుండానే కేవలం కాళ్ల ఆధారంతో కుట్టు మిషన్ పై బట్టలు కుడుతూ పలువురికి మార్గదర్శిగా నిలిచారు మదన్ లాల్. చేతులు లేకుండానే గొప్ప టైలర్ గా ప్రశంసలందుకుంటున్న మదన్ హర్యానా రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందినవాడు. 45 ఏళ్ల వయస్సున్న మదన్ రెండు చేతులు లేకుండానే పుట్టాడు. మదన్ లాల్ తల్లిదండ్రులు ఆయనకు విద్య నేర్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏ పాఠశాలకు వెళ్ళిన చేతులు లేనివాడికి విద్య ఏలా వస్తుందని, ఏలా రాస్తాడని పలు ప్రశ్నలను సంధిస్తూ అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు ఉపాధ్యాయులు. పాఠశాలల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన తల్లిదండ్రులు ఇక అతనికి చదువు అవసరం లేదనుకున్నారు.

మదన్ కు వయస్సు పెరుగుతుంది. 23 సంవత్సరాలు రానే వచ్చాయి. ఏదో చేయాలనే తపన. కానీ ఏమి చేయగలడు. ఒక రోజు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నేను టైలరింగ్ నేర్చుకుంటాను అన్నాడు మదన్ లాల్. చేతులు లేవు.. ఏలా నేర్చుకుంటావురా అని ప్రశ్నించారు అతని తల్లిదండ్రులు. అతను ఆ గ్రామంలో ఉన్న టైలర్ దగ్గరకు వెళ్ళి టైలరింగ్ నేర్పంచమని ప్రాధేయపడ్డాడు. చేతులు లేవు కదా.. ఎలా మిషన్ కుడతావు అని హేళన చేశాడు ఆ టైలర్.

పట్టు విడువని ఆ వికలాంగుడు వారి గ్రామానికి దగ్గరలో ఉన్న ఫతెహబాద్ పట్టణానికి వెళ్ళాడు మదన్. అక్కడ చాలా మంది టైలర్ల దగ్గరకు వెళ్ళి తన అభిప్రాయం చెప్పాడు. అందరూ నవ్వుకున్నారే తప్ప.. అతనికి నేర్పిస్తామని మాత్రం ఎవరు అనలేదు. ఎట్టకేలకు ఓ టైలర్ కనికరించాడు. చేతులు లేని ఆ కుర్రోడికి టైలరింగ్ నేర్పించాడు. 15 రోజుల్లోనే మదన్ టైలరింగ్ నేర్చుకున్నాడు. మనోనిశ్చయం, దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసమే అతన్ని కార్యదీక్షతో ముందుకు నడిపించింది.

చేతులు లేకుండానే 22 ఏళ్ల నుంచి సమర్థవంతంగా టైలరింగ్ చేస్తున్నాడు మదన్. రెండు కాళ్లే అతనికి చేతుల్లాగా పని చేశాయి. కాళ్లతోనే కొలతలు తీసుకోవడం, కత్తిరించడం, మిషన్ తో కుట్టడం మదన్ పట్టుదలకే నిదర్శనం. ఆయన పుట్టిన గ్రామంలోని స్త్రీ, పురుషులందరు మదన్ దగ్గరే బట్టలు కుట్టించుకుంటారు. ఇప్పటికి ఆ గ్రామంలో మదన్ లాల్ టైలరింగ్ షాప్ జనంతో కిటకిటలాడుతుంది. చేతులు లేకపోతే ఏమి చేయలేననుకున్న మదన్ కు ఇప్పుడు కాళ్ల నిండా పనే ఉంటుంది. దానితో ఆ గ్రామంలో అతనికి గౌరవం పెరిగింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy