ఇదిగో ఉద్దండరాయునిపాలెం చరిత్ర

Landpooling_1_0ఏపీ కొత్త రాజధాని అమరావతి ముస్తాబవుతోంది. దసరారోజు జరిగే వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అధికారులు. రాజధాని శంకుస్థాపనకు దేశంలోని బడా నేతలంతా వస్తుండడంతో చిరస్మరణీయ ఘట్టానికి అమరావతి దగ్గర్లోని ఉద్దండరాయునిపాలెం వేదిక అవుతోంది. వేలకోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోందా గ్రామం. ఉద్దండరాయపురం చారిత్రక నేపధ్యంపై స్పెషల్ స్టోరీ..

ఉద్దండరాయునిపాలెం.  నిన్నటి వరకూ ఎవరీకీ తెలియని ఈ గ్రామం….ఈ రోజు తెలుగువారందరి నోట్లో నానుతోంది. గతంలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ కు  అమరావతిని రాజధానిగా చేయడంతో మళ్లీ వెలుగులోకొచ్చింది. రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం బ్లాకులుగా విభజించింది. ఇందులోని   ఈశాన్య భాగంలో శంకుస్థాపనకు సిద్ధమైంది. ఈ ప్రాంతం ఉద్దండ్రాయునిపాలెం గ్రామంలోనిది కావడంతో చర్చనీయాంశమైంది.

350x350_IMAGE45385041ఉద్దండరాయునిపాలానికి  500 ఏళ్ల చరిత్ర ఉంది.. విజయనగర సామ్రాజ్య ప్రభువైన శ్రీ కృష్ణదేవరాయల సామంతుడు ఉద్దండరాయుడు. అప్పట్లో అతని పేరుపై ఈ గ్రామం ఏర్పడినట్టు శాసనాలు చెబుతున్నాయి.  క్రీశ 1513లో కళింగ  దండయాత్రకు బయలుదేరిన శ్రీ కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి… తిరుమలరౌతరేయ మహాపాత్రుడిని పట్టుకొన్నాడు. అలా అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగెడు, కేతవరం కోటలతో పాటుగా కొండవీటి దుర్గాన్నీ వశపరచుకొన్నాడు.

అప్పట్లో ఉద్దండఖానుడు వినుకొండ దుర్గాధిపతిగా ఉన్నాడు. రాయలు కొండవీడుపై దాడి చేసినప్పుడు గజపతి సైన్యంలో ఒక భాగానికి నాయకత్వం వహించాడు. కొండవీడులో చిక్కిన ఉద్దండఖానుడికి రాయలు అభయమిచ్చాడు. దీంతో ప్రాణదానం చేసిన రాయలుకు అతడు విధేయుడయ్యాడు. రాజసైన్యాన్ని నడపటానికి  ఒప్పుకున్నాడు.  అప్పటికే  కృష్ణానదికి దక్షిణాన భూభాగమంతా స్వాధీనం చేసుకొని, కొండవీడునూ జయించిన విజయగర్వంతో శ్రీకృష్ణదేవరాయులు నదికి ఉత్తరాన గల కొండపల్లి కొటను ముట్టడించటానికి ప్రణాళిక సిద్దం చేశాడు. తన సైన్యంలో ఒక పాయను తిమ్మరుసు నాయకత్వాన తూర్పుగా వెళ్లి రాజమహేంద్రవరం, కొట్టాందుర్గాలను జయించటానికి సిద్ధం చేశాడు. మరో వర్గానికి తానే నాయకత్వంవహించి తెలంగాణ దుర్గాలను జయించాటినికి ప్రణాళిక సిద్ధం చేశాడు. కొండవీటి నుంచి తుళ్లూరు మీదుగా ప్రయాణించి కృష్ణానదికి దగ్గరగా మోహరించాడు. ఆ ప్రదేశాన్నే ఇప్పుడు రాయపూడి గా పిలుస్తున్నారు. ఆయనకు విధేయుడుగా మారిన ఉద్ధండఖానుడు రాయల సైన్యానికి సహకరిస్తూ రాయపూడికి ఉత్తరంగా కృష్ణానదికి ఒడ్డున మరో సైనిక శిబిరాన్ని ఉంచి, కొండపల్లిపై దాడికి రాయలు ఆజ్ఞల కోసం వేచి  ఉన్నాడు… సమయం కోసం ఆరు నెలలు పాటు కృష్ణదేవరాయులు, ఉద్దండఖానుడు అక్కేడే బసచేశారు. ఆ సమయంలో ఉద్దండఖానుడు విశ్వాసాన్ని మెచ్చుకొన్న రాయలు అతడికి ఉద్దండరాయుడు బిరుదునిచ్చారు. ఆ విధంగా అతను బసచేసిన ప్రాంతానికి ఉద్దండరాయునిపాలెం అనే పేరు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy