ఇన్ని కోట్లా : శశి వర్గం ఆస్తులు 30 వేల కోట్లు.!

shashikalaశశి గణంపై ఐదు రోజులపాటు జరిగిన మెగా ఆపరేషన్ ముగిసింది. ఆ వెంటనే లెక్కలు తేల్చే పని ప్రారంభించింది ఐటీ శాఖ. అన్నాడీఎంకే మాజీ ప్రధానకార్యదర్శి వీకే శశికళ, ఆ పార్టీ అసమ్మతి వర్గం నాయకుడు టీటీవీ దినకరన్‌ కుటుంబీకులు, లాయర్లు, జ్యోతిష్యులు, పార్టీ ప్రముఖలద్దరి ఆస్తులు సుమారు రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా వేశారు. అంతేకాకుండా అక్రమ నగదు బట్వాడాలు, బినామీ కంపెనీల నిర్వహణ తదితర అక్రమ కార్యకలాపాల ద్వారా రూ.1,500 కోట్ల దాకా పన్ను ఎగవేసినట్లు కూడా ఆదాయపు పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో రూపొందించిన నివేదికను స్థానిక ఐటీ అధికారులు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపారు. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ కుటుంబం అక్రమ సంపాదనపై రెండు వేలమంది అధికారులు, మెగా స్థాయిలో ఐదు రోజులపాటు 200 చోట్ల ఆకస్మికదాడులను నిర్వహించారు. అయితే, ఐటీ అధికారులు సోదాలు జరిపిన తీరు, తమను ప్రశ్నిస్తున్న పద్ధతి.. రాజకీయ ప్రేరేపితంలా అనిపించడం లేదని శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఎంవో వివేక్‌ జయరామన్‌ అనడం ఆసక్తికరంగా అన్పించింది.

పది వాహనాల్లో పత్రాలు

తనిఖీలలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులు, నగలు, నగదు, విలువైన పరికరాలను సుమారు పది వాహనాలలో చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ శాఖ కార్యాలయానికి తరలించారు అధికారులు. బెంగళూరు, పుదుచ్చేరి నుంచి పలు దస్తావేజులు, నగలను చెన్నైకి తీసుకొచ్చారు. వీటి పరిశీలనకు 30 మంది ఆడిటర్లు, వెయ్యిమందికి పైగా ఐటీ ఉద్యోగులను వినియోగించారు. ఓ వైపు శశికళ వర్గం అక్రమాస్తులకు సంబంధించిన దస్తావేజుల పరిశీలన జరుగుతుండగానే, మరో వైపు ఐటీ అధికారులు జయా టీవీ సీఈవో వివేక్‌ జయరామన్‌, దినకరన్‌ మద్దతుదారు అన్నాడీఎంకే కర్ణాటకశాఖ నేత పుగళేంది, దినకరన్‌ తోడల్లుడు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌, జయ సహాయకుడు పూంగుండ్రంలకు సమన్లు జారీ చేసి తమ కార్యాలయంలో తీవ్ర విచారణ జరిపారు. మంగళవారం ఉదయం వేళచ్చేరిలోని ఫినిక్స్‌మాల్‌లో సినిమా థియేటర్లు నడుపుతున్న జాస్‌ సినిమాస్‌ సంస్థ ఉద్యోగులను విచారించారు. శశికళ మరదలు ఇళవరసి కుమారుడు, జయా టీవీ సీఈవో వివేక్‌ జయరామన్‌ ఈ సంస్థని నిర్వహిస్తున్నారు. థియేటర్లను నడపటంతోపాటు సినిమాల పంపిణీ సంస్థను కూడా ‘జాస్‌’ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 150 సినిమాథియేటర్లు తమిళనాడులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారపత్రాలు సైతం ఐటీ దాడులలో బయట పడ్డాయి.

1500 కోట్లకు పైగా పన్నుల ఎగవేత 

ఐదు రోజుల సోదాల్లో రూ. 7.14 కోట్ల నగదు, రూ. 5 కోట్ల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు. పట్టుబడిన వజ్రాభరణాల విలువను స్వర్ణకారుల ద్వారా అంచనా వేయిస్తున్నామని చెప్పారు. ఇక శశికళ, దినకరన్‌ కుటుంబీకులంతా కలిసి సుమారు రూ. 1500 కోట్లకు పైగా పన్నులు చెల్లించకుండా మోసగించారని దాడులలో పట్టుబడిన దస్తావేజుల ద్వారా రుజువైందన్నారు. దాడులలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులను, ఆస్తిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి కనీసం పది రోజులు పడుతుందన్నారు. ప్రస్తుతం అక్రమార్జన స్థాయినిబట్టి… వరుసగా సమన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఆదాయపు పన్నుల శాఖ అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని జయా టీవీ సీఈవో వివేక్‌ జయరామన్‌ తెలిపారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy