ఇలాగైతే కరెంట్ కష్టాలు తీరేదెలా?

2014-10-05_70_Home_telangana-electricityకరెంట్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ముందుకు వచ్చినా… సరఫరాకు  విద్యుత్ సంస్థలు సహకరించడం లేదు. ఏపీ అధికారుల ఒత్తిడితో ప్రైవేటు కంపెనీలు రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సరఫరాకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు  ముఖం చాటేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు టెండర్లకు స్పందన కరువైంది. ప్రభుత్వం  టెండర్లు పిలవడం ఆలస్యం కావడంతో ఏపీ సర్కార్ ప్రైవేటు థర్మల్ విద్యుత్ సంస్థలను  చేజారిపోకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది.

టెండర్లకు స్పందన కరువు

డిస్కమ్ ల నుంచి టీఎస్ ఎస్ పీడీసీఎల్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గత నెలలో టెండర్లు పిలిచింది ప్రభుత్వం. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానంలో బిడ్లు ఆహ్వానించింది. బిడ్లకు దరఖాస్తు చేసుకోవాడినికి అక్టోబర్ చివరి వారం వరకు గడువు పెట్టింది.  అయితే  టెండర్లలో పాల్గొనేందుకు  ప్రైవేటు థర్మల్ విద్యుత్ సంస్థలు ముందుకు రాలేదు. ఒకే ఒక్క సంస్థ అది కూడా 10 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దీంతో డిస్కమ్ ల అధికారులు కంగు తిన్నారు. గడువు ప్రకారం ఈ సంస్థ నవంబర్ 1 నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ డిస్కమ్ తో ఒప్పందం చేసుకోలేదని తెలుస్తోంది.

ఏడాది పాటు విద్యుత్ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లది కూడా ఇదే పరిస్థితి.  రాష్ట్ర జెన్ కో విద్యుత్ కేంద్రాలతో పాటు ప్రభుత్వ రంగంలోని విద్యుత్ కేంద్రాలు, కేంద్రం నుంచి వచ్చే వాటా పోగా… రాష్ట్రంలో డిమాండ్ కు సరిపడా సరఫరాకు రెండు నుంచి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా వచ్చే ఏడాది విద్యుత్ సరఫరాకు ముందే టెండర్లను పిలవడం ఆనవాయితీ.

పాత  ఒప్పందాల ప్రకారం ఆయా కంపెనీల నుంచి రెండు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే  విభజన తర్వాత ప్రక్రియ నత్తనడకన సాగింది. జూలైలోనే టెండర్లు పిలవాల్సి ఉంటే…తెలంగాణ విద్యుత్ శాఖ ఆగస్టులో 2,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచింది. ఏపీ మాత్రం అప్పటికే 2,000 మెగావాట్లకు టెండర్లు పిలిచి, ఒకరోజు ముందే గడువును ముగించింది. దీంతో ఎక్కువ కంపెనీలు అక్కడ టెండర్లు దాఖలు చేయగా.. తెలంగాణలో నామమాత్రంగా దాఖలయ్యాయి.

కంపెనీలు ముందుకొచ్చినా…

రాష్ట్ర పరిధిలోని కంపెనీలు కేవలం 288 మెగావాట్ల సరఫరాకు బిడ్లు దాఖలు చేయగా…ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీలు 330 మెగావాట్ల సరఫరాకు ముందుకొచ్చాయి. ఉత్తరాది కంపెనీలు 1,500 మెగావాట్ల సరఫరాకు ముందుకొచ్చినా కారిడార్ సమస్య అడ్డు వచ్చింది. దీంతో కేవలం 618 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు టెండర్లు వచ్చాయంటున్నారు అధికారులు.

ఈ కంపెనీలకు టీఎస్ ఎస్ పీడీసీఎల్ లెటర్ ఆఫ్ ఇండెంట్లు పంపించింది. కంపెనీలు 2015 జూన్ 1 నుంచి 2016 మే 30 వరకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా…మొత్తం తమకే సరఫరా చేసేలా ఏపీకి చెందిన ప్రైవేటు కంపెనీలపై అక్కడి విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు  తెలుస్తోంది. దీంతో బిడ్లు దాఖలు చేసిన వాటిలో ఎన్ని కంపెనీలు ఒప్పందానికి ముందుకొస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy