ఇవాళే పోరాట యోధుడి విగ్రహావిష్కరణ

KAKA PHOTOదళిత శిఖరం, తెలంగాణ పోరాట యోధుడు, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఆయన జయంతిని  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  గతేడాది కాకా సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ… ట్యాంక్ బండ్ పై  కాకా విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ సభకు దళితులు, కార్మికులు, తెలంగాణ అభిమానులు కలిసిరావాలని .. ఐక్యత చాటాలని దళితసంఘాలు కోరుతున్నాయి.

అరవై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన గాంధేయ వాది.. తెలంగాణ దశ దిశ చూసిన స్వరాష్ట్ర పోరాట యోధుడు.. కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి 86వ జయంతి వేడుకలకు అంతా రెడీ అయ్యింది. కాకా మరణం తర్వాత మొదటి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కార్మికులు, దళితుల సంక్షేమం కోసం కృషిచేసిన మహా నేతను… ఘనంగా స్మరించుకోబోతోంది. కాకా జయంతి సందర్భంగా… హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న సాగర్ పార్క్ లో రేపు ఉదయం పది గంటలకు కాకా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది నాయకుల్లో వెంకటస్వామి ఒకరు. కార్మిక మంత్రిగా..  బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి… పేదల ఇళ్లు, కార్మికుల హక్కులు, దళితులకు విద్యావకాశాల కోసం గొప్పగా పోరాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలపై తనదైన ముద్ర వేశారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని… ఈ ఏడాది జనవరిలో రవీంద్రభారతిలో జరిగిన సంస్మరణ సభలో సీఎం హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారు కేసీఆర్.

ఏడాది తిరక్కముందే.. ఇచ్చిన మాట ప్రకారం.. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున ఆవిష్కరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. CM KCRతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాకా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వెంకటస్వామి ఆత్మకథ.. మేరా సఫర్ పుస్తకాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించనున్నారు. కాకా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

దళిత నాయకుడు వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాయి దళితసంఘాలు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన కాకా జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని  తెలంగాణ ఎమ్మార్పీఎస్, మాల సంక్షేమ సమితి, మాల, మాదిగ, విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ యోధుడు కాకా విగ్రహాలను జిల్లాలతో పాటు.. పార్లమెంటులో కూడా ప్రతిష్టించాలని కోరుతున్నారు ఆయన అభిమానులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy