ఇవాళ్టి నుంచే రైతుబంధు పథకం

rythu-bandhuపంట పెట్టుబడి  చెక్కుల  పంపిణీ, కొత్త పట్టా పాసుపుస్తకాల పంపిణీకి అంతా సిద్దమైంది. ఇవాల్టి (గురువారం,మే-10)  నుంచి వారం  రోజుల పాటు  కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా  58 లక్షలు  పాస్ పుస్తకాలు,  చెక్కులు  పంపిణీ  చేయనుంది ప్రభుత్వం.  ఉదయం 10 గంటలకు హుజురాబాద్ లో  రైతుబంధు పథకాన్ని మొదలు పెట్టనున్నారు  ముఖ్యమంత్రి. తర్వాత లక్ష మందితో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

హుజూరాబాద్ లో సీఎం రైతుబంధు ప్రారంభించిన తర్వాత 11 గంటలకు అన్ని జిల్లాల్లో రైతులకు చెక్కులు పంపిణీ జరగనుంది. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొంటారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు చెక్కులు ఇవ్వనున్నారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి రోజూ 4 జిల్లాల్లో చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించనున్నారు.

రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు కోటి 43 లక్షల 27 వేల ఎకరాల సాగుభూమికి పంట సాయం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందుకోసం 5 వేల 730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను అందించనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 833 గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు.

చెక్కుల పంపిణీలో పాటించాల్సిన అంశాలపై వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రచారం నిర్వహించారు. వారం రోజులు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ జరగనుంది. ఎండాకాలం కావడంతో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు… తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం. మొత్తం 17 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తో పాస్ పుస్తకాలు తయారు చేశారు. వీటిని టాంపర్ చేయడం వీలుకాదు. రైతు పేరు, భూమి ఎలా వచ్చింది, రిమార్కులు, బార్ కోడ్, స్కాన్ కోడ్ తో కూడిన పాసు పుస్తకంలో మొత్తం 16 పేజీలున్నాయి. అన్ని పేజీలకు కూడా బార్ కోడ్ ముద్రించింది రెవెన్యూ శాఖ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy