ఇవాళ ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ


ఖమ్మం: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ కేసీఆర్‌ ఇవాళ (సోమవారం) ఖమ్మంలో పర్యటించనున్నారు. శాసనసభ రద్దయిన వెంటనే సెప్టెంబర్‌ 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ ఖమ్మం జిల్లాలో అదే సమయంలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది. ఒకటిరెండుసార్లు ఆయన పర్యటన షెడ్యూలు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో రద్దయింది. ఇప్పుడు నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకోవడం, ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు వేడెక్కిస్తుండడంతో కీలకమైన ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ పరంగా మరింత వేగవంతం చేసేందుకు, సభను విజయవంతం చేసేందుకు పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నేరుగా పటేల్‌ స్టేడియంకు చేరుకుంటారు.పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ సభను విజయవంతం చేసేందుకు, పార్టీ శ్రేణులను సమీకరించేందుకు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌లు ఆయా నియోజకవర్గాల కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి జనసమీకరణపై దృష్టి సారించారు. మరోవైపు కేసీఆర్‌ పాల్గొనే సభాస్థలిని టీఆర్‌ఎస్‌ జెండాలతో, గులాబీ తోరణాలతో అలంకరించారు.

కేసీఆర్‌ బహిరంగ సభకు చేరుకోవడానికి ముందే పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో, ఖమ్మం అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంఅర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే భారీ ర్యాలీతో కార్యకర్తలతో కలిసి సభాస్థలికి చేరుకొని కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy