ఇవాళ టీ20 ట్రైసిరీస్ ఫైనల్ : టైటిల్ కోసం భారత్, బంగ్లాదేశ్ ఢీ

ind banglaముక్కోణపు సిరీస్ టైటిల్ సొంతం చేసుకోవడానికి టీమిండియా ఒక్క అడుగు దూరంలో ఉంది. కొలంబో వేదికగా ఆదివారం ( మార్చి-18)న జరిగే ఫైనల్ కోసం ఇరు జట్లు ఇవ్విళ్లూరుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో ఇరు జట్లు తడబడ్డాయి. ఇటు తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌ తర్వాత ఘనంగా పుంజుకుంది. అటు బంగ్లాదేశ్‌ క్రమక్రమంగా ఆటతీరు మెరుగుపర్చుకుంటూ వచ్చింది. స్థాయికి తగ్గ ఆటతో రోహిత్‌ సేన, పోరాటపటిమతో షకీబ్‌ బృందం నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్‌ చేరాయి. శక్తిసామర్థ్యాలు, గత రికార్డు చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నా, సంచలనాల ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లలో లోతైన బ్యాటింగ్‌ లైనప్, ఆల్‌ రౌండర్లు, నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఆదివారం జరుగనున్న తుది సమరం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

టీమిండియాకు ఒక్క లోటు

మొన్నటివరకు కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఫామ్‌ భారత్‌కు పెద్ద ఆందోళనగా ఉండేది. ఎట్టకేలకు గత మ్యాచ్‌లో బంగ్లాపైనే అతడు టచ్‌లోకి వచ్చి బెంగతీర్చాడు. ఓపెనర్‌ ధావన్‌ సహా రైనా, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌ అందరూ ఈ టోర్నీలో సత్తాచాటారు. దీంతో బ్యాటింగ్‌ పరంగా ఇబ్బందులేమీ లేవు. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ పవర్‌ ప్లేలో పొదుపుగా బౌలింగ్‌ చేస్తూనే వికెట్లూ తీస్తున్నాడు. చహల్‌ గాడిన పడ్డాడు. అయితే… ఉనాద్కట్, సిరాజ్‌ ఇద్దరూ విఫలమవడంతో రెండో ప్రధాన పేసర్‌ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఉన్నందున సిరాజ్‌ స్థానంలో దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగితే 200పైగా పరుగులు సాధించి ప్రత్యర్థిని మానసికంగా ఒత్తిడిలోకి నెట్టాలి. బౌలింగ్‌ చేయాల్సి వచ్చినా 160లోపు కట్టడి చేస్తే ఛేదనలో ఇబ్బందులు ఎదురవవు.

బంగ్లాతో పారాహుషార్‌…

భారత్‌ స్థాయిలో ఆటగాళ్లు లేకున్నా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆతిథ్య శ్రీలంకపై రెండు మ్యాచ్‌ల్లోనూ వారి పోరాటం విస్మరించలేనిది. తమీమ్‌ ఇక్బాల్, లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్‌లకు తోడు కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ రాకతో బ్యాటింగ్‌ బలం మరింత పెరిగింది. సారథ్య బాధ్యతల ఒత్తిడి లేకపోవడంతో గత మ్యాచ్‌లో మహ్ముదుల్లా అద్వితీయంగా ఆడాడు. ముస్తఫిజుర్, రూబెల్‌ పదునైన పేసర్లు. స్పిన్‌లో మెహదీ హసన్‌కు షకీబ్‌ తోడయ్యాడు. వీరంతా సమష్టిగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బంగ్లా ఫైనల్‌కు బరిలో దించే అవకాశాలు ఉన్నాయి.

ఫైనల్ జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), ధావన్, రైనా, రాహుల్, పాండే, కార్తీక్, విజయ్‌శంకర్, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, చహల్, దీపక్‌ హుడా/అక్షర్‌ పటేల్‌/సిరాజ్‌.

బంగ్లాదేశ్‌: షకీబుల్‌ హసన్‌ (కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్, లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్‌ రహీమ్, మహ్ముదుల్లా, షబ్బీర్, మెహదీ హసన్, రూబెల్‌ హుస్సేన్, ముస్తఫిజుర్, నజ్ముల్‌ ఇస్లాం.

పిచ్, వాతావరణం

మరోసారి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళలో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం లేదు.

మ్యాచ్ : రాత్రి గం.7 నుంచి డిడి స్పోర్ట్‌లో లైవ్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy