ఇవాళ ప్రపంచ ఆదివాసీ దివస్

తరాలు గడుస్తున్నా ఆదివాసీల తలరాతలు మారడంలేదు. ప్రత్యేక చట్టాలున్నా గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు రావడం లేదు. ఆధునిక యుగంలోనూ వేలాది గూడేలకు సురక్షిత తాగునీరు అందడం లేదు. కరెంట్, విద్య, వైద్యం వంటీ కనీస సౌకర్యాలకు దిక్కులేదు. అయినా కష్టాలు పడుతూనే కొండ ప్రాంతాలకే పరిమితమవుతున్నారు ఆదివాసీలు. తమ సంస్కృతీ సాంప్రదాయాలనూ కాపాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం(ఆగస్టు-9) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా  అడవిబిడ్డల స్థితిగతులపై వీ6 ప్రత్యేక కథనం..

అభివృద్ధికి నోచుకోని సామాజిక వర్గాల్లో ఆదివాసీలు ఇంకా అట్టడుగునే ఉన్నారు. ఒకవైపు మానవుడు ఆకాశాన్ని జయించే పనిలో ఉంటే.. మరోవైపు అడవిలో ఉన్న గిరిపుత్రులు తిండి కోసం పాట్లు పడుతున్నారు.  వాతావరణంపై ఆధారపడుతూ పోడు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. మనదేశ జనాభాలో 8శాతం ఆదివాసీలు ఉన్నారు. మొత్తం 33 ఆదివాసీ, సంచార తెగలు ఉండగా.. అందులో రెండు లక్షల పైన జనాభా కలిగిన తెగలు ఆరు.  మన రాష్ట్రంలో 32లక్షల87వేల  గిరిజన జనాభా ఉంది. వీరిలో  20లక్షల4 వేలతో లంబాడీలు ముందుండగా.. 4లక్షల86వేలతో  రెండో స్థానంలో కోయలున్నారు. 3 లక్షలతో గోండు జాతీ మూడవ స్థానంలో ఉంది. మన రాజ్యంగంలోని ఆర్టికల్ 46 గిరిజనులకు రక్షణ కల్పిస్తోంది. దీంతో పాటు అట్రాసిటి చట్టం, ల్యాండ్ ట్రాన్సఫర్ ఆక్ట్ , పిసా ఆక్ట్ , RNR ప్యాకేజ్ , ఆటవిక సంరక్షణ హక్కు వంటి చట్టాలు ఆదివాసీల కోసం ఉన్నాయి.  వీటిలో చాలా చట్టాలన మన రాష్ట్రంలో అమలుచేస్తున్నామంటున్నారు అధికారులు.

ఆదివాసీల సంక్షేమం కోసం దళాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జల్ జమీన్ జంగల్ నినాదంతో కొమరంభీం ఆనాడు నిజాం సర్కార్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఇప్పటికీ అవే సమస్యలపై ఆదివాసీలు పోరాడుతున్నారు. తాగునీటికోసం కిలోమీటర్ల మేర్ల నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఎండాకాలంలో చెలిమెల్లోని మురికి నీరే అడవి బిడ్డలకు శరణ్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు లేని గూడెలు ఎన్నో. చాలా ఆదివాసీ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇటీవల కురిసిన వర్షాలకూ  ఓ ఆదివాసీ మహిళ వాగు ఒడ్డునే ప్రసవించిందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా అర్థం చేసుకొవచ్చు. ఏజెన్సీలో సకాలంలో వైద్యం అందక.. చిన్న పాటి జ్వరాలకే  ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

వాయిస్: ఆదివాసీ పిల్లల కోసం ఆశ్రమోన్నత పాఠశాలలు ఏర్పాటు చేసినా.. చాలా హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు లేక డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 30లోపే నమోదైంది.

ఇంగ్లాండ్ దేశానికి చెందిన హేమన్ డార్ఫ్ గోండుల గోస తెలుసుకొని దశాబ్ద కాలం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో నివసించారు. అడవిబిడ్డల దుర్భర స్థితిగతులు చూసి చలించి అక్కడే ఉండి ఆదివాసీల  ఉన్నతికి కృషి చేసారు. సుసంపన్న కుటుంబంలో పుట్టినా కనీస వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో ఉంటూ వారికి సేవ చేశారు. 1936లో ఉద్యోగ రిత్యా  మనదేశానికి వచ్చిన హేమన్ డార్ఫ్ ను 1940లో నిజాం ప్రభుత్వం గిరిజన తరగతుల సలహాదారుగా ఆదిలాబాద్ జిల్లాకి పంపించింది. అదే హేమన్ డార్ఫ్ కి గోండులతో విడదీయని అనుబంధానికి దారితీసింది. తన కుమారుడికి లచ్చుపటేల్ అనే గిరిజనుడి పేరు పెట్టెంతగా హేమన్ డార్ఫ్ ఆదివాసీలతో కలిసిపోయారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న గిరిజన సంక్షేమ చట్టాలు. అడవి, భూమి, నీరు పై ఆదివాసీలకు హక్కులు హేమన్ డార్ఫ్ కృషి వల్లే లభించినవే. కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన సమస్యలపై నిర్వహిస్తున్న దర్భార్ అప్పట్లో డార్ఫ్ ప్రారంభించిందే. ఇక వన్ బై సెవంటీ చట్టం , ఖాధీమ్ ఆక్వాయి అధికార వ్యవస్థ  సృష్టికర్త కూడా ఆయనే. రాయి సెంటర్ల ఏర్పాటుతో గిరిజన సమస్యల పరిష్కారానికి మార్గం చూపించారు హేమన్ డార్ఫ్.

హేమన్ డార్ఫ్ దంపతులు గోండులతో పూర్తిగా కలిసిపోయారు. 1987లో మరణించిన హేమన్ డార్ఫ్ భార్య ఎలిజబెత్  పార్థీవదేహాన్ని లండన్ తీసుకెళ్లే అవకాశం ఉన్నా ఆమె కోరిక మేరకు జైనూర్ మండల మార్లవాయిలో  గోండు సాంప్రదాయాలతో సమాధి చేశారు. 1995లో హేమన్ డార్ఫ్ లండన్ లో  చనిపోగా.. 17 ఏండ్ల తర్వాత ఆయన కుమారుడు లచ్చుపటేల్… డార్ఫ్ అస్థికలను తీసుకువచ్చి తన తల్లి సమాధి పక్కనే ఖననం చేశారు. గోండుల కోసమే జీవించిన హేమన్ డార్ఫ్ దంపతులు గిరిపుత్రుల గుండెల్లో ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆదివాసులు షెడ్యూల్ 5 కిందికి వస్తారు. పోడు చేసుకుంటున్న వ్యవసాయ భూమిపై వారికే  సర్వాధికారాలుంటాయని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఆదివాసీ గిరిజన భూములు ఎవరు కొన్నా లేదా ఆక్రమించినా చెల్లదని స్పష్టం చేసింది. అయినా గత పాలకుల నిర్లక్ష్యంతో గిరిపుత్రుల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయితే తెలంగాణ సర్కార్ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించింది. 2006 అటవీ హక్కు చట్టంను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఇప్పటి వరకు 95వేల22 మందికి 8లక్షల 9వేల059 ఎకరాల పట్టాలు ఇచ్చింది. 1/70 భూ బదలాయింపు చట్టం ద్వారా 31వే 881 మంది ఆదివాసులకు సుమారు లక్షా,5వేల590 ఎకరాలు కేటాయించింది. ROFR పట్టాలున్న రైతులకు రైతు బంధు వర్తింపచేస్తూ వారికి బీమా పత్రాలు అందిస్తోంది.

ఆదివాసుల జీవన శైలిపై అంతర్జాతీయ స్థాయిలో అనేక ధపాలుగా చర్చలు జరిగాయి. 1982లో ఆగస్టు 9న జెనీవా సమావేశంలో ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.  ఆగస్టు 9ని ఆదివాసీ ప్రజల దినోత్సవంగా ప్రకటించింది. మన రాష్ట్రంలో 1994 నుంచి ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేడుకలతో సరిపెట్టకుండా ఆదివాసీల సంక్షేమంపై  దృష్టి సారిస్తే వారి జీవితాల్లో  వెలుగులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy