ఇవ్వాలా వద్దా: ఉప సర్పంచ్ లకు చెక్ పవర్

grama-panchayat-telanganaసర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్‌ పవర్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా… ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తుండటంతో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలనుకుంటోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఉండేది. అయితే ఏప్రిల్‌ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి చెక్ పెట్టింది. దానికి బదులుగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై  నానా ఇబ్బందులు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్‌ పవర్‌ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం దారి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగియనుంది. తర్వాత అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్‌-ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy