ఇస్రో జయహో: ఒకే రాకెట్.. 104 శాటిలైట్స్

pslv-c37పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. అగ్ర దేశాలకు సాధ్యంకాని సరికొత్త రికార్డును సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెడీ అయింది. ఒకే రాకెట్ తో.. 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపే అద్భుత ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. భారత దేశానికి చెందిన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్ తో పాటు.. మరో 103 నానో శాటిలైట్లను నింగిలోకి పంపుతోంది ఇస్రో. నమ్మకమైన , అత్యంత విజయవంతంమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్  పీఎస్ఎల్వీ సీ 37 వాహక నౌక… ఈ రాకెట్లన్నింటినీ మూటగట్టుకుని బుధవారం అంతరిక్షంలోకి రివ్వున ఎగిరిపోనుంది.

103 చిన్న ఉపగ్రహాల్లో ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-1బీ శాటిలైట్లు మనదేశానికి చెందినవే. మిగతా 101 శాటిలైట్లు వివిధ దేశాలకు సంబంధించినవి. వీటిలో.. అమెరికాకు చెందిన 88 డవ్ రకం శాటిలైట్లు, అమెరికాకే చెందిన మరో 8 లెముర్ శాటిలైట్లు ఉన్నాయి. ఇంకా ఇజ్రాయెల్ కు చెందిన BGUశాట్, కజఖ్ స్థాన్ కు చెందిన అల్ ఫరాబీ-1 శాటిలైట్, నెదర్లాండ్స్ కు చెందిన పీస్ శాటిలైట్, స్విట్జర్లాండ్ కు చెందిన డిడో-2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నయీఫ్-1 ఉపగ్రహాలున్నాయి.

ఇస్రో చరిత్రలో ఇది 39వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ప్రయోగం.  ఈ 103 ఉపగ్రహాలు నానో శాటిలైట్లు కావడం వల్లే.. ఒకే రాకెట్ లో ప్రయోగించడానికి వీలవుతోంది. ప్రధానమైన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్ బరువు 714కేజీలు. 103 కో – ప్యాసింజర్ శాటిలైట్ల మొత్తం బరువు 664 కేజీలు. రాకెట్ మోసుకెళ్తున్న మొత్తం శాటిలైట్ల బరువు 1378 కేజీలు.

నెల్లూరు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. పదిహేనో తేదీ ఉదయం 9గంటల ఏడు నిమిషాలకు ప్రయోగం మొదలుకానుంది. పీఎస్ఎల్వీసీ 37 రాకెట్ హైట్ 44.4మీటర్లు. వెహికిల్ లిఫ్ట్ బరువు 320 టన్నులు అంటే.. 3లక్షల 20వేల కిలోలు. ఈ శాటిలైట్లను …. భూమి నుంచి 505కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనుంది రాకెట్.

ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. 28 నిమిషాల 42.8 సెకన్లలో ప్రయోగం పూర్తి కానుంది. 1 నిమిషం 50.8 సెకన్లలో తొలి దశ… 4 నిమిషాల 22.92 సెకన్లలో రెండో దశ… 8 నిమిషాల 12.22 సెకన్లలో మూడో దశ… నాలుగో దశలో ఇంజెక్షన్ ప్రక్రియ 16నిమిషాల 47.8 సెకన్లలో పూర్తవుతుంది. ఆ తర్వాత.. 17 నిమిషాల 29.8 సెకన్లలో కీలకమైన కార్టోశాట్2 సిరీస్ శాటిలైట్ రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత.. 17 నిమిషాల 39.8 సెకన్లలో INS 1A , 17 నిమిషాల 40.3 సెకన్లలో INS 1బీ సెపరేట్ అవుతాయి. ప్రయోగం మొదలైన 18 వ నిమిషం32.8 సెకన్ల సమయం దగ్గర నుంచి.. జతలు జతలుగా.. అంతర్జాతీయ నానో శాటిలైట్లు వేరు పడతాయి. అలా ప్రయోగం మొత్తం 28 నిమిషాల 42.8 సెకన్లలో పూర్తవుతుంది.

పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగంలో పెద్దది.. కీలకమైనది కార్టొశాట్ 2 సిరీస్ శాటిలైట్. ఇదివరకు పంపిన నాలుగు కార్టొశాట్ 2 సిరీస్ శాటిలైట్ల లాంటిదే ఈ ప్రయోగం కూడా. 505 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్ష్యలో శాటిలైట్ చేరిన తర్వాత.. దీని ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. దీనికి ఉన్న మల్ట్రీ స్పెక్ట్రల్, ఫొటోగ్రాఫికల్ కెమెరాల సాయంతో…  రెగ్యులర్ రిమోట్ సెన్సింగ్ సర్వీసెస్ ను శాటిలైట్ అందిస్తుంది. మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ స్టడీలో ఈ శాటిలైట్ పంపే ఫొటోలు ఉపయోగపడతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూముల గుర్తింపు.. తీర ప్రాంతాల పరిశీలన.. రోడ్ నెట్ వర్కింగ్ మానిటరింగ్… నీటి సరఫరా చేసేందుకు ఈ ఫొటోలు పనికొస్తాయి. ఈ కార్టొశాట్ 2 సిరీస్ శాటిలైట్… ఐదేళ్ల పాటు అంతరిక్షంలో సేవలు అందించనుంది.

ఈ శాటిలైట్ లో రెండు చిన్నతరహా శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపుతోంది. ఐఎన్ఎస్ 1ఏ బరువు 8.4 కేజీలు. ఐఎన్ఎస్ 1బీ బరువు 9.7 కేజీలు. ఫ్యూచర్ సైన్స్ ప్రయోగాలను మరింతగా చేసేందుకు ఈ శాటిలైట్లు తోడ్పడతాయి. పేలోడ్స్ పై మరింత అవగాహన పెంచుకునేందుకు ఇస్రోకు ఈ నానో శాటిలైట్లు ఉపయోగపడతాయి. ఈ రెండూ ఆరు నెలల పాటు అంతరిపక్షంలో సేవలు అందిస్తాయి.

ఐఎన్ఎస్ 1ఏ, 1బీ కాకుండా… మిగతా 101 నానో ఉపగ్రహాల్లో 96 శాటిలైట్లు అమెరికాకు చెందినవే. అమెరికా శాటిలైట్లు రెండు రకాలు. డవ్ ఫ్లాక్ 3 పీ శాటిలైట్లు.. ఒక్కోటి 4.7కేజీ బరువున్నాయి. ఇవి భూమి మొత్తాన్ని ప్రతిరోజూ ఫొటోలు తీస్తాయి. కమర్షియల్, పర్యావరణం, మానవ సహాయం కోసం.. ఈ ఫొటోలు పనికొస్తాయి. లెముర్ నానో శాటిలైట్లు మరొకరకమైనవి. వీటి బరువు 4.6 కేజీలు. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఉపయోగించి… భారీ షిప్ ల గమనాన్ని లెముర్ ఉపగ్రహాలు ట్రాక్ చేస్తుంటాయి. జీపీఎస్ ఉపయోగించి.. వాతావరణ వివరాలను కూడా అందిస్తాయి. ఈ రెండు రకాల శాటిలైట్లను అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్లానెట్ ఇన్ కార్పొరేటెడ్, స్పైర్ గ్లోబల్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు తయారుచేశాయి.

నెదర్లాండ్స్ కు చెందిన పీస్ ఉపగ్రహం బరువు 3 కేజీలు. యూరోపియన్ కన్సార్టియం తయారుచేసిన ఈ శాటిలైట్ .. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు పనికొస్తుంది. స్పేస్ ఫార్మా కంపెనీ రూపొందించిన స్విట్జర్లాండ్ డిడో-2 నానో శాటిలైట్ బరువు 4.2 కేజీలు. భూమి మీద భార రహిత పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇస్రాయెల్ బీజీయూ శాట్ బరువు 4.3 కేజీలు. ఇస్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ నిర్మించిన ఈ శాటిలైట్ ను… విమానాల టెక్నాలజీ అధ్యయనానికి  ఉపయోగిస్తారు. కజకిస్థాన్ తయారుచేసిన ఏ1 ఫరాబీ 1 శాటిలైట్ బరువు 1.7 కేజీలు మాత్రమే. అల్ ఫరాబీ కజక్ నేషనల్ యూనివర్సిటీ దీని బిల్ట్ చేసింది. యూఏఈ దేశపు నానో శాటిలైట్ నయిఫ్ వన్ బరువు 1.1 కేజీలు. ఈ రెండు చిన్న ఉపగ్రహాలు.. టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ లుగా సేవలందించనున్నాయి.

ఇస్రో కమర్షియల్ వింగ్ అయిన ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు .. వివిధ దేశాలకు మధ్య కమర్షియల్ అరేంజ్ మెంట్ లో భాగంగా..ఈ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సొంత పరిజ్ఞానంతో నిర్వహిస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy