ఈ పిల్లోడి తెలివికి హ్యాట్సాప్ : ఏడాదిలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి

41502027617_625x300చిన్నప్పుడు చదువులో పెద్దగా రాణించకపోయినప్పటికి 15 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఓ బాలుడు. అయితే మార్కులపై కాకుండా అభ్యాసంపైనే దృష్టి కేంద్రీకరించిన ఆ బాలుడు బీఈ (ఎలక్ట్రికల్‌) కోర్సును ఏడాదిలోనే పూర్తిచేసి.. గుజరాత్‌ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ (జీటీయూ)లో అత్యంత పిన్న గ్రాడ్యుయేట్‌గా రికార్డు సాధించాడు. ఇది జామ్‌నగర్‌కు చెందిన 15ఏళ్ల నిర్భయ్‌ ఠక్కర్‌ కథ. ఏడో తరగతి వరకూ నిర్భయ్‌ విద్యాభ్యాసం సాధారణంగానే సాగింది. అనంతరం పరుగులు పెట్టింది. ఎనిమిది నుంచి పది తరగతులను అతడు ఆరు నెలల్లోనే పూర్తిచేశాడు. తర్వాత కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐజీసీఎస్‌ఈ)ను మూడు నెలల్లోనే పూర్తిచేశాడు.

తొమ్మిది గంటలు కళాశాలలోనే 
ఇంజినీరింగ్‌లో ప్రవేశంపై జీటీయూ వృత్తివిద్య కోర్సుల ప్రవేశాల కమిటీ (ఏసీపీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)లను నిర్భయ్‌ ఆశ్రయించాడు. దీంతో ఎస్‌ఏఎల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశం దొరికింది. అతడి కోసం కళాశాల ప్రిన్సిపల్‌ రూపేశ్‌ వాసని ప్రత్యేక బోధనా ప్రణాళికను సిద్ధం చేయించారు. ‘రోజూ తొమ్మిది గంటలపాటు నిర్భయ్‌ కళాశాలలో గడిపేవాడు. జీటీయూ నిబంధనలకు అనుగుణంగా అతడికి ప్రశ్నపత్రాలు తయారు చేశాం. ఫలితాలను కూడా ప్రత్యేకంగా ప్రకటించాం’అని రూపేశ్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్భయ్‌ గాలిమరతో విద్యుత్తు ఉత్పత్తిచేసే యంత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఇది తక్కువ గాలి వీచినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేయడం విశేషం.

నాన్న సహకారంతోనే..
‘చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. మా నాన్న ఎంతో సహకరించారు. ప్రతి సబ్జెక్టులో ఆయన తనకు తోడ్పడ్డారు. వచ్చే మూడేళ్లలో పది ఇంజినీరింగ్‌ పట్టాలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పరిశోధన, అధునాతన పరికరాల అభివృద్ధి రంగంలో అడుగుపెట్టాలని భావిస్తున్నాను. దీంతో ఈ డిగ్రీలు చాలా ఉపయోగపడతాయి’అని నిర్భయ్‌ వివరించాడు. తీరిక సమయాల్లో చెస్‌, ఫుట్‌బాల్‌ ఆడతానని, స్విమ్మింగ్‌ కూడా చేస్తానని చెప్పాడు నిర్భయ్‌.

అభ్యాసం పైనే నిర్భయ్‌ దృష్టి 
‘మా అబ్బాయి చదువులో వెనుకపడ్డాడని ఉపాధ్యాయులు చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది. దీంతో వాడి ప్రతిభను వెలికితీసే బాధ్యతను భుజాలకెత్తుకున్నాను’అని నిర్భయ్‌ తండ్రి, ఇంజినీరు ధవళ్‌ ఠక్కర్‌ చెప్పారు. నిర్భయ్‌ విద్యాభ్యాసం కోసం ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశారు. ‘సంప్రదాయ పరీక్షలు విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షించడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాయి. దీంతో మార్కులపై కాకుండా అభ్యాసానికి ప్రాధాన్యమిచ్చే విధానాలను ఆశ్రయించాం. ఫలితంగా నిర్భయ్‌కు మార్కులంటే భయం పోయింది. చదవడంతోపాటు వినడం, చూడటం, అంశాలను నిత్యజీవితంలో ఆచరణలో పెట్టడం లాంటి విధానాలతో తక్కువ సమయంలోనే తను చాలా ఎక్కువ నేర్చుకోగలిగాడు’అని వివరించారు ధవళ్‌ ఠక్కర్‌. ఇదే విధానాన్ని మరింత మంది విద్యార్థులకూ చేరువ చేస్తానని ఆయన చెప్పారు.

ధవళ్‌ భార్య వైద్యురాలు. జీటీయూ చరిత్రలో అతిపిన్న ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు నిర్భయేనని వర్సిటీ ఉపకులపతి నవీన్‌ సేథ్‌ చెప్పారు. పది డిగ్రీలు సంపాదిస్తానని నిర్భయ్‌ చెప్పడంపైనా ఆయన స్పందించారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాభ్యాస అనుమతులు ఇస్తామని వివరించారు ఆయన.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy