ఈ రోజే సద్దుల బతుకమ్మ..!

batukammaబతుకమ్మ సంబురాలు ముంగిపుకొచ్చాయి. సద్దుల బతుకమ్మతో పూలజాతరకు వీడ్కోలు చెప్పే టైం వచ్చింది. 9  రోజుల వేడుకలను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ గంగమ్మ ఒడికి బతుకమ్మను పంపిస్తారు. బతుకమ్మ….తెలంగాణ బతుకు చిత్రం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఆడ బిడ్డల ఆటపాటల పండుగ. తీరొక్క పూల జాతర. ప్రకృతి పూలను ఆరాధించే పల్లె పండుగ. బతుకమ్మను పేర్చడం ఓ కళ. తంగేడు, ముత్యాల, గునుగు, చామంతి పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్దుతారు. బతుకమ్మ పైభాగంలో గౌరమ్మను ప్రతిష్టించి పూజలు చేస్తారు. నోచిన నోములు పండించే దేవతగా గౌరమ్మను కొలుస్తారు. తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు…కంటికే కనువిందు. 9 రోజులు ఊరు ఊరంతా బతుకమ్మ సంబరాలే. ఆత్మీయ పలకరింపులు, ఆటపాటలతో  అర్థరాత్రి దాకా వేడుకలు అలరించాయి. ఊయ్యాల పాటల్లో జనం ఊగిపోయారు. అన్నచెల్లెల అనుబంధాలు, మంచి చెడులు..బతుకమ్మ పాటల్లో ఆవిష్కరిస్తారు. కష్టసుఖాల కలబోతల గానం బతుకమ్మ పాట. ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా నిర్వహిస్తోంది సర్కార్. విద్యుత్ కాంతుల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్ ఫ్లైఓవర్ వెలిగిపోతున్నాయి. సాగరం మధ్యలోని బుద్ధ విగ్రహం చుట్టూ రంగురంగుల బతుకమ్మలు కొలువుదీరాయి. 60 లక్షల రూపాయల ఖర్చుతో 35 టన్నుల తీరోక్క పూలతో 25 వేల బతుకమ్మలను తయారు చేయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అర్థరాత్రి దాకా ఆటపాటల తర్వాత సద్దుల బతుకమ్మను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. బతుకమ్మను సాగనంపుతూ ఎన్నో పాటలు వాడుకలో ఉన్నాయి.

బంగారు బతుకమ్మైన…బహుజన బతుకమ్మైన…మరే పేరైన….తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నం ఈ పండగ. ఉద్యమానికి ఊపిరై…ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మ…యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంది. దేశవిదేశాల్లో బతుకమ్మలు దర్శనమిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఆదరణకు నోచుకొని ఈ పండుగకు తెలంగాణ సర్కార్ పబ్బతిపడుతోంది. ఆటపాటలతో బతుకమ్మకు కొత్త బతుకునిచ్చింది. రండి మనమూ బతుకమ్మ ఆటాడుదాం…పాటపాడుదాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy