ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

ఎన్ని విమర్శలొచ్చినా చెక్కుచెదరని, ఎన్నెన్ని అవాంతరాలు ఎదురైనా వెనుదిరగని ధీర చరితులు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. డెబ్భయ్‌ అయిదేళ్ల జీవితకాలంలో, లక్ష్యాల సాధనకు సంబంధించి ఆయనది తిరుగులేని పోరాట పటిమ. విదేశాంగ విధానం వంటి కీలక అంశాల్లో నాటి ప్రధాని నెహ్రూతో అభిప్రాయభేదాలొచ్చినా, కడదాకా విధినిర్వహణకు అంకితం కావడమే ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి నిలువెత్తు ప్రతీక!

వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. జవేరాభాయ్ పటేల్, లాద్బా పటేల్ దంపతుల ఆరుగురి సంతానంలో పటేల్ నాల్గోవాడు. చిన్నప్పుడు పుస్తకాలు కొనుక్కునే స్తోమత కూడా లేని పటేల్ ఏక సంథాగ్రాహి కావడంతో అలవోకగా పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఆచార్యుల మెప్పు పొందేవారు. మెట్రిక్యులేషన్ తర్వాత ప్లీడర్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడై ఆ తర్వాత గోద్రాలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ అందించిన సహాయంతో ఇంగ్లాండులో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగి స్వదేశానికి వచ్చి లాయర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. 1917లో మహాత్మాగాధీ దేశభక్తి, నిరాండబరత్వం నచ్చి ఆంగ్లేయుల పాలన నుంచి భరతమాత విముక్తికి దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. గాంధీజీతో పాటు సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణోద్యమాల్లో పాల్గొని కారాగారవాసం కూడా అనుభవించారు.

గుజరాత్‌లోని బార్డోలీలో రైతు ఉద్యమానికి సమర్ధవంతంగా నాయకత్వం వహించి ‘సర్దార్’ బిరుదు పొందారు. బ్రిటిష్ వారి గుండెల్లో సర్దార్ గుబులు పుట్టించారు. ఎట్టకేలకు భారతప్రజల స్వాతంత్ర్య కాంక్ష ఫలించి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి లభించింది. బ్రిటిష్‌ వలస పాలకులు నిష్క్రమించాక 554 రాజసంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్‌ పటేల్‌దే. ఒంటిచేత్తో భారతదేశ ఏకీకరణను సాధించి జనహృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారాయన. అయినా గడచిన అరవై ఏళ్లలో కేంద్రంలో ఏ ప్రభుత్వం పటేల్‌ గొప్పదనానికి సాధికార లాంఛనాలతో పట్టం కట్టడానికి ముందుకు రాలేదు. జాతీయ నాయక గణంలో పటేల్‌కు దక్కాల్సిన స్ధానాన్ని సగర్వంగా, సగౌరవంగా కట్టబెట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిశ్చయించింది.

దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన అగ్రనాయకుల్లో పటేల్‌ ముఖ్యమైనవారిలో ఒకరు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాలుపంచుకొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే దేశ విభజన వల్ల ఎదురైన సంకట స్థితిని అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. విభజన వల్ల పోటెత్తిన వలసలను నిభాయించడంలో, హింసాకాండను నియంత్రించడంలో పటేల్‌ ఉప ప్రధానమంత్రిగా, హోమ్‌ మంత్రిగా తిరుగులేని సత్తా ప్రదర్శించారు. అన్నింటినీ మించి 554 ముక్కలుగా విడిపోయి ఉన్న భారతదేశ ఏకీకరణను దిగ్విజయంగా పూర్తిచేశారు. ఈ బృహత్కార్యాన్ని నిర్వహించడానికి కావాల్సిన దూరదృష్టి, దృఢసంకల్పం తనలో దండిగా ఉన్నాయని నిరూపించుకున్నారు. ఉక్కుమనిషి పట్టుదలగా ఈ కార్యాన్ని పూర్తిచేసి ఉండకపోతే, దేశ రాజకీయ స్వరూపం ఇప్పుడున్న రీతిలో ఉండేది కాదు.

సర్దార్‌ విజయాలను సమగ్రంగా మననం చేసుకోవాల్సి ఉంది. బ్రిటిష్‌వారి నిష్క్రమణ తరవాత భారత్‌లో విలీనం కావాలా లేక పాకిస్థాన్‌లోనా, రెండూ కాకపోతే స్వతంత్రంగా ఉండాలా అన్నది తేల్చుకునే హక్కు రాజ సంస్థానాలకు దక్కింది. ఆ లెక్కన పాక్‌ సరిహద్దుకు దిగువన ఉన్న సంస్థానాలన్నింటినీ విలీనం చేసుకుంటే తప్ప సమైక్య భారతం సాకారమయ్యేది కాదు. సంస్థానాల్లో కొన్ని పాకిస్థాన్‌లో విలీనమైనా లేక స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నా ఐక్య భారత్‌ అసాధ్యమయ్యేది. భారత్‌ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ సంస్థానం మాదిరిగా ఇతర సంస్థానాలూ పాకిస్థాన్‌లో చేరిపోవాలనుకుంటే భారతదేశ సమైక్యత, సమగ్రతలు ప్రమాదంలో పడేవి. భారత్‌లో విలీనం కాని సంస్థానాలు పాకిస్థాన్‌కు ‘సీమాంతర ఉగ్రవాద స్థావరాలు’గా ఉపయోగపడి, భారతదేశ భద్రతకు ముప్పుతెచ్చిపెట్టేవి.

అనేక మినీ పాకిస్థాన్‌లతో భారతదేశ పటం అస్తవ్యస్థంగా కనిపించేది. ఈ ప్రమాదాలను నివారించాలంటే దేశ ఏకీకరణే ఏకైక మార్గం. దీన్ని సాధించడానికి అవసరమైన చొరవ, నేర్పరితనం, బుద్ధి సూక్ష్మత ఒకే ఒక వ్యక్తిలో ఉన్నాయనీ, ఆ వ్యక్తి సర్దార్‌ పటేల్‌ అనీ అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ గ్రహించారు. దేశ ఏకీకరణ బాధ్యతను పటేల్‌కు అప్పగించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అప్పగించిన పనిని శీఘ్రంగా నెరవేర్చారు. సంస్థానాధీశులకు నయానో భయానో నచ్చచెప్పి, మొత్తం 554సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. వాటిలో నిజాం ఏలుబడిలోని హైదరాబాద్‌ సంస్థానం అత్యంత పెద్దది.

నిజాం మొదటినుంచీ పాకిస్థాన్‌లో కలిసిపోవాలని ఉబలాటపడేవారు. భారత్‌లో విలీనం కావాలంటూ ఆయనకు నచ్చచెప్పడానికి పటేల్‌ అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ, నిజాం మనసు మార్చుకోలేదు. పైగా, తన సంస్థానంలో హిందువులపై జరుగుతున్న మతపరమైన హింసకు ప్రచ్ఛన్నంగా మద్దతు ఇచ్చారు. పటేల్‌ భారత సైన్యాన్ని పంపి హైదరాబాద్‌ ను భారత్‌లో కలిపారు. మరోవైపు జవహర్‌లాల్‌ నెహ్రూ హైదరాబాద్‌ భవితవ్యాన్ని నిర్ణయించుకొనే హక్కును ఆ సంస్థానానికే వదలివేయాలని, దాన్ని బలవంతంగా విలీనం చేసుకోకూడదని భావించారు. కానీ, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లోనే ఉండితీరాలని సర్దార్‌ పటేల్‌ నిశ్చయించారు.

ఆయన అలా ముందుచూపుతో వ్యవహరించకపోతే నేడు భారత్‌ నడిబొడ్డులో పాక్‌ పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఉండి ముప్పుతిప్పలు పెట్టేది. కాశ్మీర్‌ విషయంలో కూడా నెహ్రూ అభ్యంతరాలను సర్దార్‌ తోసిరాజన్నారు. శ్రీనగర్‌కు సకాలంలో సేనలను పంపి, అప్పటికింకా ఆక్రమణకు గురికాకుండా మిగిలిఉన్న జమ్మూకాశ్మీర్‌ భూభాగాన్ని భారత్‌ కు దక్కించగలిగారు. పటేల్‌ వేగంగా, స్థిరంగా వ్యవహరించి ఉండకపోతే శ్రీనగర్‌ శివార్లలో ఉన్న పాక్‌ సేనలు జమ్మూ కాశ్మీర్‌ అంతటినీ కబళించి ఉండేవి. భారతదేశ పశ్చిమ తీరంలోని జునాగఢ్‌ తదితర సంస్థానాలను సైతం సర్దార్‌ ఉక్కు పిడికిలితో భారత్‌లో విలీనం చేశారు. స్వాతంత్య్ర సేనానులు కలలుగన్న దేశాన్ని, మనమిప్పుడు చూస్తున్న రూపంలోని భారతదేశాన్ని నిర్మించిన వ్యక్తి సర్దార్‌ పటేల్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy