ఉగ్రదాడి:ఉలిక్కిప‌డ్డ మాంచెస్ట‌ర్ న‌గ‌రం..19మంది మృతి

కొన్ని నెల‌ల క్రితం ఇంగ్లాండ్‌లోని పార్ల‌మెంటు ఎదురుగా జ‌రిగిన దాడి ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రోసారి ఉగ్ర‌మూక‌లు రెచ్చిపోయారు. మాంచెస్ట‌ర్ న‌గ‌రంలో అమెరికా పాప్ సింగర్ అరియాన గ్రాండ్ మ్యూజిక‌ల్ నైట్ జ‌రుగుతుండ‌గా ఆ ప్రాంతం బాంబుల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది మృతి చెంద‌గా మ‌రో 50 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాన్స‌ర్ట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ ప్రాంతం 21వేల మందితో కిక్కిరిసి పోయిన‌ట్లుగా పోలీసులు చెప్పారు.

మ్యూజిక్‌ను వేల‌మంది ప్ర‌జ‌లు ఎంజాయ్ చేస్తుండ‌గా బాంబు పేలిన  శ‌బ్దం వినప‌డింద‌ని దీంతో అక్క‌డికి వ‌చ్చిన వారంతా పెద్ద‌గా కేక‌లు వేస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప‌రుగులు తీశార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. ఈ క్ర‌మంలోనే తొక్కిస‌లాట కూడా జ‌రిగింద‌న్నారు. అత్యంత భ‌ద్ర‌త‌గల దేశాల్లో బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. అయిన‌ప్ప‌టికీ ఉగ్ర‌వాదులు త‌మ ప‌నిని అంత సుల‌భంగా కానిచ్చేస్తుండ‌టంతో ఆ దేశంలో భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

మాంచెస్ట‌ర్ ఎరీనా యూర‌ప్‌లోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం.1995లో ఇది ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌రకు ఈ స్టేడియంలో ఎన్నో క్రీడ‌లు, మ‌రెన్నో లైవ్ కాన్స‌ర్ట్‌లు జ‌రిగాయి. అమెరికా పాప్ సింగర్ అరియానా మ్యూజిక‌ల్ నైట్‌కు వేలాది సంఖ్య‌లో సంగీత ప్రియులు వ‌చ్చారు. దీంతో భ‌ద్ర‌త కూడా క‌ట్టుదిట్టంగానే చేసినా ఈ త‌ర‌హా ఆత్మాహుతి దాడి జ‌రగ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఉగ్ర‌వాదంతో సంబంధ‌ముంద‌ని ఏ చిన్న అనుమానం వ‌చ్చినా వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుంటున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

మ‌రో రెండు వారాల్లో బ్రిట‌న్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌స్తుత‌ ప్ర‌ధాన‌మంత్రి థెరిసామే తిరిగి అధికార‌ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్న స‌మ‌యంలోనే ఈ దాడి జ‌ర‌గ‌టం.. థెరిసాను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy