ఉత్కంఠ రేపిన అంబులెన్స్ జర్నీ : చావుబతుకుల్లో చిన్నారి : 500 కిలోమీటర్లు ఆరు గంటలు..

ambulanceకేరళ రాష్ట్రం. కన్నూర్ జిల్లా కేంద్రం నుంచి తిరువనంతపురం. 500 కిలోమీటర్లు. ఎమర్జెన్సీ పేషెంట్. బస్సులో వెళితే కష్టం.. రైల్లో వెళ్లినా చేరుకోలేం. ఫ్లయిట్ అంటే కన్నూర్ జిల్లా కేంద్రంలో లేదు. విధిలేని పరిస్థితుల్లో అంబులెన్స్ లోనే 31 రోజుల శిశువును తరలించాలని నిర్ణయించారు వైద్యులు. గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించారు. ఆలోచిస్తే అసాధ్యం ఏమీలేదని డిసైడ్ అయ్యారు. ఆస్పత్రి వైద్యులు వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీని సంప్రదించారు. మీరు సాయం చేస్తే ఓ పాప ప్రాణం కాపాడిన వారు అవుతారు అని రిక్వెస్ట్ చేశారు. దీనికి ఓకే అన్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సిద్ధం అయ్యింది. జస్ట్ రెండు గంటల్లో మొత్తం యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్లే రహదారి కావటంతో రూట్ ఏమంతా బాగోలేదు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ కు సూచనలు, సలహాలు ఇచ్చారు. 500 కిలోమీటర్లను ఎనిమిది గంటల్లో చేరుకోవాలని చెప్పారు. శిశువు ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాం అని డ్రైవర్ కు సీరియస్ నెస్ వివరించారు.

ఈ రెండు గంటల్లోనే జిల్లా ట్రాఫిక్ పోలీసులు రూట్ లోని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసులు, పట్టణాలు, గ్రామాల్లోని వాలంటీర్లకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ కు దారివ్వాలని.. ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని.. అందులో ఓ శిశువు చావు బతుకుల్లో ఉందనే సమాచారంతో రిక్వెస్ట్ చేశారు. ఆ వెంటనే.. కన్నూరులోని పెరియారం మెడికల్ కాలేజీలో నవంబర్ 15వ తేదీ బుధవారం రాత్రి 8.30 గంటలకు అంబులెన్స్ స్టార్ట్ అయ్యింది. అంబులెన్స్ ఊరు దాటుతున్న వెంటనే వాట్సాప్ ద్వారా తర్వాత స్టేషన్ కు మెసేజ్ చేశారు. దీంతో 10 నిమిషాల ముందుగానే రోడ్ మొత్తం క్లియర్ చేసి పెట్టారు. అలా 500కిలోమీటర్లు అంబులెన్స్ కు ఆటంకం లేకుండా చూశారు. వాస్తవంగా తర్వాత రోజు ఉదయం 5 గంటలకు తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీకి చేరుకోవాలని టైం ఫిక్స్ చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యం.. పోలీసులు, వాలంటీర్ల చొరవతో కేవలం ఆరు అంటే 6 గంటల్లోనే.. తెల్లవారుజామున సరిగ్గా 3.20గంటలకు అంబులెన్స్ తిరువనంతపురం ఆస్పత్రికి రీచ్ అయ్యింది.

కన్నూరులో బయలుదేరిన అంబులెన్స్ క్యాలికట్, త్రిసూర్, ఎర్నాకుళం, అలప్పుజా మీదుగా ఈ జర్నీ సాగింది. ఈ రూట్ లో 150 కిలోమీటర్లు వన్ వే. రోడ్డు అంతగా బాగుండదు. మలుపులు ఎక్కువ. అయినా సరే డ్రైవర్ ఆరు గంటల్లోనే 500కిలోమీటర్లను నడపటం వండర్ అంటున్నారు. మధ్యలో కేవలం 20 నిమిషాలు మాత్రమే డీజిల్ కోసం బంకులో ఆగాడు. ఆ తర్వాత ఎక్కడా కూడా బండి ఆగలేదు. పాప ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచన మాత్రమే ఉందని.. టైం గురించి ఆలోచించలేదు అంటున్నాడు డ్రైవర్ తమీమ్. పోలీసులు, వాలంటీర్లు ఎక్కుడికక్కడ రూట్ క్లియర్ చేయటంలో సహకరించారని చెప్పాడు. తిరువనంతపురం చేరిన 31 రోజుల శిశువు ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతుంది. వెంటిలేటర్ పై ఉంది. సరైన సమయంలో పాపని తీసుకురావటం వల్ల ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వైద్యులు.

ఇలాంటి యాక్షన్ ఆపరేషన్స్ సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద జర్నీని సమర్దవంతంగా నిర్వహించటం గర్వంగా ఉందని చెబుతున్నారు కన్నూరు జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారులు. పాప ప్రాణాలు కాపాడామనే సంతృప్తి పడిన కష్టాన్ని దూరం చేసిందని చెబుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy