ఉత్తరాన వరద ఉద్ధృతి.. 206మంది మృతి

floodsభారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. బెంగాల్, అస్సాంలలో వరదల ఉద్ధృతి తగ్గింది. వర్షాలు తగ్గిపోవడంతో బెంగాల్, అస్సాం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. బీహార్, యూపీల్లో మాత్రం వరదలు ఇంకా అలానే ఉన్నాయి.

వరదలకు బీహార్ భారీగా నష్టపోయింది. వరదల కారణంగా ఆ రాష్ట్రంలో 153 మంది చనిపోయారు. 17 జిల్లాల్లోని 1688 పంచాయతీల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అరారియా జిల్లాలో 30 మంది, పశ్చిమ చంపారన్ లో 23, సితామరిలో 13, కిసాన్ గంజ్ లో 11, తూర్పు చంపారన్ లో 11 మంది చనిపోయారు. మొత్తం కోటీ 8లక్షల మంది వరదలతో ప్రభావితమయ్యారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ… అధికారులకు ఆదేశాలిస్తున్నారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. వరద ప్రాంతాల్లో హెలికాప్టర్లతో ఫుడ్ పాకెట్లను జారవిడుస్తున్నారు. 28NDRF బృందాలు 118 బోట్లతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. 2228 మంది ఆర్మీ జవాన్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. SDRF ఆధ్వర్యంలో 1765 కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేసి… ఆహారం అందిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోనూ వరదలు కొనసాగుతున్నాయి. నేపాల్ నుంచి బీహార్ మీదుగా వచ్చే నదుల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటోంది. తూర్పు ఉత్తరప్రదేశ్ మొత్తం వరదల్లో చిక్కుకుపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత జిల్లా గోరఖ్ పూర్ లోనే వరద ప్రభావం ఎక్కువగా ఉంది. 105 గ్రామాల్లో వరద ప్రభావం ఉండగా… 35 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. బలరాంపూర్, బస్తీ, సిద్దార్థ్ నగర్, బారాబంకి, అయోధ్య, లకింపూర్, మహరాజ్ గంజ్, గోండా జిల్లాల్లో వరద ఉంది. NDRF, ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా… సీఎం ఆదిత్యానాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఇక బెంగాల్, అస్సాంలు వరదల నుంచి బయటపడుతున్నాయి. మొన్నట్నుంచి వర్షాలు కురియకపోవడంతో… వరదలు చాలావరకు తగ్గాయి. వరదల కారణంగా బెంగాల్ లో 53 మంది చనిపోయారు. కూచ్ బిహార్, దక్షిణ్ దినాజ్ పూర్, ఉత్తర్ దినాజ్ పూర్, జల్పాయ్ గురి, అలిపుర్దార్, మాల్డా జిల్లాల్లో 15లక్షల మందిపై వరద ప్రభావం ఉంది. గత ఆరు రోజులుగా, రైలు, బస్ సర్వీసులను నిలిపేశారు.

అస్సాంలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఈ ఏడాది వరదల్లో 144 మంది చనిపోయారు. దాదాపు 26లక్షల మందిపై వరద ప్రభావం ఉంది. 2వేల210 గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. దాదాపు 3లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే బ్రహ్మపుత్ర నదిలో ప్రవాహం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy