తొలి తరానికి ఊపిరి, మలి తరానికి సారథి

jsప్రొఫెసర్ జయశంకర్ సార్… మలిదశ తెలంగాణ ఉద్యమ జ్యోతి.  సిద్ధాంత కర్త, తొలితరానికి ఊపిరై.. మలితరానికి మార్గదర్శియై.. జయహే తెలంగాణ నానాదానికి ఆయువుపట్టయ్యారు. తెలంగాణ నినాదమే ఎజెండాగా ముందుకు సాగారు. వివక్షను పశ్నించారు. దోపిడీపై కలం సంధించారు. నేను సిద్ధాంతకర్తను కాను స్వచ్ఛంద కార్యకర్తనే అంటూ.. తన బలం బలహీనత తెలంగాణే అన్నారు. చిరకాల స్వప్నం సాకారమైన వేళ ఆయన మన మధ్య లేకపోవటం బాధాకరం.

1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు జయశంకర్ సార్. బెనారస్, ఆలీఘడ్ యూనివర్సిటీల్లో చదివిన ఆయన.. ఉస్మానియాలో పీహెచ్ డీ చేశారు. 1952లో నాన్ ముల్కి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టారు. మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. 1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టి వరంగల్ సీకేఎం కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్ గా, 1991 నుంచి 1994వరకు కేయూ ఉప కులపతిగా సేవలందించారు. ప్రాంతీయ అసమానతలపై ఆధ్యయనం చేసిన జయశంకర్.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

నాటి చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకూ.. నేటి కేసీఆర్.. కోదండరాంలను కలుపుకొని పనిచేశారు జయశంకర్ సారు. కేసీఆర్ కు రాజకీయ గురువుగా.. సిద్ధాంత కర్తగా.. పనిచేస్తూ వచ్చారు. అవ్వాల్సిన చోట ఘనమై, ఇంకాల్సిన చోట ద్రవమై, వీచాల్సిన చోట వాయువై, రగలాల్సిన చోట నిప్పై ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నరనరాన తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని.. ఇంటికి పెద్దన్నలా చేయి చేయి కలిపి తెలంగాణ ఉద్యమ వంతెనను నిర్మించారు.

ప్రత్యేక తెలంగాణ వాదం కేవలం ఒక రాజకీయ నినాదం కాదని.. దానికి బలమైన కారణాలున్నాయి. విశిష్టమైన సాంస్కృతిక కోణం దాగుంది. సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేవారు..ప్రొఫెసర్ జయశంకర్. వీటన్నిటితో ఊపిరి పోసుకున్నది కనుకనే.. తెలంగాణ ఉద్యమం ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తొణకదని పిలుపునిచ్చారు.. జయశంకర్ సార్. వందల ప్రశ్నలకు తానొక్కడినే సమాధానం అంటూ ముందు వరుసలో నిలబడేవారు.

జయశంకర్ విద్యావేత్తగా ఎందరో విద్యార్ధుల విద్యాభివృద్ధికి పాటుపడ్డారు. తెలంగాణా ప్రజలకు ఉద్యమ పాఠాలు చెప్పారు. ఉద్యమం మరింత ఉద్ధృతంగా సాగేందుకు.. పేరు పేరునా తెలంగాణా ఆవశ్యకత తెలియజెప్పారు. జాతి బాధను తన బాధగా.. జాతి అభివృద్ధిలోనే తన అభివృద్ధి ఉందని తలిచారు జయశంకర్. ఆయన అందించిన స్ఫూర్తి మరవలేనిది. ఆయన లేని లోటు తీర్చలేనిది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy