ఉప్పల్ లో IPL : హైదరాబాద్ – రాజస్థాన్ ఫైటింగ్

SRHహైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలైంది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన మెగా టోర్నీ దక్కన్ వేదికపై ధమాకా అందించేందుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే  ఫస్ట్ మ్యాచ్ లో సన్‌రైజర్స్  రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ అంటే ఢీ అంటున్నది. ఆరెంజ్ జెండాలతో ఉప్పల్ స్టేడియం కళకళలాడుతున్నది.

రెండేండ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతున్నది. సోమవారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైంది. బాల్ టాంపరింగ్ కేసులో ఏడాది నిషేధం అనుభవిస్తున్న స్మిత్, వార్నర్‌లు గైర్హాజరవడంతో ఇరుజట్లూ కొత్త నాయకులతో బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్లు దూరమైనప్పటికీ అజింక్య రహానే కెప్టెన్సీలో రాజస్థాన్, కేన్‌విలియమ్సన్ నాయకత్వంలో హైదరాబాద్ జట్లు పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ ఐపీఎల్‌కే అత్యంత ఖరీదైన ఆటగాళ్లను తమ అమ్ములపొదిలో చేర్చుకున్న రాజస్థాన్ వారి నుంచి అదే స్థాయి ప్రదర్శనను కోరుకుంటున్నది. ఇరుజట్లు సమతూకంలో ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలో సన్‌రైజర్స్‌దే పై చేయి అని చెప్పొచ్చు.

సన్‌రైజర్స్:

వార్నర్ స్థానంలో జట్టులో చేరిన అలెక్స్ హేల్స్, ధవన్‌తో కలిసి ఓపెనింగ్‌లో అదురగొట్టేందుకు సిద్ధమయ్యాడు. భారీ షాట్లు ఆడగల హేల్స్ ఓపెనింగ్‌లో రావడం హైదరాబాద్‌ కు కలిసొచ్చే అంశం. మనీశ్‌పాండే, యూసుఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా, కార్లోస్ బ్రాత్‌ వైట్‌ తో మిడిలార్డర్ బలంగా ఉన్నది. బంగ్లా ఆల్‌ రౌండర్ షకీబ్, ఆప్ఘనిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలంతో  కట్టిపడేయగల సమర్థులు. భువనేశ్వర్ కుమార్, సందీప్‌శర్మతో పేస్ విభాగం పటిష్ఠంగా ఉన్నది SRH.

రాజస్థాన్:

టాపార్డర్‌లో సూపర్ స్టార్లు లేకపోయినప్పటికీ రహానే, సంజూ శాంసన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, జలజ్ సక్సేనా వంటి దేశీ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్‌లో ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్, వెస్టిండీస్ యువ సంచలనం జోఫ్రా ఆర్చర్ చెలరేగితే SRH కి కష్టాలు తప్పవు. పేస్ బౌలింగ్‌లో జైదేవ్ ఉనద్కట్, ధవల్ కులకర్ణి తమ మార్క్ చూపించేందుకు తహతహలాడుతున్నారు.

వర్షం ముప్పు

హైదరాబాద్ లో రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్-7) కూడా భారీ ఈదురుగాలులు వీచే, వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.  అయితే భారీ వర్షం వస్తే తప్ప.. మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం లేదని చెబుతున్నారు నిపుణులు. వర్షం వస్తే పిచ్‌ తడవకుండా ఉండేందుకు స్టేడియం సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy